Super star Krishna: బుర్రిపాలెం బుల్లోడు

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated : 16 Nov 2022 07:35 IST

కృష్ణకు స్వగ్రామంతో విడదీయరాని అనుబంధం
గుంటూరు పరిసరాల్లో పలు చిత్రాల షూటింగ్‌ 

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తెనాలి: సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. రైతు కుటుంబానికి చెందిన ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు. కృష్ణ బుర్రిపాలెంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా ఉన్నత పాఠశాల్లో 1956లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులయ్యారు. బుర్రిపాలెం నుంచి తెనాలికి రోజూ 4 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వచ్చి చదువుకున్నారు. కృష్ణను ఇంజినీరు చేయాలని తండ్రి వీర రాఘవయ్య భావించారు. గుంటూరులో ఇంటర్‌ ఎంపీసీలో సీటు దొరక్కపోవడంతో ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. తెనాలి మండలం కంచర్లపాలేనికి చెందిన సమీప బంధువు ఇందిరాదేవిని 1965 నవంబరు 1న వివాహం చేసుకున్నారు.

ఊరంటే అభిమానం

బుర్రిపాలెం వారంటే కృష్ణ ఎంతో అభిమానంగా ఉండేవారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. ఆయన సహకారంతో హైదరాబాద్‌లో ఈ గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు స్థిరపడ్డాయని తెలిపారు. శాఖమూరి మల్లికార్జునరావు, శాఖమూరి సూరిబాబు నిర్మాతలుగా ఎదిగారు. కృష్ణ స్వగ్రామంపై మక్కువతో పలు చిత్రాలను ఇక్కడ తీశారు. ఈ ఊళ్లో ఇప్పటికీ ఆయనకు ఇల్లు ఉంది. సొంత గ్రామానికి చివరిసారిగా 2015 డిసెంబరులో తన సోదరుడి ఇంట వివాహ వేడుకకు వచ్చారు. సొంతూరు అభివృద్ధికి కృషి చేశారు. తల్లి పేరిట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మాణానికి సహకారం అందించారు. గ్రామంలో గీతా మందిరం నిర్మించారు. తండ్రి స్ఫూర్తితో ఆయన తనయుడు మహేష్‌ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

గుంటూరుతో అనుబంధం

సినిమాల చిత్రీకరణ, విజయోత్సవాల కోసం గుంటూరు పరిసర ప్రాంతాలకు సతీమణి విజయ నిర్మలతో కలిసి వచ్చేవారు. అభిమానుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసిపోయేవారు. 2003లో గుంటూరుకు చెందిన ఆయన అభిమాని మొహమ్మద్‌ పర్వేజ్‌ ఇంటికి వచ్చి వెళ్లారు. ఇలా గుంటూరు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు.


పక్కా ప్రణాళికతో పని చేసేవారు

కృష్ణ పని విషయంలో పక్కాగా ఉండేవారు. ‘పాడిపంటలు’ సినిమా కోసం రెండు ఒంగోలు జాతి ఎడ్లు కావాలని అడిగారు. మిగిలిన ఎడ్ల కంటే విభిన్నంగా ఉండాలనడంతో వాటి కోసం మేము చాలాచోట్ల తిరిగి సంపాదించాం. ఆ సినిమా షూటింగ్‌ కృష్ణా, గోదావరి జిల్లాల్లో జరిగితే ఊరి వాళ్లం అక్కడకు వెళ్లి ఆయనతోనే కొద్ది రోజులు ఉన్నాం.

- శాఖమూరి పాండురంగారావు, బుర్రిపాలెం, కృష్ణ స్నేహితుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని