Updated : 25 Dec 2021 04:53 IST

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం!

వాట్సాప్‌లో వలపు సందేశాలింకా ముగియనేలేదు... ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోల చర్చలింకా ఆపనేలేదు... ట్విటర్‌లో స్వీట్‌గా చేసిన ట్వీట్‌ ఫ్రెండ్‌ ఇంకా చూడనే లేదు... ఫ్రెషర్స్‌ పార్టీకి ముస్తాబై వచ్చిన కాలేజీ అమ్మాయిలా కొత్త ఏడాది రానే వచ్చింది... ఈ కాలం పేజీల్ని ఒక్కసారి వెనక్కి తిరగేస్తే.. మెరుపుల జ్ఞాపకాలు కొన్ని.. బాధల మరకలు ఇంకొన్ని... ఆ అనుభవాలన్నింటినీ ఆవాహన చేసుకుంటూనే.. కొత్త యేటికి కోటి ఆశలతో స్వాగత తోరణాలు కట్టేద్దాం రండి!

మిక్చర్‌పొట్లంలోని తీపి.. పులుపు.. కారం.. వగరులా 2021 సంవత్సరం కుర్రకారుకి అన్ని రుచులూ వడ్డించింది. టాప్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న యూత్‌కి కరోనా స్పీడ్‌బ్రేకర్‌లా అడ్డుపడింది.  దాంతో కుర్ర జనం ‘ఒళ్లు’ దగ్గర పెట్టుకొని మసిలారు. ఇక ఈ ఏడాదిలో పదినెలలు గడిచినా సరదాల కార్యక్షేత్రాలైన కాలేజీలు తెరుచుకోనేలేదు. క్యాంటీన్‌లో గుసగుసలు కరవయ్యాయి.. ఇష్టసఖుల కువకువలు అరుదయ్యాయి. చిన్నచిన్న సంతోషాలకు కామా పడ్డా ఎలాగో సర్దుకుపోగలం గానీ పాడు మహమ్మారి ఏకంగా జనం జీతం, జీవితాలపైనే దెబ్బ కొట్టింది. ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌’ సంస్థ లెక్కల ప్రకారం కొవిడ్‌ ప్రభావం కారణంగా చిన్నాచితకా అన్నీ కలిపి ఈ రెండేళ్లలో ఇండియాలో కోటి ఉద్యోగాలు ‘ఉఫ్‌’మన్నాయట. దీనికి అదనంగా జీతాల్లో కోతలతో యువ ఉద్యోగులు పడ్డ వెతలు చెప్పనలవికానివి. పైపెచ్చు సర్కారు కొత్త కొలువుల ఊసే లేదాయే! చేసేదేం లేక మనోళ్లు పొదుపు మంత్రం జపించారు. ఈ గడ్డుకాలాన్ని ఎదురొడ్డడానికి జనమంతా జీవితాలతో చిన్నపాటి యుద్ధాలే చేశారంటే నమ్మొచ్చు. ద్వితీయార్థంలో ఈ కారుమేఘాలు కాస్త తొలగడంతో ఐటీ కంపెనీలు ఆఫర్‌ లెటర్లతో క్యాంపస్‌ల బాట పట్టాయి. నడివేసవిలో చిరుజల్లుల్లా కష్టకాలంలో యువతకు ఇది పెద్ద ఊరటే.

టెక్నాలజీ ఊపుతో ప్రపంచమే కుగ్రామంగా మారిందన్నది పాత సంగతి. కరోనా పుణ్యమాని ఇల్లే ఓ ప్రపంచమవడం ఈ ఏడాది వైచిత్రి. అన్ని రంగాల్లో, అన్ని ఉద్యోగాల్లో వర్క్‌ ఫ్రం హోం కొనసాగింది. దాంతో కుర్ర ఉద్యోగులు ల్యాపీలకే అతుక్కుపోయారు. పనిలో పనిగా పాల ప్యాకెట్‌ నుంచి పరమాన్నాల దాకా అన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహాలు.. ఓహో అనేలా వినోదం పంచడంతో.. టీవీలు, కంప్యూటర్లకే కళ్లప్పగించారు. థియేటర్లు మూతపడటంతో ‘జనం మా దగ్గరికి రాకపోతేయేం.. మేం మీ దగ్గరికే వస్తా’మంటూ పెద్ద హీరోలు కూడా నెట్టింటికొచ్చి సందడి మొదలెట్టేశారు. ఈ ఓటీటీల ఊపుతో వెబ్‌సిరీస్‌ల హవా ఎక్కువైంది. అందుకే గతేడాదితో పోలిస్తే 2021లో ఓటీటీ వీక్షకుల సంఖ్య అమాంతం ఎనభైశాతం పెరిగిందట. ఈ మహరాజ పోషకులంతా మన యువతేనని మరీమరీ చెప్పాల్సిన పనిలేదుగా! ఇక ఆన్‌లైన్‌ మీటింగ్‌లు, వీడియో చాటింగ్‌లు.. అప్పుడప్పుడు కొన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టాయి. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేకే అగర్వాల్‌ వీడియో మీటింగ్‌ మధ్యలో తన భార్య ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేశాడు. ఇంట్లో ఏం వెలగబెట్టాడోగానీ ఆయన భార్య లైవ్‌లోనే చీవాట్లు పెట్టేశారు. ‘దిల్లీకి రాజైనా పెళ్లానికి లోకువే..’ అంటూ నెటిజనం ఆన్‌లైన్‌లో ఆటాడేసుకున్నారు. అదేరకంగా జూమ్‌ మీటింగ్‌లో ఉన్న ఓ పెద్దాయనకి చిలిపిగా ముద్దివ్వబోయిన ఓ అర్ధాంగి యవ్వారం అంతర్జాలంలో హాస్యం పండించింది. అలాగే కరోనాని తరిమేద్దాం అని కేరళ యువ వైద్య జంట త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీలో చేసిన డ్యాన్స్‌ వీడియో.. మిలియన్ల లైక్‌లు కురిపిస్తే.. ‘లవ్‌ యూ జిందగీ...’ అని పాడుతూ కరోనాతో పోరులో ఓడిపోయిన ముప్ఫై ఏళ్ల దిల్లీ అమ్మాయి క్లిప్‌ దేశాన్ని కంటతడి పెట్టించింది. ఈ సంవత్సరం ఇవన్నీ వైరల్‌ వీడియోలు. ఫేస్‌బుక్‌ పేరు మార్చుకొని ‘మెటా’గా మారిపోయింది ఈ ఏడాదే. ప్రథమార్థంలో షోకిల్లారాయుళ్లు.. సక్కనమ్మలకు సొగసులు ప్రదర్శించే అవకాశమే లేకుండా పోవడంతో.. తప్పనిసరిగా ధరించే మాస్కులనే సొగసు కాన్వాసులుగా మార్చేశారు. మొత్తానికి కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంలా చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది.


ఫ్యాషన్ల పరవళ్లు

అటా? ఇటా?.. ఇంటా? బయటా? అని సందేహించిన ఫ్యాషన్లు కాలం కలిసి రాగానే పరుగులు పెట్టాయి. 2021 ద్వితీయార్థం నుంచి సొగసు మేళాలు ఊపందుకున్నాయి. తారల నుంచి గల్లీ మోడళ్ల దాకా.. కుర్రకారు నుంచి మేటి డిజైనర్ల దాకా మెచ్చిన, మేనిని చుట్టేసిన ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇవి.
* బోల్డ్‌ ప్రింట్లు: ఈ సొగసులనామ ఏడాదిలో ఫారిన్‌ నుంచి పక్కింటిదాకా అంతా ఓటేసిన ట్రెండ్‌.. బోల్డ్‌ ప్రింట్లు. ఇందులోనూ మల్టీ కలర్లు మరింతగా ఆకట్టుకున్నాయి. జంప్‌సూట్లు, కుర్తీలు, చీరలు.. వేటిపై అయినా ఒద్దికగా ఒదిగిపోయి రంగురంగుల్లో ఒయ్యారాలు ఒలకబోయడం ఎవరికి నచ్చకుండా ఉంటుంది? మన సమంతా మొదలుకొని హాలీవుడ్‌లో సందడి చేస్తున్న ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనేలు ఈ బోల్డ్‌ ప్రింట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు.
*క్రాప్‌ టాప్స్‌: స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉండటానికి ఇష్టపడే అమ్మాయిలు క్రాప్‌ టాప్స్‌, షార్ట్‌ క్రాప్‌లను బాగా ఆదరించారు. జీన్స్‌, డెనిమ్స్‌కి జతగా వేసుకునే అవకాశం ఉండటంతో మెట్రో నగరాల నుంచి ఓ మోస్తరు పట్టణాల్లోని అమ్మాయిల వార్డ్‌రోబ్‌లలో వీటికి చోటు దక్కింది.
* కాటన్‌ సల్వార్‌ కమీజ్‌లు: కాలాలెన్ని మారినా అమ్మాయిల ఆదరణ తగ్గని డ్రెస్‌.. సల్వార్‌ కమీజ్‌. ఈ సంవత్సరం ప్రత్యేకం.. ఈ డిజైన్‌లో అచ్చమైన కాటన్‌కి పెద్దపీట వేయడం. ముఖ్యంగా వేసవిలో తెలుపు రంగు కాటన్‌ డ్రెస్‌లకు అంతా ఓటేశారు.
* ఓవర్‌సైజ్డ్‌: ఈ ఏడాది అమ్మాయిల్ని సర్‌ప్రైజ్‌ చేసిన ట్రెండ్‌ ఓవర్‌సైజ్డ్‌ టాప్స్‌ లేదా టీషర్టులు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఈ స్టైల్‌తో కుర్రకారు వీధులను ఫ్యాషన్‌ ర్యాంప్‌గా మలిచేశారు. ఇదే ఒరవడిలో అమ్మాయిలు పెద్ద సైజు జాకెట్స్‌ ధరిస్తే వీటిని బోయ్‌ఫ్రెండ్‌ జాకెట్లు అన్నారు.
కుర్రాళ్లైతే అంతకుముందు నుంచే ఉన్న చినోస్‌ ప్యాంట్లపై తెగ మోజు చూపించారు. ఈ ఏడాది క్యూబన్‌ కాలర్‌ షర్ట్‌లు కొత్తగా అబ్బాయిల ఒంటిపైకి చేరాయి. లినెన్‌ షర్ట్‌లు హాట్‌ ఫేవరిట్‌గా మార్చుకున్నారు. సౌకర్యం, స్టైలిష్‌గా ఉండటంతో ఎక్కువమంది వీటికి ఓకే చెప్పారు. కార్గో డిస్ట్రెస్‌ డెనిమ్స్‌.. అబ్బాయిల వార్డ్‌రోబ్‌లో చేరిన మరో ఔట్‌ఫిట్‌. పాదరక్షల విషయానికొస్తే కుర్రాళ్ల హాట్‌ ఫేవరెట్‌గా ఈ ఏడాది తెలుపు రంగు స్నీకర్లను చెప్పుకోవచ్చు.


* పేస్టల్స్‌: ఈ ఏడాది పేస్టల్‌ షేడ్‌ ఔట్‌ఫిట్‌లతో కుర్రకారు క్యాట్‌వాక్‌లు చేశారు. చూడటానికి హుందాగా, గంభీరంగా ఉండటంతో పండగలు, ఉత్సవాల్లో యువత వీటికే పెద్దపీట వేశారు. ఈ స్టైల్‌ సైతం సినిమా తారలు చూపిన బాటే. సమంతా ఇన్‌స్టాలో ఈ పేస్టల్‌ డిజైన్‌ చీరకట్టు ఫొటో పెడితే జనం పోటీలు పడి మరీ లైక్‌లు కొట్టారు.


మది గెలిచిన విజేతలు

కొన్ని విజయాలు.. మన మనసుల్ని పట్టి కుదిపేస్తాయి. మనమూ ఏదో సాధించాలనే కాంక్షకు ప్రేరణగా నిలుస్తాయి. అలాంటి ముచ్చటైన ముగ్గురు విజేతలు.

రాకెట్‌ ఎగిసింది

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా మన షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ స్పెయిన్‌లో జరిగిన ‘వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’లో రజతం సాధించాడు. అడపాదడపా విజయాలు సాధిస్తున్న తనకి ఇది ఊపునిచ్చేదే. దీంతో తను పురుషుల విభాగంలో ప్రపంచ పతకం గెల్చిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పనిలో పనిగా టాప్‌ టెన్‌లోకి దూసుకెళ్లాడు. ఈ ఘనత సాధించడానికి ఎంతో శ్రమించానంటాడు శ్రీకాంత్‌. ఫిట్‌నెస్‌ లేకపోవడంతో కొన్ని టోర్నీలకు దూరం కావాల్సి రావడం.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కి ఎంపిక కాకపోవడం లాంటి సంఘటనల తర్వాత దక్కిన ఈ చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తించుకోతగ్గదే.


అందం మురిసింది

ఈ ఏడాది ఫెమీనా మిస్‌ ఇండియా కిరీటం గెలిచిన మానస వారణాసి మన తెలుగమ్మాయే. పదేళ్లకే ‘అందాల కల’ను ఎంచుకొని అన్నిరకాలుగా సిద్ధమై చివరికి అనుకున్నది సాధించింది. ఇప్పుడు తన తర్వాత లక్ష్యం మిస్‌ వరల్డ్‌. ఈ అందగత్తెది అందమైన మనసు కూడా. ఓ స్వచ్ఛందసంస్థతో కలిసి పని చేస్తోంది. మానస విజయంతో తెలుగు రాష్ట్రాల్లో సొగసుల కార్ఖానాలకు మళ్లీ గిరాకీ రావడం ఖాయమంటున్నారు.


వైకల్యం ఓడింది

కారు ప్రమాదం కారణంగా పదకొండేళ్లకే అవిటితనం వచ్చింది. అయినా కుంగిపోలేదు రాజస్థాన్‌ అమ్మాయి అవనీ లేఖరా. తానేంటో నిరూపించుకోవాలనుకుంది. షూటింగ్‌ ఎంచుకొంది. ఈ ఏడాది పారాలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళగా  చరిత్ర సృష్టించింది.


గురి తప్పలేదు

ఈ సంవత్సరం మన క్రీడారంగం వెలుగులీనింది. సందేహాందోళనల మధ్య నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా చెలరేగిపోయారు. జావెలిన్‌త్రోలో నీరజ్‌ పాండే బంగారు పతకాన్ని కొల్లగొడితే బాక్సర్‌ మీరాబాయి చాను రజతం ఒడిసి పట్టింది. తెలుగమ్మాయి సింధు కాంస్యంతో తిరిగొచ్చింది. మొత్తమ్మీద ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో నాలుగు దశాబ్దాల రికార్డుని తిరగరాశారు. భారత సంతతి న్యూజిలాండ్‌ ఆటగాడు అజాజ్‌ పటేల్‌ టెస్ట్‌ క్రికెట్‌లో పదికి పది వికెట్లు తీశాడు. పారాలింపిక్స్‌లోనూ మనవాళ్లు మెచ్చుకోలు ప్రదర్శన చేశారు. రికార్డు స్థాయిలో 19 పతకాలు కొల్లగొట్టారు. క్రికెట్‌కి కూడా చెప్పుకోదగ్గ మంచి రోజులున్నాయి ఈ సంవత్సరం. ఆస్ట్రేలియా కంచుకోట ‘గబ్బా మైదానం’లో మనవాళ్లు కంగారూలను మట్టి కరిపించారు. ఇంగ్లండ్‌ వెళ్లి టెస్ట్‌ సిరీస్‌ గెల్చుకొచ్చారు. మన మిథాలీరాజ్‌ మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన మహిళగా చరిత్ర సృష్టించింది. మొత్తమ్మీద మన క్రీడాకారులు అంచనాలకు మించి రాణించడంతో భారత క్రీడారంగానికి ఇది మర్చిపోలేని ఏడాదే.

మనం ఓ పుస్తకాన్ని తెరుద్దాం...ఖాళీగా ఉన్న పేజీల్లో మనకు మనమే కొన్ని అక్షరాల్ని లిఖిద్దాం. ఆ పుస్తకానికి ‘అవకాశం’ అని పేరు పెట్టుకుందాం. అందులో మొదటి పాఠమే.. కొత్త ఏడాది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని