మట్టి పరిమళాలకు మేటి పురస్కారాలు!

యాసనే శ్వాసగా మలచుకొని అసమానతలపై అక్షరాలు ఎక్కుపెట్టిందొకరు...తాను ఎదుర్కొన్న వివక్ష, స్వానుభవాలపై కలం ఝుళిపించిన కవి మరొకరు...

Updated : 03 Sep 2022 07:05 IST

యాసనే శ్వాసగా మలచుకొని అసమానతలపై అక్షరాలు ఎక్కుపెట్టిందొకరు...తాను ఎదుర్కొన్న వివక్ష, స్వానుభవాలపై కలం ఝుళిపించిన కవి మరొకరు...ఇద్దరి ఆశయం సమ సమాజమే.. ఇద్దరి వృత్తి బోధనే.. ఇద్దరి ప్రవృత్తి సాహిత్యమే! ఎంచుకున్న దారిలో ముందుకెళ్తూనే.. ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారాలు అందుకున్నారు పల్లిపట్టు నాగరాజు, దాదాపీర్‌ జైమన్‌లు. వారితో మాట కలిపింది ఈతరం.


యాసే శ్వాసగా...

మాట్లాడటమే నేరమైన సమాజంలో న్యాయాన్ని న్యాయం, అన్యాయాన్ని అన్యాయం అని చెప్పేందుకు ఎలాంటి జంకు అక్కర్లేదంటాడు చిత్తూరు యువకుడు పల్లిపట్టు నాగరాజు. సమాజం తరపున గొంతుకగా మారినప్పుడే కవి రచనలకు సార్థకత అంటాడు. శ్రమ జీవులు, వ్యుత్పత్తివర్గాల జీవితాలను ముడిసరుకుగా ఎంచుకొని, అల్లిన ‘యాలై పూడ్సింది’ని పురస్కారం వరించింది.

‘డెబ్భై ఐదేళ్ల్ల స్వాతంత్య్ర ఉత్సవాలు ముగిసినా.. ఇప్పటికీ కొందరు వివక్షకు గురవడం బాధాకరం. చదువుకున్న సమాజంలోనూ ఇలాంటి సంఘటనలు  దురదృష్టకరం. ఇలాంటివి స్వయంగా కొన్నిసార్లు అనుభవించా. ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా.. నాకే జరిగినట్టుగా విలవిల్లాడా. ప్రాంతం, భాష ఏదైనా.. బాధ అందరికీ ఒక్కటే. ప్రపంచంలో ఇది ఏ మూలనున్నా అంతం కావాలి. మనం చెప్పదలచుకున్న విషయాన్ని స్థానిక భాషల్లో అయితే శక్తిమంతంగా చెప్పగలుతాం అని నమ్ముతాను. దాన్నే ఆచరిస్తాను.
పాఠ్యపుస్తకాల్లోని కథలు, కవితలే.. నాగరాజుకి రాయడంపై ఆసక్తి పెంచాయి. కొందరు రచయితలను చదవడం మొదలుపెట్టాక పుస్తకాన్ని వదలకలేకపోయేవాడు. ఈ క్రమంలో కొన్ని పద్యాలు, పదాలు కొరుకుడు పడేవి కాదు. రచయితలు వాడుక భాషలో ఎందుకు రాయకూడదు? అనుకునేవాడు. స్థానిక యాసతో తనకు తోచిన విధంగా రచనలు చేయడం ప్రారంభించాడు. తిరుపతిలో డిగ్రీ చదువుతున్నప్పుడు అరసం, విరసం రచయితల ప్రభావం పడింది. అప్పుడే తనకి రచయితలో సామాజిక స్పృహ ఉండాలనే విషయం అర్థమైంది. పీజీలో ఎమ్మే తెలుగు ఎంచుకోవడంతో తెలుగుపై మరింత మమకారం పెరిగింది. ఆ సమయంలోనే ఒక వీధి బాలుడి మరణంపై స్పందించి రాసిన కవిత తొలిసారి పత్రికలో ప్రచురితమైంది. తర్వాత శ్రీశ్రీ, తిలక్‌, శివారెడ్డిలను ఇష్టపడసాగాడు. శ్రీశ్రీలో సామాజిక స్పృహ, తిలక్‌లో భావుకత, శివారెడ్డిలో పల్లెతనం అతడ్ని ఆకట్టుకునేవి. ఆపై దళిత, స్త్రీవాద, మైనారిటీ సాహిత్యాలవైపు మళ్లాడు. వీటిన్నింటికీ తన చుట్టూ ఉన్న పరిసరాలు, యాసను జోడించి రచనలు చేయసాగాడు. సమాజంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన, అన్యాయం జరిగినా.. తనకే జరిగినట్టుగా భావించి అక్షరాలు అల్లేవాడు. ఈ క్రమంలో చదువు అయిపోగానే నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. విద్యార్థులు, స్థానిక రైతులు, కూలీలు మాట్లాడుకునే భాష, సామెతలు తన కవిత్వంలోకి అనివార్యంగా చేరాయి. దీనికితోడు తండ్రి వీధి నాటకాలు వేసే నేపథ్యం, నానమ్మ పురాణ కథలు చెప్పడం.. అవన్నీ తనతోపాటు ప్రయాణించి కవిత్వంలో చేరాయి.  
ఎన్నో పురస్కారాలు..
‘‘యాలై పూడ్సింది 52 కవితల సంకలనం. కొన్ని వర్గాలు, ఉత్పాదక కులాలపై ఇంకా చిన్నచూపు ఉంది. స్వాతంత్య్రానికి ముందు ఎలాంటి వివక్ష ఉందో, ఇప్పటికీ కొన్నిచోట్ల అలాగే ఉంది. దీనిపై సమాజం ఉమ్మడిగా స్పందించాల్సిన అవసరం ఉన్నది అనే సారాంశమే ఈ ‘యాలై పూడ్సింది’ అంటాడు నాగరాజు. 2020 డిసెంబరులో ప్రచురించారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అనేక సంస్థలు ఆయన రాసిన పుస్తకంపై ప్రశంసలు కురిపించాయి. వివిధ సంస్థల నుంచి ఎనిమిది పురస్కారాలు, 20 సమీక్షలు వచ్చాయి.

- ఎం.కిరణ్‌కుమార్‌, తిరుపతి


లెక్కల మాస్టారి అక్షర ప్రేమ

చిరుగుల జీన్స్‌.. గళ్ల చొక్కా.. నున్నగా గీసిన గడ్డం.. ఆ అబ్బాయిని చూస్తే ఏ కాలేజీ కుర్రాడో అనుకుంటారు. ఓ పదినిమిషాలు తనతో మాట కలిపితే మాత్రం.. సంప్రదాయ సంకెళ్ల మధ్య నలిగిన బాధితుడిగా, దురాచారాలను అక్షర కరవాలంతో దనుమాడే సైనికుడిలా కనిపిస్తాడు. ఆ అక్షర తిరుగుబాటుకే కేంద్ర సాహిత్య అకాడెమీ కన్నడ యువ పురస్కారం గెలుచుకున్నాడు.
దాదాపీర్‌ది కర్ణాటకలోని విజయపుర జిల్లా హగరిబొమ్మనహళ్లి. తండ్రి కిరోసిన్‌ అమ్మే చిరు వ్యాపారి. ఇంటర్‌ చదవడానికి తను ధార్వాడ్‌ వెళ్లాడు. ఆ ప్రాంతం కళలు, రచయితలకు కాణాచి. అక్కడే సాహిత్యం పరిచయమైంది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ వచ్చినా ఇంజినీరింగ్‌లో చేరకుండా బోధనపై మక్కువతో డిగ్రీ వైపు వెళ్లాడు దాదాపీర్‌. ఆపై ఎమ్మెస్సీ, బీఈడీ కోసం కర్ణాటక విశ్వవిద్యాలయంలో చేరాడు. అది తన సాహిత్య పిపాసని మరింత విస్తృతం చేసింది. ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోని పుస్తకాలు, లలిత కళా అకాడమీ నిర్వహించే సాంసృతిక కార్యక్రమాలు దాదాపీర్‌ను బాగా ఉత్తేజితం చేసేవి. ఏమాత్రం సమయం దొరికినా వాటికే కేటాయించేవాడు. దారా బెంద్రే మొదలు.. రవి బెలేగేరే దాకా ప్రముఖ రచయితల పుస్తకాలన్నీ చదివేవాడు. ఎవరిని ఎంత చదివినా, ఎవరి తీరుని ఒంట పట్టించుకోకుండా తనకంటూ సొంత శైలి ఏర్పరచుకుంటూ చిన్నచిన్నగా కవితలు, కథలు, నవలలు రాయడం మొదలుపెట్టాడు. రాతలు ఊహల్లోంచి కాకుండా అనుభవాల్లోంచి వచ్చినప్పుడే అక్షరాల్లో జీవకళ ఉట్టిపడుతుందని గ్రహించాడు దాదాపీర్‌. చిన్నప్పుడు కొన్నిసార్లు తన కుటుంబం సామాజిక కట్టుబాట్లు, వివక్ష ఎదుర్కొంది. ఎన్నోసార్లు దాన్ని నిగ్గదీసి అడగాలనుకున్నా పసిప్రాయంలో అంత ధైర్యం లేకపోయేది. ఎప్పుడైతే తను రాయడం మొదలుపెట్టాడో.. అప్పటి బాధనంతా అక్షరీకరించడం మొదలు పెట్టాడు. ధిక్కార స్వరంతో తనకంటూ ఓ శైలి సృష్టించుకోసాగాడు. అప్పటికే తన కవితలు, నాటక విమర్శలు స్థానిక పత్రికల్లో ప్రచురితం కావడంతో కొద్దికొద్దిగా గుర్తింపు రాసాగింది. 1944లో ప్రఖ్యాత రచయిత్రి ఇక్బాలున్నీసా హుస్సేన్‌ ఆంగ్లంలో రచించిన ‘పర్దా అండ్‌ పాలిగామీ’ దాదాపీర్‌ను కదిలించింది. అందులో ముస్లిం మహిళలు ఎదుర్కొనే సామాజిక కట్టుబాట్లు, వివక్ష, పేదాగొప్ప తారతమ్యం.. కళ్లకు కట్టినట్టు రాశారామె. దాన్ని 2021లో కన్నడంలోకి అనువదించాడు. దీంతో దాదాపీర్‌కి మంచి పేరొచ్చింది. తర్వాత.. పశ్చిమ కనుమల్లో పదేళ్లకు ఓసారి పూసే ‘నీలకురింజి’ పుష్పం స్ఫూర్తితో పది అందమైన కథలను సంకలనం చేశాడు. ఇవి పేద కుటుంబాల అస్తిత్వ పోరాటం, అనుబంధాలు, మనసుల్లోని ఆర్ధ్రత, గ్రామ జీవన సౌందర్యం, సామాజిక కట్టుబాట్లు, కోర్టుల జోక్యంపై సున్నిత వ్యాఖ్యానం నేపథ్యాలుగా ఉంటాయి. ఆయా సందర్భాల్లోని సామాజికాంశాలను స్పృశిస్తూనే.. అసమానతలపై దాదా పీర్‌ కలం ప్రశ్నల వాగ్బాణాలను ఎక్కుపెట్టుతున్నట్టుగా సాగుతుంటాయి ఈ కథలు. ఇదే సంకలనం కేంద్ర సాహిత్య అకాడెమీ న్యాయ నిర్ణేతలనూ కదిలించి యువ పురస్కారం కట్టబెట్టింది.

- కె.ముకుంద, బెంగళూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని