MLC Ananthababu: అరెస్టుపై ఇంత తాత్సారమా?

రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే చాలు వారు ఎక్కడున్నా వెతికి, వెంటాడి మరీ అరెస్టు చేస్తున్న పోలీసులు.. దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన.....

Updated : 24 May 2022 09:59 IST

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు  
నిరసనలు వెల్లువెత్తడంతో 4 రోజుల తర్వాత అదుపులోకి..

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే చాలు వారు ఎక్కడున్నా వెతికి, వెంటాడి మరీ అరెస్టు చేస్తున్న పోలీసులు.. దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనబరిచారు. ప్రతిపక్ష పార్టీలు, దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలతో ఉద్యమిస్తే తప్ప అదుపులోకి తీసుకోలేదు. తమవాడిని ఎమ్మెల్సీ అనంతబాబే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు తొలి నుంచి ఆరోపించినా పోలీసులు పట్టించుకోలేదు. హత్య జరిగిన మర్నాడు ఎమ్మెల్సీ వివాహాలు, శుభకార్యాలకు తిరుగుతున్నా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు రోజుల తర్వాత సోమవారం అరెస్టు చేశారు. అనంతబాబుకు తగినంత సమయం ఇవ్వడానికే అరెస్టు విషయంలో పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.'

ఎమ్మెల్సీ అనంతబాబువద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యం ఈ నెల 19న రాత్రి హత్యకు గురయ్యారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బాధిత కుటుంబ సభ్యుల్ని నమ్మించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించారు. తమవాడిని అనంతబాబే చంపేశారని అదే రోజు మృతుడి భార్య అపర్ణ, తల్లి నూకరత్నం ఆరోపించారు. ఎమ్మెల్సీ చెబుతున్నట్లుగా కాకినాడలోని నాగమల్లితోట కూడలిలో ఈ నెల 19న రాత్రి రోడ్డు ప్రమాదమేమీ జరగలేదని సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ 20న స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే అన్ని వేళ్లూ అనంతబాబు వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాల్సిన పోలీసులు ఆ జోలికే వెళ్లలేదు. ఈ నెల 20న తుని, పిఠాపురంలలో పెళ్లిళ్లు, మరికొన్ని వేడుకలకు అనంతబాబు హాజరైనా.. 21, 22 తేదీల్లోనూ ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నా పోలీసులు అరెస్టు చేయలేదు. మంత్రివర్గంలో అత్యంత సీనియర్‌ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆయనకు వత్తాసు పలికేలా మాట్లాడారు. ‘తప్పు చేయలేదనే ధైర్యంతోనే అనంతబాబు బయట తిరుగుతుండొచ్చు’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఆ వేగం.. ఇక్కడేదీ?

ఏదైనా హత్య జరిగినా, అనుమానాస్పద మృతి చోటుచేసుకున్నా అనుమానితులైన వ్యక్తుల్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. హత్యలో వారి పాత్రపై స్పష్టత వస్తే వెంటనే అరెస్టు చేస్తారు. సుబ్రమణ్యం హత్యపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో సుబ్రమణ్యానిది హత్యేనని స్పష్టత వచ్చినా వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. కాకినాడలోని సర్పవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి వెదురుపాక రాంబాబు (37) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అన్నవరపు లోవరాజు అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమైన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఎమ్మెల్సీ నిందితుడిగా ఉన్న కేసు విషయంలో జాప్యం చేయటానికి రాజకీయ పలుకుబడే కారణమన్న విమర్శలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని