మీకు మీరే.. జోడీ

బయటెలా ఉన్నా నెట్టింట్లో కుర్రకారుకి తమదైన ‘స్టేటస్‌’ ఉండి తీరుతుంది...‘సింగిల్‌’, ‘మ్యారీడ్‌’, ‘ఎంగేజ్డ్‌’.. ఏదోటి... ఇప్పుడేమో మరో కొత్త కోణం ‘సెల్ఫ్‌ పార్ట్‌నర్‌’ మొదలైంది.

Updated : 18 Dec 2021 06:18 IST

బయటెలా ఉన్నా నెట్టింట్లో కుర్రకారుకి తమదైన ‘స్టేటస్‌’ ఉండి తీరుతుంది...‘సింగిల్‌’, ‘మ్యారీడ్‌’, ‘ఎంగేజ్డ్‌’.. ఏదోటి... ఇప్పుడేమో మరో కొత్త కోణం ‘సెల్ఫ్‌ పార్ట్‌నర్‌’ మొదలైంది. అదేంటి? ఆ కథేంటి??

మ్మాయి స్టేటస్‌ చూశాకే స్నేహం చేసే అబ్బాయిలుంటారు. కుర్రాడు సింగిల్‌ అయితేనే మింగిల్‌ కావాలనుకునే అమ్మాయిలుంటారు. ఇప్పుడేంటిది కొత్తగా సెల్ఫ్‌ పార్ట్‌నర్‌ అంటే.. ఇదేం ఎవరికీ అర్థం కాని పజిల్‌ కాదు. నేను ఖాళీగా ఉన్న సింగిల్‌ కాను.. పెళ్లైన మ్యారీడ్‌ కాదు.. రిలేషన్‌షిప్‌లో లేను.. స్వయం ప్రేమలో ఉన్న సెల్ఫ్‌ పార్ట్‌నర్‌ని అని ఢంకా భజాయించి చెప్పుకోవడమే ఈ కొత్త ధోరణి. హ్యారీపోటర్‌ నటి ఎమ్మా వాట్సన్‌ తెలుసుగా! తనే ఈ ట్రెండ్‌కి తెర తీసింది. ముప్ఫైకి దగ్గరైనా తనకింకా పెళ్లి ఆలోచన లేదు.. ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అలాగని నేనేం సింగిల్‌గా లేను.. నన్ను నేనే ఇష్టపడుతున్నానంటూ ఈ కొత్త ‘స్టేటస్‌’ని సృష్టించింది.

నిగూఢార్థం..

సరదాగా మొదలైందని దీన్ని తేలిగ్గా తీసుకోనక్కర్లేదు. ఈ పదం వెనకాల బోలెడు పరమార్ధం ఉందంటారు సైకాలజిస్టులు. ఈ తరహా మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవరినో ఒకర్ని ఆరాధిస్తూ.. అభిమానిస్తూ ‘ఐ వన్న ఫాలోఫాలోఫాలో యూ’ అన్నట్టుగా ఉండరు. వాళ్లకి వాళ్లే గాఢమైన ప్రేమలో పడిపోతుంటారు. బాబాలు, స్వామీజీలు చెబుతుంటారుగా.. ‘ముందు నిన్ను నీవు తెలుసుకో.. నిన్ను నీవు ప్రేమించుకో.. తర్వాతే ఇతరుల గురించి ఆలోచించు..’ అని. అలా. సెల్ఫ్‌ పార్ట్‌నర్‌ అన్నంత మాత్రాన ‘మేం ప్రేమలో పడబోం.. భవిష్యత్తులో ఎవరినీ పెళ్లాడబోం’ అని కాదు. ప్రస్తుతానికైతే నాతో నేనే పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నా.. ఇప్పటికి చిత్తగించవలెను అని చదువుకోవచ్చన్నమాట. ఈ భావనలో ఉంటే మనకు మనమే ముద్దు చేసుకోవచ్చు.. బుజ్జగించుకోవచ్చు.. కష్టసుఖాలు పంచుకోవచ్చు. ఏది మంచో, చెడో తెలుసుకొని నచ్చినట్టుగా ఉండొచ్చు. అడిగే వారుండరు.. ఒకరికి చెప్పే బాధ్యత ఉండదు. ఇదేమాట ముంబయికి చెందిన మానసిక నిపుణురాలు రశ్మీ అకోల్కర్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునేవాళ్లు, లోతుగా ఆలోచించేవాళ్లు ఈ టర్మ్‌ని ఉపయోగిస్తారు. ‘నాకు నేను భాగస్వామిని’ అనే పదంలోనే ఎంతో అర్థం ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు ఎవరి మెప్పు కోసమో, గుర్తింపు కోసమో పని చేయరు. లవ్‌, రిలేషన్‌షిప్‌, బంధాలు.. వీళ్ల దృష్టిలో చిన్న విషయాలు’ అంటారామె. ఏదేమైనా ఈ కొత్త స్టేటస్‌ సామాజిక మాధ్యమాల్లో జోరు మీదుండటమే కాదు.. ఎందరినో ఆలోచించేలా చేస్తోంది. అందుకే ఈ స్ఫూర్తిని పుణికి పుచ్చుకుందాం. కొత్త ట్రెండ్‌కి ఓటేస్తూ మనల్ని మనం ప్రేమించుకుందాం డ్యూడ్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని