తెగ నాన్చొద్దు!

ఆవిష్కరణ కావచ్ఛు. అందించే సర్వీసు అయ్యుండొచ్ఛు. ఏదైనా.. ప్రయోగశాల దగ్గర్నుంచి పరిచయ వేదికపైకి రావాలి.

Updated : 30 Nov 2019 11:18 IST

స్టార్టప్‌ కోచ్‌

ఆవిష్కరణ కావచ్ఛు. అందించే సర్వీసు అయ్యుండొచ్ఛు. ఏదైనా.. ప్రయోగశాల దగ్గర్నుంచి పరిచయ వేదికపైకి రావాలి... వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాలి.. అప్పుడే ఫీడ్‌బ్యాక్‌ పక్కాగా ఉంటుంది.. మీ సంతృప్తి కోసం ప్రయత్నిస్తే.. మీరో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ట్రాప్‌లో పడ్డట్టే!!

ఇంకా మెరుగవ్వాలి.. అనుకున్నట్టుగా రాలేదు. మనకే సంతృప్తి లేకుంటే యూజర్‌కి ఏం నచ్చుతుంది? నేను ఆశించిన స్థాయిలో లేదు.. అంటూ నితిన్‌ తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు. బృందం మొత్తానికి ఎక్కడాలేని నిరుత్సాహం. బాస్‌ని సంతృప్తి పరచడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. ఇంకా ఏం చేయాలో వారికి తోచడం లేదు. దాదాపు ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. నితిన్‌ వారి కంటే ఎక్కువే ఆరాటపడుతున్నాడు. తన స్టార్టప్‌తో మార్కెట్‌లో సరికొత్త విప్లవం తీసుకురావాలని. అందినకాడికి తెచ్చి పెట్టుబడి పెట్టాడు. విడుదల చేయాల్సిన ఉత్పత్తిని ఫైనల్‌ చేయలేకపోతున్నాడు. ఎప్పుడూ ఏదో వెలితి కనిపిస్తోంది. అంకుర సంస్థ నిర్వాహకుడిగా నితిన్‌ పంథా ఎంతవరకు సరైంది?

తపన మంచిదేగానీ..

దేంట్లోనైనా అత్యుత్తమంగా సేవల్ని అందించాలనుకోవడం మంచిదే. కానీ, అందుకో పరిధి పెట్టుకోవాలి. లేకుంటే.. ‘పర్‌ఫెక్షనిజమ్‌’ పేరుతో సాగదీత ట్రాప్‌లో పడిపోతారు. వాయిదాలు వేస్తూ మీరు అనుకున్న దాని కోసం వెంపర్లాడతారు. అంకురసంస్థ నిర్వాహకుడిగా ఈ తరహా విధానం సరైంది కాదు. బృందస్ఫూర్తిని నీరుగార్చేస్తుంది. అలసి చతికిల పడతారు.

విమర్శకులుంటారు..

ఇంటా.. బయటా.. కచ్చితంగా విమర్శకులు ఉంటారు. మీరు అందించబోయే ఆవిష్కరణ, సర్వీసుల్ని విమర్శిస్తూ మిమ్మల్ని ఆయోమయానికి గురి చేస్తారు. ఇంకాస్త మెరుగు పరుద్దాం అనే లక్ష్యంతో మీరో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అవ్వాలనుకుంటారు. కానీ, అత్యుత్తమం అనేది నిరంతర శ్రమ. దానికి కొలమానాన్ని నిర్దేశించలేం. అందుకోవాలని చూస్తే ఆదిలోనే అగాధంలో పడిపోతారు.

అడుగు పడాలిగా..

ఆర్‌జీవీ అన్నీ నేర్చుకుని సినిమా మేకింగ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యాకే సినిమా తీద్దాం అనుకుంటే.. ‘శివ’ సినిమా సినీ పరిశ్రమకి పరిచయం అయ్యేదే కాదు. అందుకే.. అనుకున్న టైమ్‌కి అంకుర ఆవిష్కరణల్ని విడుదల చేయాలి. ‘ఫర్‌ఫెక్ట్‌ టైమింగ్‌’ కోసం వేచి చూడొద్ధు ఏదో అంతంతమాత్రంగా ఉన్నా లాంచ్‌ చేయమనడం నా ఉద్దేశం కాదు. అనుకున్న దానికి తొంభైశాతం అందుకోగలిగితే.. మిగిలిన పదిశాతం కోసం పదే పదే వాయిదా వేయొద్ధు నాలుగు గోడల మధ్య నలుగురున్న బృందం కంటే.. లెక్కకు మిక్కిలి వినియోగదారులున్న మార్కెట్‌ నుంచి సరైన స్పందన వస్తుందని గ్రహించాలి.

చెట్టు కాదు.. చిగురించే అంకురం

‘ఒక్కసారి యూజర్‌కి ఏదైనా లోపం ఎదురైతే.. ఇంకెప్పటికీ మీ సర్వీసు వైపు కన్నెత్తి చూడడు..’ అని చాలా మంది విమర్శకులు చెబుతుంటారు. అది నిజమే కావచ్ఛు కానీ, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీదో అంకుర సంస్థ. ఉన్నతమైన ఆశయాలతో... పరిమిత వనరులతో.. వేసే మొదటి అడుగు. విడుదల సమయానికి మీరు ఆశించేది పరిమిత యూజర్లనే. ఇమేజ్‌ని కోల్పోతాం అనుకోనక్కర్లేదు. ఒకవేళ మీరు అధిక పెట్టుబడులతో.. భారీస్థాయిలో కంపెనీ పెడితే దాన్ని అంకుర సంస్థ అనరు. అలాంటప్పుడు ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంటుంది.

ఆ ‘రోజు’ రావాలి

నిరంతర శ్రమతో కలిసికట్టుగా అనుకున్న ఉత్పత్తి అందుబాటులోకి తేవాలి. ఆరోజే పండగ. వినియోగదారులతో జరుపుకునే ప్రయోగాత్మకమైన పండగ. విశ్లేషణల్ని, విమర్శల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. లోపాల్ని స్వీకరించి వీలైనంత త్వరగా సరి చేసుకోవాలి. యూజర్లకు ఒక్కొక్కరిగా ప్రత్యేక నోట్‌ ద్వారా ధన్యవాదాలు తెలపొచ్ఛు విలువైన స్పందనల్ని తెలియజేసినందుకు కృతజ్ఞతగా బహుమతుల్ని అందజేయండి. అప్పుడు అసలు సిసలైన ప్రయాణం మొదలవుతుంది. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌.. అనిపించుకోవడం కంటే.. మంచి నాయకుడు అనిపించుకోండి. విజయం మీదే!

- కోటిరెడ్డి సరిపల్లి, కేజీవీ గ్రూపు ఛైర్మన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని