సింహాచల చందనోత్సవం

తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది.

Published : 10 May 2024 00:19 IST

తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికిపట్టుగా ఈ కొండ విరాజిల్లుతోంది. ఆలయ నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దంలో జరిగి ఉండవచ్చని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కోణార్క్‌ ఆలయ నిర్మాత తూర్పు గాంగరాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, రథయాత్ర, భక్త్యోత్సవం, చందనోత్సవం, ఉట్లవేడుక, గోదాకల్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు. చందనోత్సవం- భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం. శ్రీమహావిష్ణువు వరాహరూపంలో హిరణ్యాక్షుణ్ని వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు. హిరణ్యకశిపుడి కుమారుడు పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలశాడని, బ్రహ్మ సకల దేవతలతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ గాథ.

వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు. ఆ రోజే సింహాద్రినాథుడి గంధం వొలుపు, నిజరూప దర్శనం, చందనోత్సవంగా ప్రసిద్ధి. పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగనమార్గాన విహరిస్తుండగా ఒకచోట విమానం ఆగిపోయింది. స్వామి స్వప్నంలో పురూరవుడికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని, పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థలపురాణం. హిరణ్యకశిపుడి వధానంతరం ఉగ్రనరసింహుణ్ని చల్లబరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం. చందనోత్సవంనాడు మూడు మణుగుల చందనం, ఆ తరవాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనం సమర్పిస్తారు.

ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తోంది. సింహగిరి దగ్గర దుగ్గన పేరుగల బోయతెగకు చెందిన వ్యక్తి కొర్రలు జొన్నలు పండించేవాడు. స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది. వరాహ రూపంలో వెళ్ళి చేను మేస్తుండేవాడు. కొన్నాళ్లు చూసి దుగ్గన ఆ అడవిపందిని వెంటాడి శూలం విసిరాడు. నెత్తురోడుతూ అది ఒక పుట్టలో దూరింది. దుగ్గన అక్కడకు వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడిఉంది. జాలిపడి గంధం తెచ్చి పట్టువేశాడు. ఆ చల్లదనానికి వరాహం తేరుకొని తాను భగవంతుణ్నని ఆ పుట్టలో ఉంటానని చెప్పాడు. అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బోయడు పూర్వజన్మలో వాలి అని, రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని, శ్రీరాముడే వరాహమని, వాలి దుగ్గనగా పుట్టాడని జానపదుల విశ్వాసం.

నరసింహస్వామి యోగమార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి మూలాధారానికి విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మ తత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని