అరకొరగానే ప్రత్యేక నిపుణుల సేవలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరిలో కొందరు రోగులను చూసేందుకు పీహెచ్‌సీలకు రాకున్నా వచ్చినట్లుగా రికార్డుల్లో సంతకాలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Published : 08 Oct 2022 02:32 IST

పీహెచ్‌సీలకు రాకున్నా.. రికార్డుల్లో సంతకాలు!

ఒకటి, రెండు గంటల్లో నిష్క్రమణ

ఈనాడు, అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరిలో కొందరు రోగులను చూసేందుకు పీహెచ్‌సీలకు రాకున్నా వచ్చినట్లుగా రికార్డుల్లో సంతకాలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ విధులకు హాజరైనా ఒకటి, రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉండడంలేదనే మాట వినిపిస్తోంది. కొందరి పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖకు కూడా ఫిర్యాదులు అందాయి.

నెలకు రూ.1.10 లక్షల వేతనం!
జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు కూడా ఉన్నత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కిందటేడాది నుంచి నియామకాలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పీహెచ్‌సీల్లో నిపుణులైన వైద్యుల సేవలు అందించేందుకు 1,200 మంది అవసరం అవుతారని అంచనా వేశారు. తొలి విడత కింద ఒప్పంద విధానంలో రాష్ట్రంలో సుమారు 325 మందిని నియమించారు. వీరిలో కొద్దిమంది మినహా మిగిలిన వారంతా ప్రస్తుతం విధుల్లోనే ఉన్నారు. నియామకాలకు అనుగుణంగా జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థో, గైనిక్‌, డెర్మటాలజీ, దంతవైద్య నిపుణులు నిర్దేశించిన రోజుల్లో వారికి కేటాయించిన పీహెచ్‌సీలకు వెళ్లి రోగులకు చికిత్స అందించాలి. వీరికి నెలకు రూ.1,10,000 వేతనంగా ఇస్తున్నారు. అయితే ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వీరి పనితీరు పరిశీలించినప్పుడు..చాలా మంది సేవలు కాగితాలకే పరిమితమవుతున్నాయని తెలిసింది.

ఎవరికీ తెలియదు!
పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు కూడా నిపుణుల రాక గురించి తెలియడంలేదు. వచ్చిన వారు కూడా ఒకటి రెండు గంటలకు మించి ఉండటం లేదని చెబుతున్నారు. ఒకసారి రోగిన చూసిన తర్వాత మరోసారి ఆ రోగి స్పెషలిస్టు వైద్యుల వద్దకు వస్తున్నారా? లేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అలాగే ఈ వైద్యులపై పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల్లో భాగంగా మలివిడత నియామకాలు చేపట్టకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ విధానాన్ని ఎలా పటిష్ఠం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని