Updated : 29 May 2022 10:09 IST

యుద్ధం 3.10కి మొదలుపెడదాం

వాట్సప్‌ సందేశంతో అమలాపురంలో విధ్వంసకాండ
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి..
మరో 25 మంది అరెస్టు
ఇంటర్నెట్‌పై తొలగని ఆంక్షలు..

ఈనాడు- అమలాపురం, న్యూస్‌టుడే- అమలాపురం పట్టణం, పి.గన్నవరం: ‘కరెక్టుగా 3.10 నిమిషాలకు స్టార్ట్‌ యుద్ధం’.. ‘పోలీసువారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం.. అమలాపురం టౌన్‌లోకి రావడానికి’.. ఇలాంటి సందేశాలు ఈ నెల 24న వాట్సప్‌ గ్రూపుల్లో గంపగుత్తగా వెళ్లాయి. అవే అమలాపురంలో విధ్వంసానికి కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. వీటిని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు శనివారం మీడియా ముందుంచారు. విధ్వంసం కేసులో మరో 25 మందిని అరెస్టుచేశారు. 144 సెక్షన్‌ను మరో 5 రోజులు, 30 పోలీసు యాక్టును నెల రోజులు పొడిగించారు.

వైకాపా శ్రేణులే అధికం

శనివారం అరెస్టు చేసిన 25 మందిలో.. 18 మంది వైకాపా కార్యకర్తలే. ఇద్దరేసి తెదేపా, జనసేన కార్యకర్తలు కాగా, మిగిలినవారు సాధారణ పౌరులు. అరెస్టయిన వారిలో ఆశెట్టి నాగ వీరవెంకట సాయిచంద్ర, కుంచాల ప్రభుదేవ్‌, రాచకొండ శివకుమార్‌, సుందరనీడి సాధు బాబ్జీ, అరిగెల వినయ్‌, అప్పాల నాగరాజ్‌ రంగబాబు, పాల అజయ్‌రెడ్డి, పుదుచ్చూరి బ్రహ్మానందం, ఎల్లమిల్లి ధర్మేంద్రస్వామి, బండారు భాస్కర సత్య రాజేష్‌, పెచ్చెట్టి దుర్గా వెంకట గణేష్‌, పెచ్చెట్టి తులసి దుర్గాప్రసాద్‌, బీమాల దుర్గాసాయి, మట్టపర్తి వెంకటచరణ్‌, గొండర్తి చంద్రమౌళి, శీలం బాల విజయ్‌ కుమార్‌, సంగాడి ఆనందబాబు, పితాని దుర్గాప్రసాద్‌, వాసంశెట్టి వీరవెంకట దుర్గారావు, వాసంశెట్టి తాతాజీ, వాసంశెట్టి జయరామకృష్ణ, గుత్తుల సాయినాగేంద్ర, కొప్పిశెట్టి దుర్గారామ్‌ ప్రసాద్‌, దూనబోయిన గణేష్‌, వాసంశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు.

కొనసాగుతున్న గాలింపు...

విధ్వంసానికి పాల్పడినవారిని గుర్తించి.. అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. డీజీపీ కార్యాలయం నుంచి నిత్యం తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. నాలుగు రోజులుగా నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. పాలిసెట్‌ అభ్యర్థుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చెప్పారు.

ఆస్తులు జప్తు చేస్తాం: డీఐజీ

అమలాపురం విధ్వంసంలో పాల్గొన్న వారిని పలు విధాలుగా గుర్తిస్తున్నామని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు విలేకరులకు తెలిపారు. 20 వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం పంచుకున్నారని, ఎంతమంది.. ఎప్పుడు.. ఎక్కడకు చేరుకోవాలనే సందేశాలూ ఉన్నాయని చెప్పారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లనూ సాంకేతిక ఆధారంగా పరిశీలిస్తున్నామని, అరెస్టు చేసినవారి ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. అమాయకులపై కేసులు పెట్టబోమని, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని