సంక్షిప్త వార్తలు (9)

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర భవన నిర్మాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సిమెంట్‌ వినియోగంపై నిఘా-అమలు విభాగం (విజిలెన్స్‌) విచారణ చేస్తోంది.

Updated : 07 Oct 2022 05:46 IST

సిమెంట్‌ దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ
భవన నిర్మాణాలకు  ఇచ్చిన నిల్వలు పక్కదారి

ఈనాడు-అమరావతి: గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర భవన నిర్మాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సిమెంట్‌ వినియోగంపై నిఘా-అమలు విభాగం (విజిలెన్స్‌) విచారణ చేస్తోంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్‌ పక్కదారి పట్టిందన్న ఫిర్యాదులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చిన ప్రాథమిక సమాచారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అధికారులు విచారణ చేశారు.  అన్ని జిల్లాల్లోనూ విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందనుంది.


రెవెన్యూలోటు కింద ఏపీకి రూ.879 కోట్లు

ఈనాడు, దిల్లీ: రెవెన్యూలోటు భర్తీ గ్రాంట్‌ ఏడో విడత కింద కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రూ.879.08 కోట్లు విడుదల చేసింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,153.58 కోట్లు విడుదల చేసినట్లయింది. 15వ ఆర్థికసంఘం ఈ ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలకు కలిపి రూ.86,201 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఆరు విడతల్లో రూ.50,282.92 కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ 7వ విడత కింద రూ.7,183.42 కోట్లు ఇచ్చింది. ఇందులో ఏపీకి రూ.879.08 కోట్లు దక్కింది.


తిరుగు ప్రయాణాలకు 2,400 బస్సులు

ఈనాడు, అమరావతి: దసరా పండుగ, సెలవులకు సొంతూళ్లకు వచ్చినవారి తిరుగు ప్రయాణాలకు వీలుగా ఏపీఎస్‌ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 10 వరకు వీటిని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య నడిపేలా సన్నాహాలు చేసింది.  


తెలుగుయువత గుంటూరు జిల్లా అధ్యక్షుడిపై సీఐడీ కేసు?

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే అభియోగంపై పలువురి మీద కేసు పెట్టారు. ఇందులో రావిపాటి సాయికృష్ణను ఏ2గా పేర్కొన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 163 ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్సింగ్‌ అధికారాలను (డీడీవో) బదలాయించేందుకు ట్రెజరీ డైరెక్టర్‌ గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఉత్తర్వుల వల్ల జీతాలు, సెలవుల మంజూరు అధికారాలు ఇకనుంచి ప్రిన్సిపాళ్లకు ఉంటాయి.


‘ఉత్తీర్ణత మినహాయింపుతో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి’

ఈనాడు-అమరావతి: సర్వే ట్రైనింగ్‌లో ఉత్తీర్ణత నుంచి మినహాయింపునిస్తూ గ్రేడ్‌-2 వీఆర్వోలకు ప్రొబేషన్‌ పీరియడ్‌ను ప్రకటించాలని ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌కు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌కు గురువారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ప్రొబేషన్‌ ప్రకటనలో ఆలస్యం జరిగితే వీఆర్వోలు సీనియారిటీ తదితర విషయాల్లో తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేసింది. పని ఒత్తిడి తగ్గించేలా వీఆర్వోల జాబ్‌చార్టులో మార్పులు చేయాలని కోరింది.


నేడు పోలవరంపై సాంకేతిక కమిటీల సమావేశం
నాలుగు రాష్ట్రాలతో దిల్లీలో భేటీకానున్న సీడబ్ల్యూసీ  

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరంపై శుక్రవారం దిల్లీలో నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల సంఘం సమావేశం కానుంది. గత నెల 29న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సాంకేతిక కమిటీలు పాల్గొననున్నాయి.  తెలంగాణ నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ నేతృత్వంలో ఓ అండ్‌ ఎం ఈఎన్‌సీ నాగేందర్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, అంతరాష్ట్ర జల వనరుల విభాగం ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్‌, తదితరులు పాల్గొంటున్నారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి నేతృత్వంలో పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నర్సింహమూర్తి, తదితరులు హాజరవుతున్నారు.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా సిద్ధం!

ఈనాడు, అమరావతి: 376 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గత ఆగస్టు నెలలో జారీచేసిన నోటిఫికేషన్‌ అనుసరించి ఎంపికచేసిన అభ్యర్థుల జాబితా విడుదలకు సిద్ధమైంది. ఎంపికచేసిన వారికి శనివారం నుంచి పోస్టింగ్‌ కోసం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఇన్‌ఛార్జి డీఎంఈ వినోద్‌ తెలిపారు.


శాప్‌లోనూ కారుణ్య నియామకాలకు అనుమతి

ఈనాడు-అమరావతి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో మొదటిసారి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ రాజపత్రం వెలువడింది. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా శాప్‌లోనూ విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని