మీతో పాడిస్తారు... మ్యూజిక్‌ మెరాకీల్స్‌!

అది బంజారాహిల్స్‌లోని ఓ అడ్డా.. ‘అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా‘ అంటూ స్మార్ట్‌ఫోన్స్‌ చూస్తూ ‘ఖుషీ’గా పాడుతున్నారంతా. ఇలా వీళ్లందరినీ ఒకేచోట కలిపిన క్రెడిట్‌ మాత్రం ‘మెరాకీ’ బ్యాండ్‌దే.  పబ్బుల్లో, కాఫీషాపుల్లో షోలు చేసే ఈ బ్యాండ్‌.. నెలకోసారి ‘మైక్‌లెస్‌ విత్‌ మెరాకీ’ కాన్సెప్ట్‌తో సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగిస్తోంది...

Published : 07 Sep 2019 00:47 IST

అది బంజారాహిల్స్‌లోని ఓ అడ్డా.. ‘అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా‘ అంటూ స్మార్ట్‌ఫోన్స్‌ చూస్తూ ‘ఖుషీ’గా పాడుతున్నారంతా. ఇలా వీళ్లందరినీ ఒకేచోట కలిపిన క్రెడిట్‌ మాత్రం ‘మెరాకీ’ బ్యాండ్‌దే.  పబ్బుల్లో, కాఫీషాపుల్లో షోలు చేసే ఈ బ్యాండ్‌.. నెలకోసారి ‘మైక్‌లెస్‌ విత్‌ మెరాకీ’ కాన్సెప్ట్‌తో సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగిస్తోంది. మెరాకీ బ్యాండ్‌లోని ఈ మ్యూజికల్‌ మిరికల్స్‌ను పలకరిస్తే  బ్యాండ్‌ సంగతులు పంచుకున్నారిలా..
మెరాకీ.. గ్రీకు పదం
పనిని మనసుపెట్టి చేయటమనేది దాని అర్థం.ఈ బ్యాండ్‌ని ప్రారంభించింది క్రొవ్విడి గణేశ్‌. ఈటీవీ ‘పాడుతా తీయగా‘లో ఫైనలిస్టు (2015). గతంలో ఓ బ్యాండ్‌లో పనిచేశాడు. ఆ అనుభవంతో నలుగురు మ్యూజిక్‌ ప్లేయర్స్‌తో బృందాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలా తనకి సన్నీ (బేస్‌ గిటారిస్ట్‌), ఏలియా(కీబోర్డు), మనోహర్‌(గిటార్‌), విశాల్‌ (డ్రమ్స్‌) జతయ్యారు. అంతా కలిసి నాలుగైదు క్లబ్బుల్లో పాడారు. షోలు క్లిక్‌ అవ్వడంతో గణేశ్‌ తన కజిన్‌ విద్య సాయంతో ‘మెరాకీ‘ బ్యాండ్‌ స్టార్ట్‌ చేశాడు.
ఆ రెండే.. మా బలాలు
వారాంతాల్లో, బుధవారం రోజు హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ షోలు చేస్తారు. ఇళయరాజా, రెహమాన్‌ కంపోజిషన్‌లో వచ్చిన అరుదైన మెలోడీస్‌ని వారిదైన శైలిలో పాడేస్తారు. ‘రెండు గంటల్లో మ్యూజిక్‌తో పాటు ముప్పై పాటలు పాడి అలరిస్తాం. మా ప్రజెంటేషన్‌ కొత్తగా ఉండడంతో ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అని సన్నీ చెబుతున్నాడు.
మ్యూజిక్‌ కోసం కష్టాలు పడ్డవాళ్లే!
హైదరాబాద్‌లో పుట్టిపెరిగాడు గణేశ్‌. బీటెక్‌ చేశాడు. సంగీతమే జీవితం అనుకున్నాడు. తన లక్ష్యానికి ఆర్జేగా పని చేసే విద్య తోడయ్యింది. వీరికి తోడు కీబోర్డు ప్లేయర్‌ ఏలియా, బేస్‌ గిటారిస్టు సన్నీ జత కలిశారు. సన్నీ ఈటీవీలో ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’, ‘ఝుమ్మందినాదం’ కార్యక్రమాలతో పాటు బాలూగారి షోలకు బేస్‌ గిటార్‌ ప్లే చేశాడు. ఇటీవలే ‘సీత’ చిత్రానికి కూడా పనిచేశాడు. తెలుగు, కన్నడ, తమిళం కలిపి యాభై సినిమాలకు సన్నీ పనిచేశాడు. మరో గిటారిస్ట్‌ మనోహర్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశాడు. అనూప్‌ రూబెన్స్‌, మిక్కీ జే మేయర్‌ దగ్గర రికార్డింగ్స్‌ చేశాడు. లైవ్‌ షో చేయాలనే ఆలోచనతో బ్యాండ్‌లో జాయినయ్యాడు. ఇక బ్యాండ్‌లో చిన్నోడయిన డ్రమ్మర్‌ విశాల్‌ అయితే పదో తరగతి ఫెయిలయ్యాడు. తనకు తాను నిరూపించుకోవటానికి డ్రమ్స్‌ నేర్చుకున్నాడు. పది పాసయ్యాడు. కెరీర్‌లో కూడా రాణించాడు. డిగ్రీ చదివాడు. బాలీవుడ్‌లో ఇండియన్‌ ఐడల్‌ లాంటి కార్యక్రమాలకు పనిచేశాడు. ఫ్రీలాన్సింగ్‌గా పనిచేస్తూ బిజీలైఫ్‌ గడుపుతున్నాడు.
ఇదీ.. ‘మైక్‌లెస్‌ విత్‌ మెరాకీ‘ కథ
చెన్నైలో ‘మొట్టామడి మ్యూజిక్‌’ అనే కాన్సెప్ట్‌ ఉంది.  పది మంది ఒకేచోట కలిసి సినిమా పాటలు పాడేవారు. ఆ జోష్‌ మరింత ఎక్కువ మందిని ఆకట్టుకోవడంతో ఇప్పుడు కనీసం పన్నెండు వందల మందికిపైగా ఒకే చోట పాటలు పాడుకుంటారు. మెరాకీ మేనేజర్‌గా వ్యవహరించే విద్య అది తెలుసుకుని చెన్నై వారితో మాట్లాడి కాన్సెప్ట్‌ హక్కులు తీసుకున్నారు. ‘టెర్రస్‌ అండ్‌ కెఫే’ పేరుతో ఈ కాన్సెప్ట్‌ను హైదరాబాద్‌లో పరిచయం చేశారు. మొదటి షోకి ఎవరూ రారని భయపడ్డారు. ‘మేం నలభైమందిని ఎక్స్‌పెక్ట్‌ చేశాం. ఎనభైమంది దాకా వచ్చారు. చాలా మంది పల్లవి దగ్గరే ఆగిపోతారు అనుకున్నా. చరణాలు పాడీ అదరగొట్టారు’ అంటూ విద్య సంబరపడిపోయింది.
ఇలా దగ్గరవుతాం
రెండువారాల ముందు సోషల్‌మీడియాలో, వెబ్‌సైట్స్‌లో ఫలానా కాన్సెప్ట్‌, ఫలానా రోజు, సమయాన్ని ఉంచుతారు. లిరిక్స్‌ కూడా అందుబాటులో ఉంచుతారు. ఉచిత రిజిస్ట్రేషన్‌. ఎవరైనా రావొచ్చు.
‘మొన్న పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా పవన్‌ థీమ్‌తో మైక్‌లెస్‌ షో చేస్తే.. వర్షం పడినా 130 మంది జనాలొచ్చారు. ఎవరికైనా పాడటం అంటే ఇష్టం. అందునా గుంపులో హాయిగా అన్నీ మర్చిపోయి ఆలపించటం ఇంకా ఇష్టం. ఎవరి ఫోన్‌లో వాళ్లు లిరిక్స్‌ చూస్తూ పాడే ఈ పాటల కలయిక ఎంతో అందంగా ఉంటుంది. యువతతో పాటు పెద్దవాళ్లూ వస్తున్నారు. ఇలా పాటకోసం వచ్చి ఫ్రెండ్సంతా ఒకేచోట కలవొచ్చని గ్రూప్‌గా వచ్చేవాళ్లున్నారు. ఇదో సరదా పాటల పండగ’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు గణేష్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని