Andhra News: న్యాయమూర్తులు పరిధి దాటొద్దు

‘న్యాయమూర్తులకు తమ పరిధి తెలియాలి. వారే ప్రభుత్వాన్ని నడపాలనుకోకూడదు. వినయ విధేయతలు ఉండాలి. రాజుల మాదిరి ప్రవర్తించకూడదు. ఒకరి పరిధిలోకి మరొకరు పోకూడదని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో ...

Updated : 25 Mar 2022 04:57 IST

వారే ప్రభుత్వాన్ని నడపాలనుకోకూడదు

సుప్రీంకోర్టు గత తీర్పులు చెప్పింది ఇదే

శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘న్యాయమూర్తులకు తమ పరిధి తెలియాలి. వారే ప్రభుత్వాన్ని నడపాలనుకోకూడదు. వినయ విధేయతలు ఉండాలి. రాజుల మాదిరి ప్రవర్తించకూడదు. ఒకరి పరిధిలోకి మరొకరు పోకూడదని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో పేర్కొంది’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. న్యాయమూర్తుల పరిధిపై జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ ఇచ్చిన తీర్పును ఆయన ఉంకించారు. ‘నెలలోపు ఇది చేయండి.. మూడు నెలల్లోపు ఇది చేయండి.. ఆరు నెలల్లోపు ఇది చేయండి.. అంటే వీలుపడుతుందా? రోడ్డు, డ్రెయిన్‌ అంటే ఏమిటి? రోడ్డు కింద ఏమొస్తుంది? లేయర్‌ అంటే ఏమిటో అర్థం చేసుకునే శక్తి మనకు లేవని పలు తీర్పులు చెబుతున్నాయి’ అని వాఖ్యానించారు. పాలన వికేంద్రీకరణపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. న్యాయస్థానాల పరిధికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. ‘ప్రభుత్వం, శాసన వ్యవస్థ ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో తనిఖీ చేయాల్సిన అవసరం, బాధ్యత న్యాయస్థానాలకు లేదు. అది చట్టపరంగా ఉందా? లేదా అనేది చూడాలని అశ్వనీ కుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అదర్స్‌ కేసు తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు.. తన హద్దు దాటి చూడటం ఇబ్బందే. ఏం చేయాలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు తెలుసు అని టాటా సెల్యులర్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసు తీర్పు సందర్భంగా వివరించారు. నాకు పరిధులున్నాయి. నేను అకౌంటెంట్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, ఫైనాన్షియర్‌, బ్యాంకర్‌ను కాదు.. వందల, వేల పేజీలు చదివి తీర్పివ్వాలంటే కష్టం. ఈ శక్తి, తెలివి ప్రభుత్వానికే ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలను తాకకూడదని ఛీఫ్‌ జస్టిస్‌ నీలి పేర్కొన్నారు’ అని బుగ్గన వివరించారు.

శాసనకర్తలకే చట్టాన్ని మార్చే హక్కు లేదంటే ఎలా?

ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుందని బుగ్గన పేర్కొన్నారు. ‘ఒకసారి ఏపీసీఆర్‌డీఏ చట్టం చేశాక.. దాన్ని మార్చలేరంటారు. దాన్ని రూపొందించిన శాసనకర్తలకే మార్చే హక్కు లేదంటే ఎలా? ఏదో జరగబోతోందని ముందే ఊహించి, దాని ప్రకారం తీర్పివ్వక్కర్లేదు. ఆ సందర్భం ఎదురైనప్పుడు దాని గురించి ఆలోచించొచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఏదో జరగబోతోందని ఊహించి, చేయొద్దంటే చట్టం చేయడాన్ని ఆపాలనే ప్రయత్నమే కదా. మీరు చట్టం చేయడానికి వీలుపడదని హైకోర్టు చెప్పడమే ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తోంది. తీర్పిచ్చే సమయంలో 1910 నుంచి చరిత్ర, వివిధ ఘటనలు, ప్రాంతాల వారీగా పేదరికం పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది మా భావన. కోర్టు తీర్పు చూస్తే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి వచ్చినట్లుంది. చట్టం తయారైంది శాసనసభలోనే.. తీర్పును పరిశీలించాల్సింది సభలోనే. దాన్ని పరిశీలించకపోతే కొత్త చట్టం ఎక్కడ తయారు చేస్తాం? రాష్ట్రంలోని అని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం మూడు మండలాలు, 53,748 ఎకరాల అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది. అందులో 1,571 ఎకరాల్లోనే రాజధాని నిర్మించాలని నిర్ణయించారు’ అని పేర్కొన్నారు.

ఎ క్యాపిటల్‌ అంటే ఒకటే అనా?

‘విభజన చట్టంలో ఎ న్యూ క్యాపిటల్‌ అని ఉందని, ఒకటే ఉండాలని వాదన. విజయవాడకు ఒక బస్టాండ్‌ ఉండాలంటే.. ఒకటే ఉండాలని అర్థమా? రెండోది ఉండకూడదా?’ అని నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ వర్సెస్‌ లక్ష్మీనారాయణదత్‌ కేసును మంత్రి బుగ్గన ఉటంకించారు. ‘చరణ్‌సింగ్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మరోసారి ప్రమాణస్వీకారం చేయాలని అడిగారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆచరణాత్మకంగా పరిశీలించాలని సూచించిందని హర్షవర్ధన్‌వర్మ వర్సెస్‌ చరణ్‌సింగ్‌, ఇతరుల కేసును ప్రస్తావించారు. ‘న్యాయమూర్తులు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. కానీ ప్రభుత్వం సభకు, సభ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ధర్మాసనం ఓ తీర్పులో ప్రస్తావించింది’ అని బుగ్గన చెప్పారు.


ఆ అధికారమే లేదంటే ఎలా: ధర్మాన


 

‘ఓటేయడం ద్వారా ప్రజలు ఒక పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చారంటే.. అంతకు ముందున్న విధానాలు నచ్చలేదు, వాటిని మార్చమనడమే. ఆ అధికారమే సభకు లేదంటే ఏం చేయాలి? అప్పుడు కొత్త ప్రభుత్వాలు రావాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రణాళికల్ని ప్రజల ముందు పెట్టాల్సిన పనిలేదు’ అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ‘అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నేను సభానాయకుడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాను. జ్యుడీషియల్‌ యాక్టివిజ పేరుతో న్యాయమూర్తులు తమ పరిధి దాటి ఇతర విభాగాలకు చెందిన విధులు నిర్వహించరాదని, కార్యనిర్వాహక, శాసన విధుల్లో చొరబడకుండా స్వీయనియంత్రణ పాటించాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం న్యాయసమ్మతం కాదని 2007లో చంద్రఘోష్‌ తీర్పిచ్చారు. ప్రభుత్వం మారితే దానికి విధాన నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటే.. ఇక ఎన్నికలెందుకు? ఏ ప్రభుత్వ సంస్థ లేదా దాన్ని నిర్వహించే వ్యక్తులైనా పౌర చర్చకు అతీతులు కారని ఎమ్మెల్యేగా, మంత్రిగా.. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వీఆర్‌ కృష్ణయ్యర్‌ స్పష్టంగా చెప్పారు.శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకరి విధినిర్వహణలో మరొకటి జోక్యం చేసుకుని రాజ్యాంగ విధులకు అడ్డుపడుతుంటే.. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ పలచన చేస్తుంటే.. అది పరువు తీసుకోవడమేనని ఆయన చెప్పారు’ అని ధర్మాన వివరించారు.


అమలుల్లో లేని చట్టంపై కోర్టు తీర్పేమిటో: పార్థసారథి

అమల్లో లేని చట్టంపై కోర్టు వ్యాఖ్యానించడమే కాకుండా.. ఇక ముందు కూడా చట్టం చేయకూడదనడం రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మరింతమందితో చర్చించి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో చట్టాన్ని ఉపసంహరించుకున్నాక.. ఇక కోర్టు కేసు లేనట్లేగా? మరి సమస్య ఏముంది? లేని చట్టంపై కోర్టు తీర్పివ్వడం ఎంతవరకు సబబో న్యాయకోవిదులే చెప్పాలన్నారు. శాసనసభ నిర్వహణ, కార్యకలాపాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు.


కోర్టుకెళ్తే సంసారం చేయకుండా స్టే ఇస్తారనుకుంటున్నారు: చెవిరెడ్డి

‘పెళ్లికొడుక్కి అన్నీ అందాయా? లేకుంటే కోర్టులో కేసు వెయ్యి.. కావాలంటే ఆరు వారాలు సంసారం చేయకుండా స్టే ఇస్తారు’ అని ఒక పెళ్లిలో కొందరు మాట్లాడుకోవడం తాను విన్నానని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. కనిపించే దేవుళ్లయిన న్యాయమూర్తులకు ఇలా చులకనయ్యే పరిస్థితి రాకూడదని చెప్పారు. ‘ఏ బెంచ్‌కు ఏ కేసు వెళ్తుందో చెబితే.. తీర్పు ఎలా ఉంటుందో చెప్పగలమని న్యాయవాదులు, ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి రాకూడదని న్యాయమూర్తుల్ని ప్రార్థిస్తున్నా. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపై పెత్తనం చేసి, వారి గౌరవాన్ని తగ్గించడం ద్వారా తాము బలపడాలనే పద్ధతి ప్రజాస్వామ్యయుతం కాదని విజ్ఞప్తి చేస్తున్నా. తమకు ఇష్టమున్న వారిని న్యాయమూర్తులుగా నియమించుకునే కొలీజియం వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధమేనా? చట్టాల రాజ్యాంగబద్ధతపై తీర్పులిచ్చే న్యాయమూర్తుల నియామకం కూడా పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని చెవిరెడ్డి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని