మొర వినుమా.. గోవిందా!

రాష్ట్ర భవిష్యత్తు కోసం సిరులు పండే పొలాలను అప్పగించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అపూర్వ స్పందన లభించింది.

Published : 01 Oct 2022 03:23 IST

ద్వారకా తిరుమలలో కోలాహలంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- ద్వారకా తిరుమల, కామవరపుకోట: రాష్ట్ర భవిష్యత్తు కోసం సిరులు పండే పొలాలను అప్పగించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అపూర్వ స్పందన లభించింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న నినాదం మిన్నంటింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 19వ రోజు దెందులూరు మండలం పెరుగుగూడెంలో శుక్రవారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమైంది. యాత్రకు వచ్చిన జనంతో మెట్టపంగిడిగూడెం, పంగిడి, గొల్లగూడెం, ద్వారకాతిరుమల వరకు రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. పెరుగుగూడెం నుంచి యాత్ర మెట్టపంగిడిగూడెం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాలవారంతా భారీగా చేరుకున్నారు. రైతులు వస్తున్న మార్గంలో ముందుగానే పూలు చల్లారు. ప్రతి గ్రామంలో మహిళలు ఎదురొచ్చి గుమ్మడి, కొబ్బరికాయలతో రైతులకు దిష్టి తీశారు. స్థానికులు చుట్టుపక్కలున్న భవనాలపైకి ఎక్కి పూలవర్షం కురిపించారు.

పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటుచేసి ప్రదర్శనగా పాదయాత్రలో కలిశారు. పరిసర ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లతో పసుపునీరు తెచ్చి పంగిడి నుంచి ద్వారకాతిరుమల చేరేవరకు దారి పొడవునా పోస్తూ స్వాగతం పలికారు.

గుంతల దారుల్లో... గోవిందుడి స్మరణతో
మెట్టపంగిడిగూడెం ప్రారంభం నుంచి రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గురువారం కురిసిన వర్షానికి చెరువులను తలపించాయి. ప్రజలకు అవసరమైన రహదారులు నిర్మించలేని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా ఏర్పాటుచేస్తుందని రైతులు ధ్వజమెత్తారు. ఛిద్రమైన దారుల్లో నడుస్తూ.. ముందుకు సాగారు. ద్వారకా తిరుమల ప్రవేశద్వారం వద్ద రైతులంతా కలిసి మోకాళ్లపై నిల్చొని సాష్టాంగ నమస్కారాలు చేశారు. పాదయాత్రకు సంఘీభావంగా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కాకతీయ సేవాసమితి వారు రూ.లక్ష విరాళం ప్రకటించారు. జగ్గయ్యపేట నుంచి రెండు బస్సుల్లో మహిళా రైతులు వచ్చారు. ద్వారకా తిరుమల మండలం మారంపల్లికి చెందిన మహిళా కోలాట బృందం గొల్లగూడెం నుంచి కోలాటమాడుతూ యాత్రలో పాల్గొంది. దళిత ఐకాస, దళిత బహుజన ఐకాస నాయకులు మద్దతు పలికారు. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌, తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు యాత్రలో పాలొన్నారు..


19వ రోజు యాత్ర ఇలా..

* ప్రారంభం: దెందులూరు మండలం పెరుగుగూడెం
* ముగింపు: ద్వారకా తిరుమల
* నడిచిన దూరం: 15 కిలోమీటర్లు


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts