AP News: గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరు తొలగించాలి

గుంటూరులోని టవర్‌కు ఉన్న జిన్నా పేరును తొలగించాలని భాజపా నేతలు డిమాండు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా వెంటనే తొలగించాలని భాజపా

Updated : 10 Aug 2022 11:44 IST

భాజపా నేతల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: గుంటూరులోని టవర్‌కు ఉన్న జిన్నా పేరును తొలగించాలని భాజపా నేతలు డిమాండు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా వెంటనే తొలగించాలని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ కోరారు. గుంటూరు పాకిస్థాన్‌లో లేదని, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం, గుర్రం జాషువా వంటి మహానీయుల పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా వెంటనే తొలగించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ను గత సోమవారం కలిసి జిన్నా టవర్‌ పేరును మార్చాలని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించకుంటే ఆందోళనకు దిగుతామని పార్టీ నేతలు విష్ణువర్థన్‌రెడ్డి, నాగోతు రమేష్‌నాయుడు హెచ్చరించారు.


తెలంగాణ భాజపా ఎమ్మెల్యే హెచ్చరిక

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌, జిన్నా సెంటర్‌ పేర్లపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. వెంటనే ఆ పేరు మార్చి అబ్దుల్‌ కలాం టవర్‌గా నామకరణం చేయాలని ఒక వీడియో సందేశం విడుదల చేశారు.


అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలి

నగరంపాలేం, న్యూస్‌టుడే: గుంటూరులోని జిన్నాటవర్‌ సెంటర్‌ పేరును అబ్దుల్‌ కలాం రహదారిగా మార్చాలని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జి వల్లూరు జయప్రకాష్‌నారాయణ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం భాజపా నాయకులు నగర కమిషనర్‌ అనూరాధను కలిసి వినతిపత్రం అందజేశారు.


అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది: వైకాపా

ఈనాడు, అమరావతి: గుంటూరులోని జిన్నా టవర్‌ పేరు మార్చాలని భాజపా నేతలు అనడం వెనుక కుట్ర ఉందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి ముందు నిర్మించిన జిన్నా టవర్‌ ఇప్పుడు భాజపా నేతలకు అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

* భాజపా మత రాజకీయాలకు పాల్పడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌ వలి ఆరోపించారు. 23 గజాల్లో ఉన్న టవర్‌ గురించి ఆ పార్టీ ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా అని ప్రశ్నించారు.

* గుంటూరు జిన్నా టవర్‌ను వివాదం చేసి, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి, రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు భాజపా చేస్తున్న ప్రయత్నాలు హేయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. భాజపా ప్రయత్నాలను ప్రజలంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని