మనో నియంత్రణ

మానవుడి మనసు అత్యంత చంచలమైనది. దాని నియంత్రణ అత్యంత కష్టతరం. ఒక కుందేలును బంధించాలంటే దాని చెవులనే పట్టుకోవాలి. బాతు అయితే మెడను,  కోడి కాళ్లను  పట్టుకొని మోసుకెళ్ళాలి. అప్పుడే అవి మననుంచి జారిపోకుండా, పారిపోకుండా ఉంటాయి.

Published : 28 Sep 2022 00:56 IST

మానవుడి మనసు అత్యంత చంచలమైనది. దాని నియంత్రణ అత్యంత కష్టతరం. ఒక కుందేలును బంధించాలంటే దాని చెవులనే పట్టుకోవాలి. బాతు అయితే మెడను,  కోడి కాళ్లను  పట్టుకొని మోసుకెళ్ళాలి. అప్పుడే అవి మననుంచి జారిపోకుండా, పారిపోకుండా ఉంటాయి. మర్కటంలా అతి చంచలమైన మనసును బంధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడి సాధన చేస్తేనే మనసు మన వశమయ్యే అవకాశం ఉంటుంది.

మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు, తనతో యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్న బంధువులను చూసి, విషాదంతో ధనుస్సు, అక్షయ తూణీరం వదిలేసి, సాగిలపడ్డాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ధర్మసూక్ష్మాలు, జీవిత సత్యాలు బోధించి, అతడిని యుద్ధోన్ముఖుణ్ని చేస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే- భగవద్గీత. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి ఎందుకు తన మనసును తన అధీనంలోకి తెచ్చుకోవాలో తెలియజెప్పాడు. ఆ  సమయంలో, తన మనసును అదుపులో పెట్టు కోవడం అత్యంత కష్టతరంగా ఉందని అర్జునుడు భగవంతుడికి విన్నవించాడు. అప్పుడు ఏ ఉపాయాలు, ఏ ప్రయత్నాలచేత,  మనసును తమ వశం చేసు కోవచ్చో శ్రీకృష్ణుడు, సవ్యసాచికి తెలిపాడు.

రామాయణంలో రావణాసుర, కుంభకర్ణ, విభీషణులు సోద రులు. రావణాసురుడు మహా శివభక్తుడు. ధర్మ, నిష్ఠలను అనుసరించేవాడు. సీతాదేవి గురించి, ఆమె అందచందాల గురించి, తన సోదరి శూర్పణఖ ద్వారా విన్నాక అతడి మనసు నియంత్రణ కోల్పోయింది. సీతదేవినే చెరపట్టాడు! కుంభకర్ణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడు. కాని ఆ వరం కోరుకునే సమయానికి, సరస్వతీ దేవి అతడి మనసును ప్రభావితం చేసింది. అందుచేత మనో నియంత్రణ కోల్పోయి, తనకు ఆరు మాసాలు నిద్రపోయేలా వరం ఇమ్మని బ్రహ్మను అడిగాడు.

వైకుంఠంలో జయ, విజయులు ద్వార పాలకులుగా తమ విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వహించేవారు. వైకుంఠంలో తాము ద్వార పాలకులమన్న గర్వం క్రమంగా వారిలో అహంకారం నింపింది. ఒకసారి శ్రీమహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో సహా, విశ్రమిస్తున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ కుమారులైన సనకాదిక రుషులు నలుగురు, తమకత్యంత ఇష్టుడైన శ్రీమహావిష్ణువును దర్శించడానికి వెళ్ళారు. జయ విజయులు వారిని లోపలికి పోనీయలేదు. బాలకులుగా కనిపించిన ఆ రుషుల్ని చూసి వారు పరిహసించారు. రుషులు ఎంత వేడుకున్నా వారిని స్వామి దర్శనానికి పంపలేదు. అప్పుడు రుషులు ద్వారపాలకులను శపిస్తారు.

మన మనసు నియంత్రణలో లేకపోతే లోకంలో అనవసర వివాదాలు, అధర్మమైన కోరికలు పీడిస్తాయి. భగవంతుడి సన్నిధి కోరుకుంటే, ఆ ప్రయాణం ఎటువంటి మానసిక అవరోధాలు లేకుండా, ఏకోన్ముఖంగా సాగాలి. మనసును పూర్తిగా అధీనంలో ఉంచుకుంటే కానీ, అది సాధ్యం కాదు. మనోనియంత్రణను జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే- మన జీవనయానం, జీవితాంతర ప్రయాణం, సుఖంగా సంతోషంగా ఉంటాయి.

- ఎం.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts