మిలీనియల్‌ పురుషా! 

మగాడు మారిపోయాడు! కొడుకు పాత్ర.... నాన్న పాత్ర... అన్న పాత్ర... ఇలా టోటల్‌ మగాడి పాత్రే మారిపోయింది! ఇంతకుముందు గంభీరంతో, దూరంగా, దర్పంగా ఉన్న ఆ క్యారెక్టర్‌ కాస్తా ఇప్పుడు కూతురితో ప్రేమగా కలిసిపోతోంది, భార్యతో ఆత్మీయంగా అల్లుకుపోతోంది. ప్రేయసితో ఒదిగి ఉంటోంది. బాస్‌గా అండగా నిలుస్తోంది. ఆ కొత్త మిలీనియల్‌ పురుషుడెలా ఉంటాడో... చదవండి.

Updated : 28 Dec 2018 21:37 IST


19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

మిలీనియల్‌ పురుషా! 

మగాడు మారిపోయాడు! కొడుకు పాత్ర.... నాన్న పాత్ర... అన్న పాత్ర... ఇలా టోటల్‌ మగాడి పాత్రే మారిపోయింది! ఇంతకుముందు గంభీరంతో, దూరంగా, దర్పంగా ఉన్న ఆ క్యారెక్టర్‌ కాస్తా ఇప్పుడు కూతురితో ప్రేమగా కలిసిపోతోంది, భార్యతో ఆత్మీయంగా అల్లుకుపోతోంది. ప్రేయసితో ఒదిగి ఉంటోంది. బాస్‌గా అండగా నిలుస్తోంది. ఆ కొత్త మిలీనియల్‌ పురుషుడెలా ఉంటాడో... చదవండి.

‘మీ టూ’ అంటూ మహిళలు ఉద్యమాలతో ముందుకొస్తున్న     నేపథ్యంలో ఉత్తమ పురుషుడెలా ఉండాలో తెలియాలంటే? అమ్మతో కలిసి మార్కెట్‌కి వెళ్లండి. అక్కతో కలిసి ఆర్టిసీ బస్సుల్లో ప్రయాణం చేయండి. చెల్లితో కలిసి సినిమాకి వెళ్లండి. ఏదో పండక్కో.. పబ్బానికో కాదు. వీలు చిక్కినప్పుడల్లా వాళ్లతో బయటి ప్రపంచంలో తిరగండి. మీకే తెలుస్తుంది. ఎలా ఉండకూడదో! కాస్త సున్నితంగా ఆలోచిద్దాం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మిలీనియల్‌ పురుషులుగా జరుపుకుందాం!!

కొత్త దోస్తులున్నారు 
కాలేజీ, ఉద్యోగం, వ్యాపారం, పరిశ్రమ ఇలా ఎక్కడైనా మహిళలు దోస్తులవుతున్నారు. ఆకాశంలో సగమైన వాళ్లు... అవకాశాల్లోనూ సగమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని గౌరవిస్తూనే, పనిచేసే మనస్తత్వం పెంచుకోవాలి. వారిపట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ... చక్కని వాతావరణాన్ని నిలబెట్టుకోవాలి. లేదంటే విభేదాలు.. విపరీతాలే తారసపడతాయి. ‘మేమూ మీలాగే... మమ్మల్ని గౌరవించండి’ అంటున్నారు నేటితరం వనితలు. వారిని మంచి మిత్రులుగా మలుచుకొని విజయసాధించిన వారే కదా! అసలైన పురుషులు. ఇదే కదా మా బాట అంటున్నారు నేటి యువత.

అసలైన జెంటిల్మన్‌లంటే వీళ్లు... 
ప్రేమించడానికీ... ప్రేమిస్తున్నా అనే భ్రమల్లో ఉండి అమ్మాయిపై ఆంక్షల ఉచ్చు బిగించడానికి, అసూయతో విరుచుకుపడటానికి ఎంతో తేడా ఉంది. ఒకప్పుడున్న ‘నువ్వు నాకే సొంతం’ అనే సగటు పొససివ్‌ మగాళ్ల భావజాలం నుంచి ‘స్వచ్ఛంగా ప్రేమించండి డ్యూడ్‌.. పోయేదేముంది. తిరిగి ప్రేమిస్తారు’ అనే విశాలదృక్పథంతో వ్యవహరించే మిలీయన్‌ మగాళ్లు బయలుదేరారు. కాదంటే అవమానంలో కూరుకుపోయి... అమ్మాయిపై అఘాయిత్యాలకు తలపడే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. నాలానే నువ్వూ... నీలానే నేను అనే అర్థం చేసుకునే ధోరణి ప్రేమికులు ఒకరినొకరు కలకాలం కలిసి నడవడానికి, ప్రేమబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అందులో డౌటేముంది! ప్రేమబంధం సడిలి మధ్యలో బ్రేకప్‌లు తలెత్తినా వాటినీ హుందాగానే తీసుకుంటూ ప్రపంచం దృష్టిలో అసలైన జెంటిల్‌మన్లు అనిపించుకుంటున్నారు.

విడగొట్టుకోవడం కాదు... నిలబెట్టుకోవడం ముఖ్యం 
పెళ్లైంది. ముచ్చటైన జంట. అంతలోనే గొడవలు. నువ్వెంతంటే.. నువ్వెంతని మాటలు. ఆ పని నేనెందుకు చేసిపెట్టాలని పంతాలు. ఫలానా పని నువ్వే చేయాలని పట్టింపులు... చివరికి దూరం. ‘నీకేం రా మగాడివి... వదిలేయ్‌’ అంటూ రెచ్చగొట్టే స్నేహితులు. వదిలేస్తే మగతనమా? కాదు..కాదంటోంది మిలియనియల్‌ సూత్రం. సంసారం నిలబెట్టుకొంటేనే అసలైన మగాడివోయ్‌ అని చెబుతోంది. దీనికి కాస్త ఓపిక.. .ఇంకాస్త అర్థంచేసుకొనే తత్వం చాలంటోంది. గతంలోలా... నేనిదే చేస్తాను. అదే చేస్తాను అంటే కుదరదు. భాగస్వామే సర్దుకుపోవాలి అనే రోజులు కావివి. ప్రతి సంసారానికి యూబైఏ సర్టిఫికెట్‌ అవసరం       అవుతోంది. ఇక్కడ యూబైఏ అంటే.. అండర్‌స్టాండింగ్‌... అడ్జెస్ట్‌మెంటు. నీతో సమానంగా ఉద్యోగం చేస్తూ... ఇంటి పని, పిల్లల పని చేస్తున్న భాగస్వామిని ఆ మాత్రం అర్థం చేసుకోకపోవడం పురుష లక్షణం     కాదంటోంది నేటి తరం.

ఉద్యోగం పురుష లక్షణం కాదు 
ఉద్యోగం పురుష లక్షణం! ఎప్పుడో ఆఫీసుల్లో ఫైల్స్‌ రాసే కాలంలో ఈ మాట చెప్పి ఉంటారు... ఇది హార్డ్‌డిస్క్‌లు, నానో చిప్‌ల కాలం... ఇప్పుడు ఉద్యోగాలివ్వడం పురుష లక్షణంగా మారింది. చదువుకొని ఎవరి బతుకు వారు చూసుకోవడం అందరూ చేస్తారు. మరి అంతకంటే ఎక్కువ చేస్తేనే కదా! అందుకే ఆంత్రపెన్యూర్‌గా అవతరించాలి. నలుగురికి ఉపాధి చూపాలి. అప్పుడే నువ్వు అసలైన పురుషుడవవుతావంటోంది... మిలీనియల్‌ మంత్రా! అందరూ వెళ్లే దారంటే వెళితే కిక్కేముంటుంది... కొత్త దారిలో వెళ్లినప్పుడే మజా ఉంటుందంటున్నా మిలీనియల్‌ పురుష్‌. మరి నువ్వందుకు సిద్ధమా?

ఎంజాయ్‌... హద్దులు దాటొద్దు 
‘మగాడివిరా నువ్వు ఏదైనా చెయ్‌’ అనే కాలం పోయింది. ఆడైనా, మగైనా హద్దుల్లో ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది. అది బండిమీద వేగమైనా... బార్‌లో తాగుడైనా..ప్రేమికుడిగా మీ పాత్రైనా! కాదూ కూడదు... మా ఆవేశం మా ఇష్టం అంటే... కటకటాలు పిలుస్తాయి.  బ్రేక్‌ ద రూల్స్‌ అనే వాళ్లే.. బీ ఇన్‌ ఏ రూల్స్‌ అంటున్నారు. లేదంటే బ్రేక్‌లు పడతాయని    తెలుసుకోవాలి. ఏదైనా ఎదుర్కోవడం మగతనమనేది పాత నినాదం... ఏదైనా నీకూ, నీ వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చేయగలగడమే నేటి మగతనం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని