AP News: సంక్షేమంతోనే అభివృద్ధి

‘రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారంగా మారిన నవరత్నాల రూపకల్పనకు బీజం ప్రజా సంకల్ప యాత్రలోనే పడింది’ అని వైకాపా నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా...

Updated : 07 Nov 2021 06:11 IST

జగన్‌ పాదయాత్రలోనే నవరత్నాలకు బీజం
ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్ల కార్యక్రమంలో నేతలు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారంగా మారిన నవరత్నాల రూపకల్పనకు బీజం ప్రజా సంకల్ప యాత్రలోనే పడింది’ అని వైకాపా నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2017 నవంబరు 6న ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ప్రసంగించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ... ‘పాదయాత్రలో కళ్లారా చూసిన ప్రజా సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి నవరత్నాలను రూపొందించి, నేరుగా లబ్ధి చేకూరుస్తున్నారు. ఆ యాత్ర స్ఫూర్తిలో ప్రజాసేవకు పునరంకితమవుదాం’ అని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ... ‘నాటితరం నేతల్లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ని ఉక్కు మనిషిగా కొనియాడతారు. ఈ తరంలో మనరాష్ట్రంలో సీఎం జగన్‌ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి, సీఎం అయ్యాక చేపడుతున్న పథకాలన్నీ సంచలనమే. సంక్షేమ సారథిగా జాతీయ స్థాయిలో మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు’ అని కొనియాడారు. సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి జగన్‌ పాలనను గ్రామ స్థాయికి, సంక్షేమాన్ని గడప దగ్గరకు తీసుకెళ్లారు. పొలంగట్టు మీదికి వెళ్లి రైతుకు ఏం కావాలో అడిగి... అదే చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో సంక్షేమమే కనిపిస్తోంది... అభివృద్ధి ఏదీ? అని కొందరు మాట్లాడుతున్నారు. సంక్షేమంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో పంచాయతీలను పక్కనపెట్టి... జన్మభూమి కమిటీల పేరిట తెదేపా వారిని నియమించుకుని, వారితోనే పాలన కొనసాగించిన తీరును చూశాం. కానీ... జగన్‌ విశాల దృక్పథంతో పథకాలను తీసుకొచ్చారు. పథకాలను అందించడంలో కుల, మత, ప్రాంతాలు, పార్టీలను చూడబోమని చెప్పిమరీ అమలు చేస్తున్న జగన్‌లాంటి ముఖ్యమంత్రులను ఎక్కడైనా చూశామా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహనరావు సైతం ప్రసంగించారు. అంతకుముందు సర్వ మత ప్రార్థనలు చేశారు. కేక్‌ కోసి నేతలు సంతోషం పంచుకున్నారు. పాదయాత్రలో జగన్‌తోపాటు నడిచిన కొందరిని సత్కరించారు.

వైకాపా కేంద్ర కార్యాలయంలో కేకు కోస్తున్న నేతలు అప్పిరెడ్డి, జగన్మోహనరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని