అర్థం చేసుకోలేకపోయా క్షమించు..

నేను తనని కలిసింది యోగా తరగతుల్లో. పీజీ క్లాసుల్లో భాగంగా యోగా గేమ్స్‌కు బంజారాహిల్స్‌కు వచ్చినప్పుడు మొదటిసారి తనని చూశాను. ఆ రోజు అన్ని ఆటల్లో తనే విజేత. చలాకీగా, చిలిపిగా, నవ్వుతూ, నవ్విస్తూ ఆరోజు తను యోగా ఫుడ్‌ పెడుతుంటే ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోందీ అమ్మాయి..

Published : 08 Jun 2019 01:39 IST

నేను తనని కలిసింది యోగా తరగతుల్లో. పీజీ క్లాసుల్లో భాగంగా యోగా గేమ్స్‌కు బంజారాహిల్స్‌కు వచ్చినప్పుడు మొదటిసారి తనని చూశాను. ఆ రోజు అన్ని ఆటల్లో తనే విజేత. చలాకీగా, చిలిపిగా, నవ్వుతూ, నవ్విస్తూ ఆరోజు తను యోగా ఫుడ్‌ పెడుతుంటే ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోందీ అమ్మాయి అని అందరూ పొగిడారు. అప్పుడనిపించింది తనతో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో అని. మరో అయిదు రోజుల తర్వాత అందరం ఏఎమ్‌సీ క్లాస్‌ల కోసం వరంగల్‌కు వెళ్లాం. మూడు రోజులు మా క్యాంప్‌ అక్కడే. రెండో రోజు మధ్యాహ్నం అనుకుంటాను. మా గ్రూప్‌కి ఓ అస్సైన్‌మెంట్‌ ఇచ్చారు. ఇందులో ముగ్గురు ఓ గ్రూప్‌గా ఉంటారు. అందులో ఒకరి కళ్లకు గంతలు కడితే మిగిలిన ఇద్దరూ ఆ వ్యక్తి చేయిపట్టుకుని నడిపించాలి. కొండలు, గుట్టలు దాటించాలి. ఆరోజు మొదటిసారి తను నా చేయి పట్టుకుంది. ఆ స్పర్శలో ఎంత ఆత్మీయత? ‘నేను నీతోపాటు ఉన్నాను... నీతో పాటు ఉంటాను’ అన్నట్లు. కానీ తన మనసులోని భావాలు చేతుల్లో నుంచి నన్ను తాకి, అర్థం చేసుకోమంటే నేను తెలుసుకోలేకపోయాను. క్యాంప్‌ చివరి రోజు అడ్రస్‌లు ఇచ్చిపుచ్చుకున్నాం. తనుండేది పద్మనాభనగర్‌లో, నేనుండేది మెహిదీపట్నం. ‘చాలా దగ్గర్లోనే ఉన్నాం. తరచూ కలవాలి మరి...’ ఆ రోజు తను ఆదేశించింది. ‘సరే! తప్పకుండా...’ అని నేను భరోసా ఇచ్చాను. ‘అలా ఉండాలి... ఇలా నడవాలి’ అని తను చిలిపిగా చెబుతుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను తను జీవితాంతం నన్ను నడిపించాలని అనుకుంటోందని.
పద్మనాభనగర్‌లో తను అన్నయ్యతోపాటు ఉండేది. అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తుండేది. నేను తరచూ వాళ్ల రూమ్‌కు వెళ్తుండేవాడిని. ఓ ఆదివారం నాకు బాగా జ్వరం. హాస్టల్‌లో భోజనం చేయకుండా వచ్చానని తెలిసి వాళ్ల అన్నయ్యను టోలీచౌకీ పంపించి టాబ్లెట్లు తెప్పించి వేసింది. అప్పటికప్పుడు అన్నం, బీరకాయతో కూరవేసి తినిపించింది.
నేను మొహమాటంతో ‘వద్దులే ఉమా...’ అంటుంటే నోరు మూసుకుని తిను అని కసిరి, అమ్మలా గోరు ముద్దలు పెట్టింది. అప్పుడూ తెలుసుకోలేకపోయాను తన హృదయంలో నాకు చోటుందని. నేను ట్రైనింగ్‌ పూర్తి చేసి వెళ్లిపోయే రోజు... చాలాసేపు నేను తన గదిలోనే ఉన్నాను. సాయంత్రం వెళుతున్నప్పుడు లిటిల్‌ హార్ట్స్‌ ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌ నా బ్యాగ్‌లో బలవంతంగా పెట్టింది. ‘నువ్వు బాగా చదువుకున్నావు... బిట్‌వీన్‌ ది లైన్స్‌ చదువుతానంటున్నావు కదా... మనుషుల్ని కూడా అర్థం చేసుకోవాలి’ అంది. నాకు అప్పటికీ తెలియలేదు. నువ్వు అర్థం చేసుకోమంటోంది తన మనసునని.
మా వూరు వెళ్లాక కొన్ని రోజులకు నాకు ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదే రోజు నీ నుంచి లెటర్‌ వచ్చింది. ‘ఎలా ఉన్నావ్‌... ఒక్కసారీ ఫోన్‌ చేయలేదు. నన్ను గుర్తు చేసుకోవా... నా మనసును అర్థం చేసుకోవా... ప్లీజ్‌!’ అని నువ్వు రాసిన అక్షరాల వెంట కళ్లు పరిగెత్తాయి గానీ.... అక్షరాల వెనుక భావాన్ని పసిగట్టలేకపోయాయి.
ఏదో సాధించేయాలన్న తాపత్రయం తప్ప ఒక అద్భుత హృదయానికి దూరమైపోతున్నానన్న భావం నాకు కలగలేదు. ఉద్యోగం.. ఉద్యోగం... ఉద్యోగం... కాలం కరిగిపోయింది. ఎన్నో బహుమానాలు, పదోన్నతులు, ప్రశంసలు... జీవిత పరుగుపందెంలో అలసి పోయాను. ఇప్పుడు ఒంటరిగా నా గురించి నేను ఆలోచించుకుంటే.. నువ్వు కనిపిస్తున్నావు. నీ ప్రేమ తెలుస్తోంది. పదేపదే నువ్వే గుర్తొస్తున్నావు. అనుక్షణం నీ ప్రేమ నన్ను తాకుతోంది. అందులోని గాఢత నన్ను కదిపి కుదిపేస్తోంది. నువ్వు రాసిన ఉత్తరంలోని ఆర్ధ్రత నన్ను నిలువెల్లా తడిపేస్తోంది. నువ్విప్పుడు ఎక్కడున్నావో...? ఏం చేస్తున్నావో? నేను మాత్రం నడిచే దీపంలాంటి నిన్ను దూరం చేసుకున్నాను. గతాన్ని ఏకాకిగా శిలువలా మోస్తున్నాను.

- రవిచంద్ర

 

సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌


తను వెళ్లిపోయింది..
తన జ్ఞాపకాల సిరులతో
నన్ను భాగ్యవంతుడిని చేసి..
                      - ఆర్యన్‌
జ్ఞాపకాలు...
కొందరికి ఊపిరి పోస్తాయి
కొందరికి తీస్తాయి కూడా
   - విశాల్‌


 
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని