ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలు రూ.20వేల కోట్లు

ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు అమలు చేయాల్సిన వేతన సంఘం సిఫార్సుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాష్ట్రంలో 2018 జులై

Published : 18 Aug 2022 04:23 IST

 సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తే రోడ్డెక్కుతాం

ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు అమలు చేయాల్సిన వేతన సంఘం సిఫార్సుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాష్ట్రంలో 2018 జులై నుంచి ఉద్యోగులకు రూ.20వేల కోట్ల బకాయిలు చెల్లించాలని వివరించారు. కేంద్రం ఈ ఏడాది రెండుసార్లు డీఏ ప్రకటించినా రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తే ఆందోళనలతో రోడ్డెక్కడం ఖాయమన్నారు. బుధవారం విశాఖలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. వేతన సంఘం సిఫార్సుల అమలుపై ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశంలో సీఎం ఇచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదని పేర్కొన్నారు. ప్రతి విషయంలో ముఖ్యమంత్రిని నిందించలేమని, కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు మోకాలడ్డుతున్నారని తెలిపారు. ఆర్థికశాఖలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారన్నారు.

సంక్షేమ పథకాలు ఆపేస్తారా

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని... అంతకంటే ముందు చనిపోయిన ఉద్యోగుల సంగతి కూడా పట్టించుకోవాలన్నారు. ఉద్యోగి కుటుంబంలో సంక్షేమ పథకాలు నిలిపేస్తున్నారని, వారికి ఎంత జీతం వస్తుందో తెలుసుకుని పథకాలను వర్తింపజేస్తే బాగుంటుందని సూచించారు. భూముల రీసర్వే ప్రోగ్రామింగ్‌లోనే లోపాలున్నట్లు గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా చూడాలన్నారు. టీచర్లు సమయ పాలన పాటించాల్సిందేనని అదే సమయంలో యాప్‌ల భారం తొలగించాలన్నారు. కార్యక్రమంలో అమరావతి జేఏసీ కన్వీనర్‌ సత్తి నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు ఈర్ల శ్రీరాంమూర్తి, రమేష్‌, వర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని