అన్నానికి లేని స్థితి నుంచి.. రూ.కోట్లు పంచే దాతగా!

లక్షలు, కోట్లు సంపాదించేవాళ్లకి ఈ సమాజంలో కొదవ లేదు... అందులోంచి కొంతైనా సాయం చేసేవాళ్లే అరుదు! ఆ కొరతని కొంతైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు చక్రధర్‌ గౌడ్‌. కూటికి లేని స్థితి నుంచి వచ్చి.. రూ.కోట్ల సాయం చేస్తున్నాడు.

Updated : 29 Oct 2022 10:49 IST

లక్షలు, కోట్లు సంపాదించేవాళ్లకి ఈ సమాజంలో కొదవ లేదు... అందులోంచి కొంతైనా సాయం చేసేవాళ్లే అరుదు! ఆ కొరతని కొంతైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు చక్రధర్‌ గౌడ్‌. కూటికి లేని స్థితి నుంచి వచ్చి.. రూ.కోట్ల సాయం చేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వందల రైతు కుటుంబాలను ఆదుకుంటున్న ఈ సిసలైన శ్రీమంతుడితో మాట కలిపింది ఈతరం.

మనసున్న శ్రీమంతుడు

చక్రధర్‌ మొదట్లో ఒక్కో రైతు కుటుంబానికి రూ.2లక్షలు అందించాడు. తర్వాత సాయం ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో లక్షకి కుదించాడు. అలా ఇప్పటికి 451 కుటుంబాలను ఆదుకున్నాడు. చివరిసారి సెప్టెంబర్‌ 25న సిద్దిపేటలో ఒకేసారి 100 కుటుంబాలకు రూ.కోటి అందించడంతో అతడి దాతృత్వం వెలుగులోకి వచ్చింది. కేవలం సాయపడటమే కాదు.. చావుల్ని ఆపాలనే ఉద్దేశంతో రైతుల్లో ధైర్యం నింపేలా, ఆత్మహత్యా ప్రయత్నం ఆపేలా.. ఇంటిపెద్ద చనిపోతే కుటుంబం పడే బాధలు తెలియజేసేలా.. ప్రత్యేకంగా పాటలు రాయిస్తున్నాడు. ఇదిగాక కరోనా సమయంలో రెండున్నర లక్షల మందికి అన్నదానం చేశాడు. పేద ఆడపిల్లల వివాహానికి అండగా నిలుస్తున్నాడు. రూ.10లక్షల వ్యయంతో టర్పాలిన్‌ కవర్లు కొని రైతులకు అందజేశాడు. త్వరలోనే 500 మంది గీత కార్మికులకు జీవిత బీమా చేయిస్తున్నట్టు చెబుతున్నాడు. ఈ సాయం జీవితాంతం కొనసాగిస్తానంటున్నాడు చక్రధర్‌.

చక్రధర్‌ సొంతూరు సిద్దిపేట. అమ్మానాన్నలు టీకొట్టు నడిపేవారు. రోజువారీ సంపాదనతోనే సంసారం సాగే కుటుంబం. ఇంటర్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌ వెళ్లాడు. కన్నవాళ్లకి సాయపడేందుకు.. దుస్తుల దుకాణం, కవర్ల తయారీ పరిశ్రమల్లో పని చేశాడు. ఈ క్రమంలో కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పరిచయమైంది. అదే సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం మొదలైంది. సన్నిహితుల సలహాతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాడు. రాత్రింబవళ్లు పనిపై ధ్యాస పెట్టాడు. పనితీరుకి తోడు.. అదృష్టం కలిసొచ్చింది. మంచి లాభాలు కళ్లజూశాడు. ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితి మెరుగైంది.

కదిలించిన ఆత్మహత్య
2008లో ఓ కౌలు రైతు అప్పుల బాధతో ఉరి వేసుకుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన చక్రధర్‌ని కదిలించింది. లక్షలు, కోట్లు సంపాదించేవాళ్లు ఒకవైపు.. రూ.30వేలు, రూ.40వేలకే ప్రాణాలు తీసుకుంటున్న పేదలు మరోవైపు. పైగా ఇంటిపెద్దని కోల్పోయిన ఆ కుటుంబం పడే బాధలు చూసి తట్టుకోలేకపోయాడు. అలాంటి కొందరికైనా సాయం చేయకపోతే నా సంపాదనకు అర్థం లేదని భావించాడు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా, ఎవరి ద్వారానైనా విషయం తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వద్దకు వెళ్లి నేరుగా ఆర్థిక సాయం చేసేవాడు. కొన్నేళ్లు ఇలా చేశాక.. సాయాన్ని ఎక్కువమందికి అందించాలనే ఉద్దేశంతో 2017లో ‘ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించాడు. తన సంపాదనలో నలభై శాతం రైతు కుటుంబాలకే కేటాయించ సాగాడు. భార్య ఆరోశికరెడ్డి సైతం అతడి సత్సంకల్పానికి తోడుగా నిలుస్తోంది. సాయం చేయాలనుకునే వారిని సొంత పద్ధతుల్లో ఎంపిక చేస్తాడు చక్రధర్‌. ముందు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ వివరాలు సేకరిస్తాడు. అందులో తొలి ప్రాధాన్యం కౌలు రైతులు, అందునా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నవాళ్లకి ప్రాధాన్యం ఇస్తాడు. ఫౌండేషన్‌ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న రైతు గ్రామానికి వెళ్లి ఈ వివరాలన్నీ ఆరా తీస్తారు. నిజంగానే అప్పుల బాధతో చనిపోయారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని వాకబు చేస్తారు. చివరగా అత్యవసరంగా సాయం దక్కాల్సిన వాళ్లని గుర్తించి చెక్కులు అందజేస్తారు.

కౌలు రైతు బతకాలి
‘సమాజంలోని బాధితులు, అణగారినవర్గాలను ఆదుకునే రకరకాల సంస్థలున్నాయి. ప్రత్యేకంగా కర్షకుడిపై దృష్టి పెట్టినవాళ్లు తక్కువ. ప్రస్తుతం కౌలు రైతు పరిస్థితి దారుణంగా ఉంది. చిన్నచిన్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారంటే వాళ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరుగా డబ్బు సాయం చేయడం ద్వారా వాళ్ల తక్షణ అవసరాలు తీరతాయి. ఒక భరోసా ఉంటుంది. ఓదార్పు మాటలు కడుపు నింపవు. నేను రైతు ఆత్మహత్యలు లేని సమాజం కోరుకుంటున్నా. దానికి నావంతు ప్రయత్నిస్తా. రైతు లేకుంటే మనకు తిండి లేదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నాతోపాటు మంచి మనసుతో స్వచ్ఛందంగా దాదాపు వందమంది వరకు పని చేస్తున్నారు. కర్షకుల సమస్యలు తీర్చడం కోసం ‘కౌలునేస్తం డాట్‌ ఓఆర్‌జీ’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించాం. యువత విషయానికొస్తే వాళ్లకు వయసు, ఉత్సాహం, ఓపిక, సమయం అన్నీ ఉంటాయి. దానికితోడు మంచి మనసూ ఉండి ఏదైనా సమస్యపై పోరాడితే ఈ సమాజమే మారిపోతుంది’.

- ముడుసు కృష్ణమూర్తి, లాలాపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని