మాటే.. రిమోట్‌!

మాట్లాడితే చాలు.. ఆ వీల్‌ఛైర్‌ ముందుకూవెనక్కీ వెళ్తుంది. మా రాకపోయినా మీటతోనూ పరుగులు పెట్టించొచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, శారీరక వైకల్యం ఉన్నవారు, పక్షవాత బాధితులకు ఎంతో ఆసరా. తయారు చేసింది తలలు పండిన శాస్త్రవేత్తలేం కాదు.. బీటెక్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు.

Updated : 17 Jun 2023 02:35 IST

మాట్లాడితే చాలు.. ఆ వీల్‌ఛైర్‌ ముందుకూవెనక్కీ వెళ్తుంది. మా రాకపోయినా మీటతోనూ పరుగులు పెట్టించొచ్చు. వృద్ధులు, దివ్యాంగులు, శారీరక వైకల్యం ఉన్నవారు, పక్షవాత బాధితులకు ఎంతో ఆసరా. తయారు చేసింది తలలు పండిన శాస్త్రవేత్తలేం కాదు.. బీటెక్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు.

‘ఊపిరి’ సినిమాలో నాగార్జున ఓ వీల్‌ఛైర్‌ వాడుతుంటారు. అలాంటిది కొనాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. పైగా అది జాయ్‌స్టిక్‌తో పని చేస్తుంది. ఆ అవసరం కూడా లేకుండా.. కేవలం మాటలనే ఆజ్ఞలుగా భావించి ఎటు అంటే అటు కదిలే వాయిస్‌ కమాండ్‌ చక్రాల కుర్చీ తయారు చేశారు విశాఖపట్నంలోని బాబా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (బిట్స్‌) విద్యార్థులు.. నూకేష్‌, అఖిల, సంధ్య, సత్యవతి, దిలీప్‌కుమార్‌, ధరణి, కార్తీక్‌, నరేష్‌, ఉదయ్‌కుమార్‌, కీర్తిలు. అదీ అతి తక్కువ ఖర్చుతో, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) టెక్నాలజీతో.

వీళ్లకి బీటెక్‌ ఆఖరి సంవత్సరంలో.. ప్రాజెక్ట్‌వర్క్‌ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా.. ఏదో ఆషామాషీది కాకుండా జనాలకు ఉపయోగపడే ఆవిష్కరణ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో శారీరక బలహీనత కారణంగా ఇతరులపై ఆధారపడే వారికి ఉపయోగపడేలా వీల్‌ఛైర్‌ రూపొందించాలని భావించారు. ముందు ఒక సాధారణ చక్రాల కుర్చీని కొన్నారు. దాని విడిభాగాలన్నీ విప్పి తామనుకున్న విధంగా సాంకేతికతను జోడించి సరికొత్త చక్రాల కుర్చీ తయారు చేశారు. 120 కిలోల బరువు మోసేలా దీన్ని రూపొందించారు. వీల్‌ఛైర్‌ అడుగున రెండు మోటార్లు, బ్యాటరీలు అమర్చారు. సెల్‌ఫోన్‌తో అనుసంధానానికి వీలుగా ఎనిమిది ఛానళ్ల రిలే, బ్లూటూత్‌ మాడ్యూల్స్‌ ఉపయోగించారు. వాయిస్‌ కోడింగ్‌తో నడిచేలా ఆర్డినో, జీపీఎస్‌ పరికరాలు బిగించారు. ప్లే స్టోర్‌ నుంచి ఏఎమ్‌ఆర్‌ వాయిస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, బ్లూటూత్‌ ద్వారా వీల్‌ఛైర్‌కు అనుసంధానించి.. చక్రాల కుర్చీని ముందుకు, వెనక్కి, పక్కకు కదిలేలా చేయగలిగారు. రెండో ఆప్షన్‌గా.. మాట్లాడడం సమస్యగా ఉన్నవారి కోసం బటన్‌ సదుపాయం పెట్టారు. ముందుకు, వెనక్కి, కుడి, ఎడమలకు కదలడానికి వీలుగా మీటను ఏర్పాటు చేశారు.

కుటుంబ సభ్యులు దరిదాపుల్లో లేనప్పుడు, వీల్‌ఛైర్‌ ఎక్కడైనా ఆగిపోయినప్పుడు ఇతరులకు తెలియజేయడానికి, జీపీఎస్‌తో పాటు ఎస్‌వోఎస్‌ సిస్టం పెట్టారు. దీంతో బటన్‌ నొక్కగానే ఐదుగురి సెల్‌ఫోన్లకు సందేశాలు వెళ్లిపోతాయి. రూ.30 వేలతో ఈ ఆవిష్కరణ సిద్ధమైంది. దీని రూపకల్పనలో సహాయ ఆచార్యుడు ప్రేమ్‌సాగర్‌  మార్గదర్శకత్వం చేశారంటోంది యువబృందం.

బొద్దల పైడిరాజు, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని