‘నైపుణ్యం’ వదిలేశారు!

ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన నైపుణ్య శిక్షణ కళాశాలలు మూడేళ్లయినా అందుబాటులోకి రావడం లేదు. 30 కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేస్తామని తొలుత ప్రకటించి

Published : 25 Sep 2022 05:50 IST

ప్రకటనలకే పరిమితమైన కళాశాలల ఏర్పాటు

నిధుల కొరత నెపంతో 30 బదులు 13 ఏర్పాటుకు నిర్ణయం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన నైపుణ్య శిక్షణ కళాశాలలు మూడేళ్లయినా అందుబాటులోకి రావడం లేదు. 30 కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేస్తామని తొలుత ప్రకటించి నిధుల కొరత పేరుతో కళాశాలలను 13కు కుదించేస్తున్నారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున, పులివెందుల, నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఒక్కోటి చొప్పున 30 ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. తిరుపతిలో నైపుణ్య వర్సిటీకి భూములు కేటాయించినా డీపీఆర్‌ దశలోనే ఉంది. విశాఖపట్నంలో హైఎండ్‌ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల్లో నిలిచింది. నిధుల కొరత సాకుతో కొత్తగా భవనాలు నిర్మించకుండా ఇప్పటికే పాలిటెక్నిక్‌, డిగ్రీ, ట్రిపుల్‌ ఐటీల్లోని ఖాళీ భవనాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25 కళాశాలల ఏర్పాటుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ నమూనాలను రూపొందించి ఆర్భాటంగా టెండర్లు పిలిచింది. గుత్తేదార్ల స్పందన లేక దీన్ని అక్కడితో ఆపేసింది. కేంద్ర సంస్థలు, బ్యాంకు నిధుల సమీకరణలోనూ వెనకబడింది.

కాగితాల్లోనే నైపుణ్యం..
ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమవుతాయని అంచనా. 30 కళాశాలల్లో పులివెందులలో పాడా (పీఏడీఏ) ఆధ్వర్యంలో నిర్మించనుండగా.. మరో రెండింటిని డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ రీసెర్చి సంస్థ నిర్మించనుంది. ట్రిపుల్‌ఐటీల్లో నిర్మించాల్సిన విద్యాలయాలకు ఎవరు నిధులు సమకూర్చాలని స్పష్టత లేదు. తొలుత నిర్ణయించిన మేరకు విద్యాలయాలను నిర్మించేందుకు రూ.600 కోట్లు అవసరం కానున్నాయి. మారిన నిర్ణయం మేరకు 13 చోట్ల నిర్మించేందుకు రూ.4-5 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంది. వీటిని నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధులనుంచే ఖర్చు చేయనున్నారు.

తొలుత ఆర్భాటం
నైపుణ్య విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం మొదట్లో హడావుడి చేసింది. రాజస్థాన్‌, హరియాణా, ఒడిశాల్లోని వర్సిటీలను పరిశీలించేందుకు బృందాలను పంపించింది. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం విద్యాలయాలన్నింటినీ నిర్మిస్తే ఏడాదికి 1,920 మంది విద్యార్థులకు శిక్షణ అందేది. 126 మంది అభ్యర్థులు వసతిగృహంలో ఉండి శిక్షణ పొందేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు వసతి అనేదే లేకుండా ప్రణాళిక రూపొందించారు. కళాశాలల్లో చదువు పూర్తి చేసిన వారికి కాకుండా నిరుద్యోగులు, చదువు మధ్యలో మానేసిన వారికి ఉపాధి కల్పన కోర్సులను మాత్రమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts