Updated : 01/12/2021 05:19 IST

Flood: వరదపోటు

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  వాగులు ఉప్పొంగి స్తంభించిన రాకపోకలు

కండలేరు ఉద్ధృతికి హైవే జలదిగ్బంధం

ఈనాడు డిజిటల్‌-ఒంగోలు, నెల్లూరు, గూడూరు- న్యూస్‌టుడే: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సహా పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. నెల్లూరు జిల్లా నుంచి సోమశిల జలాశయం ద్వారా లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు జలాశయానికి 37 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ రిజర్వాయర్‌ను 16 అడుగుల వరకు నింపి.. 5 గేట్ల ద్వారా 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న మన్నేరుకు వదిలారు. ఈ నీటితో కందుకూరు- గుడ్లూరు మధ్య మాచవరం సమీపంలో రాకపోకలు నిలిచాయి. పామూరు మండలంలో రెండు రోజుల వ్యవధిలో 177 మిల్లీమీటర్లు, సీఎస్‌పురంలో 109, వెలిగండ్లలో 102 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. పామూరు పాతచెరువు అలుగు పొంగి.. కట్ట కొంతమేర కోసుకుపోయింది. జేసీ వెంకటమురళి ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ అధికారులు ఇసుక, కంకర బస్తాలు వేసి కట్ట మరమ్మతులు చేపట్టారు. గోపాలపురం ఎస్సీకాలనీ వద్ద 565 జాతీయ రహదారికి ఇరువైపులా నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. రహదారి మధ్యలో పొక్లైయిన్‌తో తవ్వి పైపులు వేసి బయటకు తోడిపోస్తున్నారు. పామూరు నుంచి కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు పొంచి ఉన్న ఇనిమెర్ల, నుచ్చుపొద గ్రామాల ప్రజలను స్థానిక పాఠశాల భవనాల్లోకి తరలిస్తున్నారు. పీసీపల్లి మండలంలోని బట్టుపల్లి వద్ద పాలేరు, తలకొండపాడు వాగులు, రాచర్ల మండలం పలకవీడు వద్ద ఉప్పువాగు పొంగాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశించారు.

గూడూరు శివారులో స్తంభించిన వాహనాలు

నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో హైవే చుట్టూరా వరద నీరు చేరి.. ఆ మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. ఇక్కడ చెన్నై-కోల్‌కతా (ఎన్‌హెచ్‌-16)పై కొత్త వంతెనలు నిర్మిస్తుండటంతో కొన్నాళ్లుగా వాహనాలను డైవర్షన్‌ రోడ్డులో మళ్లిస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కండలేరు సహా స్థానిక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. డైవర్షన్‌ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ఐదు అడుగుల మేర వరద పోటెత్తడంతో దారి కనిపించలేదు. సోమవారం రాత్రి నుంచే రాకపోకలు నిలిపివేశారు. గూడూరు నుంచి అటూఇటూ సుమారు 25 కిలోమీటర్ల మేర వాహనాలు మూడు వరుసల్లో నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, డీటీసీ చందర్‌, గూడూరు సబ్‌డివిజనల్‌ అధికారులు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.

ప్రయాణికుల ఆహాకారాలు

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వాహనాల్లోనే ఉండి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చుట్టూరా నీరే ఉండటంతో కిందకు దిగేందుకూ వీలుకాలేదు. మంచినీరు, ఆహారం దొరక్క నానాయాతన అనుభవించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ సుమారు 10 గంటల పాటు వాహనాల్లోనే గడిపారు. తర్వాత కార్లు, బస్సులను పొదలకూరు, వెంకటగిరి, పోర్టు రోడ్డు మార్గంలో పంపించారు. టోల్‌ ఫీజు మాత్రం యథాతథంగా వసూలు చేశారు. మరోపక్క, హైవే నిర్మాణ పనుల్లో జాప్యం చర్చనీయాంశమైంది. వంతెనల నిర్మాణం ఏడేళ్లయినా పూర్తిచేయలేదు. 2015లో వరదలకు గూడూరు- నెల్లూరు మధ్య రోడ్డు కొట్టుకుపోగా, ఇప్పటికీ అక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి సీఎం చంద్రబాబు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినా పురోగతి లోపించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని