ఫొటోగ్రఫీలో.. శ్రావణ్‌డర్స్‌!

పైసా పైసా కూడబెట్టి కెమెరా కొన్నాడు... ప్రకృతి అందాల్ని..  పల్లె సౌందర్యాన్ని ఒడిసి పడుతున్నాడు... తీసే ప్రతి చిత్రం ఓ కళాఖండంలా ఉండాలని తపిస్తాడు.

Updated : 09 Dec 2023 08:34 IST

పైసా పైసా కూడబెట్టి కెమెరా కొన్నాడు... ప్రకృతి అందాల్ని..  పల్లె సౌందర్యాన్ని ఒడిసి పడుతున్నాడు... తీసే ప్రతి చిత్రం ఓ కళాఖండంలా ఉండాలని తపిస్తాడు. ఆ సృజనాత్మకతని పదులకొద్దీ అంతర్జాతీయ, జాతీయ అవార్డులు వరించాయి... తాజాగా కేరళలో జరిగిన  పోటీల్లోనూ మెరిసిన అతగాడే.. ముప్ఫై ఏళ్ల తడండ్ల శ్రావణ్‌. అతడితో మాట కలిపింది ఈతరం.

శ్రావణ్‌ది ములుగు జిల్లాలోని పాలంపేట. చిన్నప్పుడు బ్యాడ్మింటన్‌, కుస్తీ పోటీల్లో చురుగ్గా ఉండేవాడు. జిల్లా స్థాయిలో బహుమతులూ గెలిచాడు. కానీ ఇంట్లోవాళ్లు చదువుపై దృష్టి పెట్టమనడంతో ఆటలకు స్వస్తి పలికాడు. నాన్న పర్యాటకశాఖ ఉద్యోగి. సెలవుల్లో ఆయనతోపాటు సరదాగా పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగేవాడు. ఆ సమయంలో పర్యాటకులు కెమెరాలు, సెల్‌ఫోన్లలో అక్కడి దృశ్యాలను బంధించడం తదేకంగా గమనించేవాడు. అయితే తను ఇంటర్లో ఉండగా.. చదువుతున్న కళాశాల అర్ధాంతరంగా మూతపడింది. ఇంటికే పరిమితం కావడంతో.. పూర్తిస్థాయిలో ఫొటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. అనుభవజ్ఞులు తీసిన చిత్రాలను పరిశీలించేవాడు. కొడుకు ఆసక్తి గమనించిన తండ్రి ఓ స్నేహితుడి కెమెరాను తీసుకొచ్చి ఇచ్చారు. దాంతోనే సరికొత్తగా ప్రయత్నించేవాడు. అడవి బిడ్డ, స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కావడంతో.. మొదటిసారి సమీపంలోని రామప్ప చెరువు అందాలు, రామలింగేశ్వరాలయం కళాఖండాలను తీసి అందరినీ మెప్పించాడు. తర్వాత కార్మిక, కర్షకుల శ్రమ సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం ప్రారంభించాడు. క్రమంగా గుర్తింపు రావడంతో తనకంటూ ఓ సొంత కెమెరా ఉండాలని భావించి, చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బులు కూడబెట్టి, దాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రతీ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని తపించేవాడు.

మేలి మలుపు

శ్రావణ్‌ తీసిన ప్రతి ఫొటోకి ప్రశంసలు పోటెత్తుతున్నా పైసా ఆదాయం ఉండేది కాదు. పైగా అప్పటికే అతడికి పెళ్లైంది. తనకిష్టమైన ఫొటోగ్రఫీనే సంపాదనకు మార్గంగా మలచుకోవాలనుకొని వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ ప్రారంభించాడు. ప్రతీదీ కొత్తగా ప్రయత్నించాలనే స్వభావం కావడంతో త్వరగానే కుదురుకున్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు లేని సమయంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లిపోయేవాడు. అలా వరంగల్‌ చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు.. సమ్మక్క-సారలమ్మ, బతుకమ్మ ఉత్సవాలు, కొమురవెళ్లి మల్లికార్జునుడి జాతర, గోదావరి పుష్కరాలు, గోవా సంబరాలు.. మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ముంబయి తీరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా తీసిన ఫొటోలు అతడిని ఓ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్‌గా మార్చాయి. సాధారణంగా ప్రతి చోటా విఘ్నేషుడి నిమజ్జనాలను భారీ క్రేన్‌లతో నిర్వహిస్తుంటారు. ముంబయి తీరంలో మాత్రం భక్తులు తమ చేతుల మీదుగా భారీ విగ్రహాలను పడవల్లోకి ఎక్కించి, సముద్రంలోకి తీసుకెళ్తారు. ఈ సమయంలో భక్తులు పడుతున్న శ్రమను ఫొటోలుగా మలిచి, సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. వీటికోసం గంటలకొద్దీ ఎదురు చూసేవాడినంటున్నాడు. ఈ ఛాయాచిత్రాలు వైరల్‌ అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ గెలుచుకున్నాయి. క్రమంగా ఫొటోగ్రఫీ పోటీల నుంచి ఆహ్వానమూ అందింది. తాజాగా గత నెలలో కేరళలో మూడురోజులపాటు జాతీయస్థాయి వర్క్‌షాప్‌ జరిగింది. అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, కూచిపూడి నృత్యం, పర్యాటక ప్రాంతాలు, కలారిపయట్టు యుద్ధకళ.. తదితరాల్ని తన కెమెరాలో బంధించి పోటీలో నిలిచాడు. విజేతగా మారాడు. ఎలాంటి ఫొటోనైనా.. అవలీలగా జీవకళ ఉట్టిపడేలా తీసే శ్రావణ్‌ ప్రస్తుతం సాధారణ, జాగ్రఫీ, వైల్డ్‌లైఫ్‌.. అన్నిరకాల ఫొటోగ్రఫీల్లోనూ రాణిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

శ్రావణ్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో దాదాపు యాభై వరకు పతకాలు, అవార్డులు గెలిచాడు. అందులో ముఖ్యమైనవి కొన్ని.

  • ప్రపంచ ఫొటోగ్రఫీలో అత్యంత గౌరవంగా భావించే ఫ్రాన్స్‌లోని ‘ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీ ఆర్ట్‌ ఫొటోగ్రఫీక్‌’లో గౌరవ సభ్యత్వం.
  • ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కాంటెస్ట్‌లో హానరబుల్‌ మెన్షన్‌. కోల్‌కతాలో శ్రీజన్‌ క్లబ్‌ నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో ద్వితీయ బహుమతి.
  • ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌, పీఏఐ సంయుక్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో ‘బెస్ట్‌ ఇమేజ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు.
  • ఫొటోగ్రఫీ అకాడెమీ ఆఫ్‌ ఇండియా సహకారంతో విజయవాడలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌ నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో బెస్ట్‌ ఇమేజ్‌ అవార్డు.
  • ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆల్‌ కేరళ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో ‘విలేజ్‌ లైఫ్‌’ అంశంలో ద్వితీయస్థానం.
  • ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫొటోగ్రఫీ నుంచి హానరర్‌ అవార్డు.
  • గత నెలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సిగ్మా అకాడెమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ ఇంటర్నేషనల్‌ పోటీల్లో మూడు అవార్డులు.
  • శ్రీలంక, అజర్‌బైజాన్‌, మలేసియా, సింగపూర్‌, అమెరికా, సెర్బియా, నేపాల్‌, ఫ్రాన్స్‌, చెక్‌రిపబ్లిక్‌ దేశాల్లోని పోటీల్లోనూ పాల్గొని అవార్డులు గుర్తింపు దక్కించుకున్నాడు.

ధర్మవరపు నారాయణరావు, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని