ఆటో వెళుతుండగానే కూలిన వంతెన

తుంగభద్ర కాలువ పైనుంచి కూలీలతో నిండిన ట్రాలీఆటో వెళుతుండగానే వంతెన కుప్పకూలి, ఓ మహిళ గల్లంతయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం

Published : 18 Jan 2022 05:01 IST

తుంగభద్ర కాలువలో మహిళ గల్లంతు

29 మంది కూలీలు సురక్షితం

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: తుంగభద్ర కాలువ పైనుంచి కూలీలతో నిండిన ట్రాలీఆటో వెళుతుండగానే వంతెన కుప్పకూలి, ఓ మహిళ గల్లంతయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో స్థానికురాలైన వ్యవసాయ కూలీ సావిత్రి నీటిలో కొట్టుకుపోగా... మరో 29 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థులు, బాధితుల కథనం ప్రకారం... ఉద్దేహాళ్‌కు చెందిన 60 మంది కూలీలు రెండు ట్రాలీ ఆటోలలో సోమవారం హెచ్చెల్సీ కాలువ అవతలి వైపున్న వేరుసెనగ పొలాల్లో కలుపుతీతకు, మిరప కాయలు కోసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తూ... 30 మంది కూలీలతో ఉన్న ఆటో కాలువ పైనుంచి దాటుతుండగానే... అనూహ్యంగా వంతెన కుప్పకూలింది. ఆటో కాలువలో ఇరుక్కుపోయింది. భయాందోళనకు గురైన కూలీలు అటూఇటూ కదలడంతో సావిత్రి అనే మహిళ కాలువలో పడిపోయి... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమీప పొలాల్లోని రైతులు పరుగెత్తుకొచ్చి కూలీలను బయటికి తీసుకొచ్చారు. ఆటోను తాడు కట్టి బయటకు లాగారు. డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు. నీటిలో గల్లంతైన సావిత్రి కోసం కుటుంబ సభ్యులు, స్ధానికులు గాలిస్తున్నారు.

* హెచ్చెల్సీ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ... ‘శిథిలావస్థలో వంతెనలు- అవస్థల్లో ప్రజలు’ అనే శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. గతంలో సైతం పలుమార్లు హెచ్చరించినా.. అధికారులు స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని