ఇరవై నిమిషాలు ఇష్క్‌తో!

ఫస్ట్‌ సెమిస్టర్‌.. సెకండ్‌ సెమ్‌.. మొత్తానికి ఇంజినీరింగ్‌ చివరికి వచ్చే వరకూ పోరాడితేగానీ వికాస్‌ని భూమి ప్రేమించలేదు. ఒక్కసారి ప్రేమకి పచ్చజెండా ఊపిందో లేదో వికాస్‌ రిలాక్స్‌ అయిపోయాడు. చిన్న చిన్న విషయాల్ని సైతం భూమిక తనతో పంచుకునేది. పోనూ.. పోనూ.. ఆ షేరింగ్స్‌ కొరత ఏర్పడింది. ఆ దూరం భారమై ఇద్దరి మధ్య బంధాన్ని తెంచుకునే ..

Updated : 31 Dec 2018 17:28 IST

మొన్నేమో.. టాలీవుడ్‌లో చైతూ, శామ్‌ 
నిన్నేమో... అనుష్క, విరాట్‌ 
ఇప్పుడు.. బాలీవుడ్‌లో రణ్‌వీర్‌, దీపికా 
బంధంలో ఉన్నప్పుడు.. పెళ్లితో ఒక్కటవుతున్నప్పుడు.. మిలీనియల్స్‌కి వాళ్లే ఓ హాట్‌ టాపిక్‌ 
వావ్‌!! చక్కని జంటనో.. ఆల్‌ ది బెస్ట్‌అనో.. వాళ్లను పొగడటమేనా? మన బంధాలు ఎంత బలంగా ఉన్నాయి? 
మన అనుబంధాలను ఎంతగా కాపాడుకుంటున్నాం? మన బంధుమిత్రులను ఎంత పదిలం చేసుకుంటున్నాం? 
ఎప్పుడైనా ఆలోచించారా? విధిగా ఆలోచించాలి!! 
ఇలా ఆలోచించక ఎంతో మంది యువత.. ఒంటరిగా మిగిలిపోతున్నారు. మరి అలా కావద్దంటే ఏం చేయాలి?

ఇరవై నిమిషాలు ఇష్క్‌తో!

ఫస్ట్‌ సెమిస్టర్‌.. సెకండ్‌ సెమ్‌.. మొత్తానికి ఇంజినీరింగ్‌ చివరికి వచ్చే వరకూ పోరాడితేగానీ వికాస్‌ని భూమి ప్రేమించలేదు. ఒక్కసారి ప్రేమకి పచ్చజెండా ఊపిందో లేదో వికాస్‌ రిలాక్స్‌ అయిపోయాడు. చిన్న చిన్న విషయాల్ని సైతం భూమిక తనతో పంచుకునేది. పోనూ.. పోనూ.. ఆ షేరింగ్స్‌ కొరత ఏర్పడింది. ఆ దూరం భారమై ఇద్దరి మధ్య బంధాన్ని తెంచుకునే స్థాయికి వెళ్లింది.

మమత, వరుణ్‌.. ఆఫీస్‌లో స్నేహితులు. ఓ ఏడాది కాలం సంతోషంగా గడిచిపోయాయ్‌. ఓ రోజు ఇద్దరూ కలిసి లంచ్‌ చేస్తూ తీసుకున్న సెల్ఫీల్ని వరుణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టాడు. మమతకి అది నచ్చలేదు. తనని అడక్కుండా తీసుకున్న చొరవ వారి మధ్య బంధానికి అడ్డుగోడలు నిర్మించింది.

ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నారు రిషి, భవ్య. అర్థవంతంగా జీవించాలనుకున్నారు. రిషికేమో ఏదైనా విడమరిచి చెప్పే అలవాటు. కానీ, భవ్య అలా కాదు. తను చెప్పకుండా రిషి అర్థం చేసుకోవాలని ఆశిస్తుంది. అలానే ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు రిషీ ఆశించినట్టుగా స్పందించకపోవడం.. మాటా మాటా పెరగడం.. దీంతో వారి మధ్య పూడ్చలేని అగాధం.

... ఇలా అనుబంధం ఏదైనా ఓ ఇద్దరి మధ్య బంధం దారంలా సున్నితంగా మారి తెగిపోతోంది. అవగాహనాలేమితో పిచ్చి గీతలు ఎన్ని గీసుకున్నా.. చివరికి అవన్నీ చెరిపేసి అందమైన బంధమనే కావ్యం రాసి చివర్లో కలిసి సంతకాలు చేస్తున్నవారూ చాలా మందే. సెలబ్రిటీల్లో కొన్ని జంటలు ఇలా ఒక్కటైనవారే! మన్ననలు అందుకున్నవారే. మరి, మన అనుబంధాల పుటల్ని అలా మధుర జ్ఞాపకాలుగా మలుచుకోవాలంటే? మీదైన అందమైన ప్రపంచంలో మీరూ ‘కపుల్‌ ఆఫ్‌ ది స్ట్రీట్‌’గా మారాలంటే? రోజుకి ఓ ఇరవై నిమిషాలు చాలు. టెక్నాలజీ పరిభాషలో చెబితే... మొబైల్‌లో అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్‌ చేసేందుకు పట్టే సమయం.. అంతే!! మీ బంధాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఆ కాస్త సమయాన్ని ఇష్క్‌తో కేటాయించండి.

మనసు విప్పండి

మదిలోని ఆలోచనల్ని    విధిగా పంచుకోవాలి. నా వాళ్లేగా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అనుకోవద్దు. విడమరిచి చెప్పందే ఎవరికైనా ఏదీ అర్థం కాదు

కడదాకా మీకు మీరే!

జంటగానే జర్నీ ప్రారంభం అవుతుంది. మధ్యలో ఎవరొచ్చినా.. ఎలాంటి పాత్ర పోషించినా.. కడకు జంటగా మిగిలేదీ ఇద్దరే అన్న ప్రాధాన్యతని గుర్తించి సమయం కేటాయించుకోవాలి.

ఏం కావాలో అడగండి

నాకేం చేస్తున్నారు? అని ఆలోచించడం మాని.. ఎదుటివారికి ఏం కావాలో అడగండి. ఇంట్లో ఎప్పుడూ భార్యే ‘ఏం వండమంటావ్‌?’ అని అడుగుతుంది. ఓ పూట మీరు అడగండి. ‘ఏం వండమంటావ్‌?’ అని. మాటతో మీరు తనకి ఇచ్చే ప్రాధాన్యతకి భాగస్వామి ఫిదా అవుతుంది.

అనుమతి కోరండి

చాలా కాలంగా పరిచయం ఉందనో.. స్నేహితులమే కదా అనో.. అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలోగానీ మరెక్కడైనా వారికి సంబంధించిన విషయాల్ని పంచుకోవద్దు.

మాటలు బాధిస్తాయ్‌

కోపంలోనో... అపార్థం చేసుకునో.. జారిన మాటలు ఎంతగానో బాధిస్తాయ్‌. కనిపించని బలమైన గాయాలుగా మారతాయ్‌. అవి మానాయో లేదో తెలుసుకోవడమూ కష్టమే.

తిరిగి ఇవ్వాలి

మనం బిజీ. ఆఫీసు, అప్పుడే కొత్తగా వచ్చిన ఇల్లాలు... మరి మనల్ని ఇంతకాలం చూసుకున్న అమ్మానాన్నల పరిస్థితి ఏంటి? రోజూ తీరక లేకపోయినా వారానికి ఒకసారైనా వారితో గడపడానికి సమయం ఇవ్వండి. వారితో కూర్చొని కొద్దిసేపు మాట్లాడండి. వారికి ఇష్టమైన చోటుకి తీసుకెళ్లండి. ఇది మీ మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదం చేస్తుంది.

ఓపిగ్గా వినాలి...

ఉద్దేశాలు ఏవైనప్పటికీ చెప్పేది వినడం అలవాటుగా మార్చుకోవాలి. వినే ప్రతిదానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదుకానీ... ప్రతీది వినాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి ఎలాంటి మూలాల నుంచి మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. దీంతో వారి స్థాయిని అర్థం చేసుకోవడం వీలవుతుంది.

మూడు పదాల్లో ఏదొకటి

సందర్భం ఏదైనా... ఎక్కడున్నా.. మదిలో కలిగిన భావాల్ని వెంటనే చెబుతుండాలి. ఆఫీస్‌కి హడావిడిగా రెడీ అవుతున్నప్పుడు భార్య లంచ్‌బాక్స్‌ చేతికి ఇస్తే లాక్కుని వెళ్లిపోకుండా... తీసుకుని చిరునవ్వుతో ‘లవ్‌ యూ’ చెప్పండి. తిన్నాక ‘వంటలు బాగున్నాయ్‌.. థ్యాంక్స్‌’ అని మెసేజ్‌ పెట్టండి. ఈ రోజు త్వరగా వస్తానని లేటుగా ఇంటికి వెళ్లినప్పుడు ‘సారి’ చెప్పేందుకు వెనకాడొద్దు. అర్థం చేసుకుంటుందిలే అని వదిలేయకండి.

వాట్సాప్‌ వేదికగా..

చదువు.. ఉద్యోగం.. నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తుంది. అలాంటప్పుడు దూరం భారమైనా ఇరువురి బంధం బలంగా కొనసాగేందుకు మార్గాల్ని వెతకాలి. ఉదాహరణకు ఇంటి నుంచి దూరంగా వెళ్లి చదువుకుంటున్న వారికి ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ని మిస్‌ అవ్వకుండా ఓ వాట్సాప్‌ గ్రూపుని క్రియేట్‌ చేయొచ్చు. ఎవరు ఎక్కడున్నా ఒకరినొకరు ప్రోత్సహించుకునేలా.. ఉత్సాహపరుచుకునేలా గ్రూపులో ప్రేమని పంచుకోవాలి. వీడియో కాల్‌్్స ఎలాగూ ఉన్నాయి కదా!

‘గ్రాంటెడ్‌’ అనుకోవద్దు

లవరు, స్నేహితుడు, భార్య, భర్త, అమ్మానాన్నలు... ఇలా ఎవరితోనైనా ముడిపడిన బంధం మీకేదో అధికారికంగా మంజూరైందిగా (గ్రాంట్‌) అనుకుంటే బంధాలు మోయలేనంత భారంగా మారతాయని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంధాల్ని మరింత బలంగా మార్చుకునేందుకు రోజూ విధిగా కొంత సమయం కేటాయించడం అనివార్యమని సూచిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఓ 20 నిమిషాలు... ఫోన్‌, ఫైల్స్‌, సోషల్‌ మీడియా.. ఇలా అన్నీ పక్కన పెట్టేసి కలిసి మాట్లాడుకోవాలి. ఇరువురికీ ఆసక్తికరమైన టాపిక్‌.. కలిసి చేసే పని.. లేదంటే నడక.. ఇలా ఏదైనా ఒకరికొకరు అనుకునేలా కలిసి సమయాన్ని గడపాలి.

వాస్తవికతతోనే.. 
చాలా మంది ప్రేమ, స్నేహం సహజంగా పుడతాయని, ఏం చేయకపోయినా అవి ఎల్లప్పుడూ అలానే ఉంటాయని నమ్ముతారు. అది వాస్తవ దృక్పథం కాదు. నిజజీవితంలో బంధాల్ని కాపాడుకునేందుకు ఎంతో స్పృహ కావాలి. రోజూ విధిగా కొంత సమయాన్ని వెచ్చించడం.. ఎదుటివారి మనసు లోతుల్లోకి తొంగి చూడడం చేస్తుండాలి. అంతేకాదు.. మీ లోతెంతో మీకూ తెలియాలి. ఇతరుల మనసును తెలుసుకోవాలనుకునే ముందు మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం తప్పక చేయాలి. ‘ఎందుకిలా చేస్తారో? ఏదనిపిస్తే అది మాట్లాడేస్తారు’ అని గోడకి తలబాదుకోవడాలు.. చేతిలో ఉన్నవి విసిరేయడాలు మానుకోవాలి. ఇలాంటి చేష్టలు దూరాన్ని పెంచుతాయి తప్పితే దగ్గర చేయవు. మీ ప్రతి స్పందనలపై మీరెప్పుడైతే అవగాహనకి వస్తారో.. అప్పుడు ఇతరుల స్పందనలకి విలువిస్తారు. ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియే ‘రిలేషన్‌షిప్‌ వర్క్‌అవుట్స్‌’ అన్నమాట. వీటిని ఎప్పుడైతే స్పృహతో ఫాలో అవుతారో అప్పుడు అపార్థాలకు తావుండదు. ‘నన్ను అర్థం చేసుకోవెందుని’ ప్రేమికుల్లో... ‘నా మాటకు విలువ ఇవ్వరెందుని’ టీనేజర్లు.. చేసే ఫిర్యాదులుండవు.

ఇరువురికీ ఇష్టంగా.. 
అభిప్రాయభేదాల్ని ఇరువురూ అంగీకరించాలి. ఒకరు లేజీ అయితే.. ఇంకొరు ఫిట్‌నెస్‌ఫ్రీక్‌ అయ్యుండొచ్చు... ఒకరికి పెంపుడు జంతువులు ఇష్టమైతే.. ఇంకొకరు వాటిని దగ్గరికి రానివ్వకపోవచ్చు.. అవన్నీ అంగీకరించాలి. ఒకరి అభిరుచులు, అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవాలి. విషయం ఏదైనా ఇతరుల దృక్కోణం నుంచి చూసే అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు.. ఒకరి ప్రైవసీని మరొకరు అర్థం చేసుకోవాలి. అలాగే, ఇద్దరికీ కామన్‌గా ఉన్న ఆసక్తులు ఏంటో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇద్దరికీ గార్డెనింగ్‌ ఇష్టమైతే కలసి రోజూ కొంత సమయం తోటపని చేయొచ్చు. పుస్తక ప్రియులైతే చదివిన పుస్తకాల గురించి చర్చించొచ్చు. ఇద్దరూ కలసి కలిసి వంట చేస్తే ఆ అనుభూతిలో ఉండే మజానే వేరు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని