నాతో పంచుకోండి నాన్న..!

అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతారు. అడిగిన వెంటనే అన్నీ ఇచ్చేస్తారు. అడగకుండానే ఎన్నో చేస్తారు. ‘అంతా నీ ఇష్టం తల్లీ.. అన్నీ నీకు తెలుసు కదా..’ అంటూ పెంచిన తల్లిదండ్రులు తనకు నచ్చిన అబ్బాయితో....

Published : 09 Nov 2019 00:49 IST

అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతారు. అడిగిన వెంటనే అన్నీ ఇచ్చేస్తారు. అడగకుండానే ఎన్నో చేస్తారు. ‘అంతా నీ ఇష్టం తల్లీ.. అన్నీ నీకు తెలుసు కదా..’ అంటూ పెంచిన తల్లిదండ్రులు తనకు నచ్చిన అబ్బాయితో జీవితాన్ని ఇమ్మంటే ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. నా జీవితం ఇప్పుడు అదే స్థితిలో ఉంది.. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ల ఇష్టప్రకారమే చదువు, ఉద్యోగం చేసినపుడు ఇంటిల్లిపాదికీ ఆదర్శంగా ఉన్న నేను.. నాకు నచ్చిన అబ్బాయి గురించి చెప్పినపుడు అందరికీ శత్రువుగా మారిపోయాను. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా? నీ ఇష్టప్రకారమే చేద్దాం అని మీరు అడిగినప్పుడు ఎంతో సంబరపడిపోయా.. అంతవరకూ నా మనసులో మాటను కృష్ణకు కూడా చెప్పని నేను నీకు చెప్పా నాన్న.. మీ నిర్ణయమే నా జీవితం.

మీరు చెప్పిన ప్రకారమే పీజీ వరకూ చదివాను. మొదటిసారి ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాను. మా ఆఫీసులో తనని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్‌. తొలిచూపులోని ప్రేమ అన్నట్టుగా.. నేనున్న వయసులో ఇదంతా సాధారణం అనుకుని లైట్‌ తీసుకున్నా. ఒకే ఆఫీస్‌ కావడంతో రాను రానూ అతని ప్రవర్తన, నిజాయతీ, మాటతీరు, ఇతరుల పట్ల తను ప్రదర్శించే గౌరవ మర్యాదలు.. అన్నీ అతని వైపు నన్ను మరింత ఆకర్షించేలా చేశాయి. తన పరిచయం ఓ నూతన ప్రపంచాన్ని చూస్తున్నట్టు చేసింది. అతనిలో నచ్చనివంటూ ఏవీ లేవు. మీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా, భద్రతగా అనిపిస్తుందో అతనితో ఉన్నప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. ఇద్దరం ఎంత చనువుగా ఉన్నా ఎప్పుడూ తన ప్రవర్తనలో తేడా లేదు. ఎప్పుడూ హద్దు మీరలేదు. రెండేళ్ల మా పరిచయంలో ఎన్నో సార్లు నన్ను నేను చెక్‌ చేసుకున్నా. ఒకటికి పది సార్లు ఆలోచించా.. ఎన్ని సార్లైనా నా మనసు చెప్పే మాట ఒక్కటే. తనతో జీవితం బాగుంటుంది అని. ఇదేదో నిమిషాల్లోనో, గంటల్లోనో తీసుకున్న నిర్ణయం కాదు.

ఇప్పటివరకూ ఈ విషయం అతనికి కూడా చెప్పలేదు. మీకు చెప్పిన తర్వాత మీ అందరూ అంగీకరించిన తర్వాత అతనిని నా జీవితంలోకి ఆహ్వానిద్దామనుకున్నా. మీరు తిరస్కరించరనే అనుకున్నా. ఎందుకంటే ప్రస్తుత వివాహ బంధాలను ఏలుతున్న కుల, మతాలు కూడా మాకు అడ్డంకి కాదు. చూడ్డానికి బాగుంటాడు. మంచి ఉద్యోగం. మంచి కుటుంబం అన్నీ అనుకూల అంశాలే కదా అనుకున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా నాపై మీకున్న నమ్మకం.. నాకున్న గౌరవం. ఈ ధైర్యంతోనే నా మనసు మీ ముందు ఉంచాను. మీరేం మాట్లాడలేదు. ఎప్పుడూ నా కళ్లలోకి చూసే మీరు శూన్యంలోకి చూస్తుంటే. ఇన్నాళ్లూ నాన్నే నా ధైర్యం అనుకున్న నాకు మొదటిసారి భయంగా అనిపించింది.

నాతో సరదాగా ఉండే మీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. నాకు పెళ్లి చేసేయడమే మీకున్న ముఖ్యమైన పనిగా సంబంధాల వేటలో పడ్డారు. అసలు ఏమైందో చెప్పరు. అడిగితే పట్టనట్టు ఉంటున్నారు. కనీసం తిట్టండి నాన్న.. మిమ్మల్నే చూస్తూ పెరిగిన నన్ను పరాయిదానిలా చూస్తుంటే భరించలేకపోతున్నాను. సూటిగా చెప్పండి నాన్న మీ మనసులో మాటేంటో. నా ఎంపిక సరైంది కాదు అని మీకు అనిపిస్తే.. నేను ఎక్కడ మోసపోతానేమో అని భయం మీకుంటే.. నాతో చర్చించండి. మీ ప్రశ్నలకు నా నుంచి సమాధానం లేకుంటే.. నా ప్రేమలో లోపాలు తెలుస్తాయి కదా. మీరు చెప్పారు కదా అని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను. మనసులో కృష్ణను ఉంచుకొని, గతాన్ని తలచుకుంటూ ప్రస్తుతాన్ని పాడుచేసుకోవడం నా వల్ల కాదు.

నాకు మీ ఇద్దరూ కావాలి. నా సంతోషాన్ని మాత్రమే కోరుకునే తండ్రిగా.. ఒక్కసారి మీ మనసులో ఏముందో నాతో పంచుకోండి నాన్న ప్లీజ్‌.

- సాహితి (పేరు మార్చాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని