4 గంటలపాటు న్యాయవాదుల ఎదురుచూపు

తెదేపా నేత చింతకాయల విజయ్‌ తరఫున న్యాయవాదులు గురువారం సీఐడీ కార్యాలయానికి వచ్చినపుడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Published : 07 Oct 2022 02:45 IST

విజయ్‌ తరఫున సీఐడీ ఆఫీసుకు రాక

ఈనాడు, అమరావతి: తెదేపా నేత చింతకాయల విజయ్‌ తరఫున న్యాయవాదులు గురువారం సీఐడీ కార్యాలయానికి వచ్చినపుడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నోటీసు ఇచ్చినందున విజయ్‌ వస్తారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ విజయ్‌ తరఫున ఆయన న్యాయవాదులు కోటేశ్వరరావు, హరిబాబు వచ్చారు. అదే ప్రాంగణంలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లి అడిషనల్‌ డీజీ, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ను ఉద్దేశించి విజయ్‌ రాసిన లేఖను ఇవ్వాలని ప్రయత్నించారు. వారిని సందర్శకుల గదిలో కూర్చోబెట్టారే తప్ప ఆ లేఖ తీసుకోలేదు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పందన లేదని, అధికారుల ఫోన్‌కు మెసేజ్‌ పెట్టినా సమాధానం లేదని న్యాయవాదులు తెలిపారు. ఎప్పటికీ పిలుపు రాకపోవడంతో అక్కడి తపాలా విభాగంలో లేఖ ఇచ్చి వెనుదిరిగామని వివరించారు. ‘సీఐడీ పోలీసులు విజయ్‌కు ఇచ్చిన 41-ఏ నోటీసు చెల్లదు. విజయ్‌కు లేదా ఆయన కుటుంబ సభ్యులకు కాకుండా పని మనుషులకు ఇస్తే చెల్లదు. కేసుకు సంబంధించిన వివరాలేవీ నోటీసులో ప్రస్తావించలేదు. భయపెట్టేందుకే ఇచ్చినట్లు కనిపిస్తోంది’ అని న్యాయవాది కోటేశ్వరరావు అన్నారు. తాము నాలుగు గంటలపాటు వేచి చూసినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపారు.

కేసుల వివరాలు చెప్పాలన్న విజయ్‌

తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ, తనను నిందితుడిగా చేర్చిన ఇతర క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చింతకాయల విజయ్‌ సీఐడీ అడిషనల్‌ డీజీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘నా నివాసంలోకి సీఐడీ పోలీసులు అక్రమంగా చొరబడ్డారు. ఆ సమయంలో నా భార్య ఆసుపత్రిలో ఉండగా.. పిల్లలు, వారి సంరక్షకురాలు, డ్రైవర్‌ ఉన్నారు. డ్రైవర్‌ను కొట్టి నేను ఎక్కడున్నానో చెప్పాలని భయపెట్టారు. తలుపులు, కిటికీలను బలవంతంగా తెరిచి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. వంట గదిలోకీ వెళ్లారు. పిల్లలు భీతిల్లే వాతావరణం సృష్టించారు. నేను ఎక్కడున్నానో చెప్పాలంటూ నా కుమార్తెపై తీవ్రమైన ఒత్తిడి చేశారు’ అని విజయ్‌ పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts