సంక్షిప్త వార్తలు(12)

గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,560 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 01 Oct 2022 06:19 IST

వాలంటీర్ల సేవలకు రూ.1,560 కోట్లు
మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,560 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాల్లో, గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లను 2019లో నియమించారు. నెలకు రూ.5 వేలు చొప్పున వీరికి గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,560 కోట్లు వెచ్చిస్తోంది. గౌరవ వేతనంతోపాటు కొద్ది నెలలుగా దినపత్రిక తెప్పించుకునేందుకు నెలకు మరో రూ.200 చొప్పున కూడా కేటాయిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమయ్యాక ఏడాదికోసారి వీరి సేవలను పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో 2022 ఆగస్టు 15తో గడువు ముగియడంతో 2023 ఆగస్టు 14 వరకు మరో ఏడాది పొడిగించారు. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇందూ ఈస్ట్రన్‌పై దివాలా పిటిషన్‌
నోటీసులు జారీ చేసిన ఎన్‌సీఎల్‌టీ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్‌ బోర్డుపై సీబీఐ నమోదుచేసిన కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని హైదరాబాద్‌కు చెందిన కాన్సెప్ట్‌ నిర్మాణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు ఎన్‌వీ బద్రీనాథ్‌, సాంకేతిక సభ్యులు ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ తమకు రూ.61 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఇందూ విఫలమైందన్నారు. ‘హౌసింగ్‌బోర్డుతో ఒప్పందం ప్రకారం బండ్లగూడ, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లిలో గృహనిర్మాణ సముదాయాలన ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఫ్లాట్లు, విల్లాలు అమ్మినా సీబీఐ కేసుతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఇందూతో పాటు హౌసింగ్‌బోర్డుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఇక్కడ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కాన్సెప్ట్‌ నిర్మాణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ వేయడంపై ఫ్లాట్లు కొన్నవారి తరఫు న్యాయవాది  సల్వాజి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై 3 వారాల్లో కౌంటరు వేయాలంటూ ధర్మాసనం ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌కు  నోటీసులిచ్చింది.


గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ముఖఆధారిత హాజరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ శనివారం నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయనున్నారు. ఇక ఉద్యోగులు సంబంధిత యాప్‌ను సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోని హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యాశాఖలో అమలవుతున్న ఈ విధానం వీరికీ అమలు చేస్తున్నారు.


నేటి నుంచి పింఛన్ల చెల్లింపు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా 62.53 లక్షల మందికి శనివారం నుంచి పింఛన్లు చెల్లించేందుకు రూ.1590.50 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. 5వ లోగా నూరుశాతం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.


సమయం కలిసివచ్చేది 5 నుంచి 10 నిమిషాలే

31 రైళ్ల వేగం పెంపు

నేటి నుంచి రైల్వే కొత్త టైంటేబుల్‌

ఈనాడు, హైదరాబాద్‌: రైళ్లలో ప్రయాణ సమయం కలిసి వస్తుందని ఎదురుచూస్తున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. 31 రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొత్త టైంటేబుల్‌ శనివారం (అక్టోబరు 1) నుంచి అమల్లోకి రానుందని శుక్రవారం ప్రకటించింది. టైంటేబుల్‌ను పరిశీలిస్తే సగానికిపైగా రైళ్లలో కలిసొచ్చే ప్రయాణసమయం 5, 10 నిమిషాలే. వేగం పెంచిన ప్రయాణికుల రైళ్ల సంఖ్య 31. ఇందులో అయిదు నిమిషాలు, పది నిమిషాల వరకు ప్రయాణ సమయం తగ్గిన రైళ్లు 16. 11-20 నిమిషాల సమయం తగ్గిన రైళ్లు ఏడు, 21 నిమిషాలు, ఆపై ప్రయాణ సమయం తగ్గినవి ఎనిమిది రైళ్లు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌-సీఎస్‌ఎంటీ ముంబయి రైలు ప్రయాణ సమయం 85 నిమిషాలు తగ్గింది.


పండగ రద్దీ.. తప్పదు కుస్తీ!

దసరా పండగ సెలవుల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వేలాది ప్రయాణికులతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ కిటకిటలాడుతోంది. రిజర్వేషన్‌ లభించని వారు వివిధ రైళ్లలోని సాధారణ బోగీల్లో సీటు సంపాదించేందుకు కుస్తీలు పడుతున్నారు. శుక్రవారం హావ్‌డా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు కిందామీదా పడుతుండగా తీసిన చిత్రమిది.

- ఈనాడు, హైదరాబాద్‌


పాఠశాలల మెరుగు కోసం ‘విద్యాంజలి’

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాల మెరుగుదల కోసం విద్యాంజలి-2.0 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ సూచించారు. ఈ కార్యక్రమం కింద పౌరులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమకు నచ్చిన విభాగంలో స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాలల అవసరాలను విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు.


పదోన్నతులకు సర్వీసు లెక్కింపుపై స్పష్టత

ఈనాడు, అమరావతి: స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2గా, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ఏపీ సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ 33ను పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కొందరు డీఈవోల సందేహాలకు స్పష్టతనిచ్చింది. ఒక సర్వీసు, కేటగిరీ, గ్రేడులో నియామక తేదీ నుంచే ఉద్యోగి సీనియారిటీ నిర్ధారిస్తారు. ఒక సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువమందిని నియమిస్తే వారి ఆర్డర్‌ ప్రిఫరెన్సు నిర్దేశించాలి. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీల సీనియారిటీ జాబితాను అక్టోబరు 20లోపు రూపొందించాలని, ఈ జాబితాను 30లోపు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు అందించాలని పేర్కొంది.


మైనార్టీల సంక్షేమ విభాగం సలహాదారు హబీబుల్లాకి కేబినెట్‌ హోదా

రాష్ట్ర మైనార్టీల సంక్షేమ విభాగం సలహాదారు డి.ఎస్‌.హబీబుల్లాకి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హబీబుల్లాను మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారుగా ఈ ఏడాది ఆగస్టు 29న ప్రభుత్వం నియమించింది. ఆయనకు జీతభత్యాలు మాత్రం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ‘ఆర్‌’ కేటగిరీలో ఉన్నవారికి ఇచ్చేవే వర్తిస్తాయని స్పష్టం చేసింది.


ప్రమాదకర రసాయనాల నిల్వ వివరాలు వెల్లడించాలి
అగ్నిమాపక శాఖ నోటిఫికేషన్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విషపూరిత, ప్రమాదకర, పేలుడు స్వభావం కలిగిన రసాయనాలు నిల్వ, ప్రాసెస్‌ చేసే కర్మాగారాలు, పరిశ్రమలు, వ్యక్తులు, సంస్థలు, పోర్టు అథారిటీలన్నీ ఆ సమాచారాన్ని తప్పనిసరిగా బయటపెట్టాలని అగ్నిమాపక శాఖ పేర్కొంది. మూణ్నెల్లకోసారి ఈ వివరాలన్నింటిని స్థానిక అగ్నిమాపక కేంద్రంలో నేరుగానూ, ఎలక్ట్రానిక్‌ రూపంలోనూ సమర్పించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ సంబంధిత విభాగాధిపతులతో జిల్లా భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని, ఏడాదికి ఒక్కసారైనా ఈ కమిటీ సమావేశాలు జరపాలని వివరించింది. పరిశ్రమల్లో జరుగుతున్న వివిధ రకాల ప్రమాదాల నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫార్మా పరిశ్రమలు తగిన అగ్నిమాపక పరికరాలతో పాటు అత్యవసర సమయంలో తరలింపు, విపత్తు నిర్వహణకు ప్రణాళికలు కలిగి ఉంటేనే వాటికి నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


లిడ్‌ క్యాప్‌ను మాదిగ కార్పొరేషన్‌లో విలీనం చేయాలి
దళిత్‌ ఇండస్ట్రీయల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తోళ్ల పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌ క్యాప్‌)ను మాదిగ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని దళిత్‌ ఇండస్ట్రీయల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం లిడ్‌ క్యాప్‌ ఏ శాఖలో ఉందో,  ఉద్యోగుల కార్యకలాపాలేంటో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ గత ప్రభుత్వం లిడ్‌క్యాప్‌ను పరిశ్రమల శాఖ నుంచి సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని తెచ్చింది. లిడ్‌ క్యాప్‌ ద్వారా తోళ్ల ఉత్పత్తుల సరఫరా టెండర్లు, పరిశ్రమలు, డప్పు కళాకారుల పింఛనులు మాదిగలకు అందేలా బోర్టు నిబంధనలు మార్చాలని ఆదేశించింది. మూడున్నరేళ్లు దాటినా ఆ నిబంధనలు మార్చలేదు. దీంతో ఆర్థిక ప్రయోజనాలు అగ్రకులాల వారికే అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన భూములు కబ్జాకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జునకు కనీస సమాచారం లేకుండా లిడ్‌ క్యాప్‌ను పరిశ్రమల శాఖలో కలపాలని అధికారులు ప్రతిపాదనలు పంపడం దారుణం...’’ అని  మామిడి సుదర్శన్‌ పేర్కొన్నారు.


ఉద్యోగాలకు వయోపరిమితి గడువు మరో ఏడాది పెంపు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ శాఖల్లోని నాన్‌-యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి గడువు పెంపును మరో ఏడాది పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచిన వయో పరిమితి గడువు శుక్రవారం (30.09.2022)తో ముగిసింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని