ప్రభుత్వం ప్రకటించిన ధర అమలెక్కడ?

‘రొయ్యల రైతులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడంలేదు. వంద కౌంట్‌ రొయ్యలకు కిలో రూ.210 ఇప్పిస్తామన్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు.

Published : 26 Nov 2022 04:41 IST

విద్యుత్తు రాయితీపై సీఎం హామీదీ అదే గతి
ఆక్వా సదస్సులో గళమెత్తిన రైతులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ‘రొయ్యల రైతులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడంలేదు. వంద కౌంట్‌ రొయ్యలకు కిలో రూ.210 ఇప్పిస్తామన్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ట్రేడర్లు రూ.160 నుంచి 180 మాత్రమే చెల్లిస్తున్నారు’ అని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఒంగోలులో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రొయ్యల రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, ట్రేడర్లు, ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తొలుత రైతు నాయకుడు దుగ్గినేని గోపినాథ్‌ మాట్లాడుతూ శీతల గిడ్డంగులు నిండిపోయాయని, ఎగుమతుల ఆర్డర్లు లేవని కిలోకు రూ.170 మించి ఇవ్వట్లేదన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ కొవిడ్‌ వల్ల అమెరికా, చైనా తదితర దేశాల్లో పెట్టిన నిబంధనలు, అక్కడి గిడ్డంగుల్లో ఉన్న భారీనిల్వల వల్ల రాష్ట్రం నుంచి రొయ్యల ఎగుమతులు మందగించాయన్నారు. ఈ సమస్య జనవరి ఆఖరుకు తీరిపోతుందని.. రైతులు సాగుకు ఫిబ్రవరి వరకు ఆగడం మేలన్నారు. పంట విరామం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అప్సడా ఉపాధ్యక్షుడు రఘురామ్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి సాధికార కమిటీ ఏర్పాటుచేశారన్నారు. కౌంట్‌వారీ ధరలు నిర్ణయించినా.. ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎగుమతిదారులంతా ఒప్పుకొని ఇప్పుడు ఎవరూ కొనకపోవడం దగా చేయడమేనన్నారు. రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కి ఇచ్చే అంశంపై కసరత్తు జరుగుతోందని, త్వరలో సీఎం శుభవార్త చెబుతారన్నారు.

మడం తిప్పనని చెప్పి ఏం చేశారు?

నెల్లూరు జిల్లా చిల్లుకూరు మండలానికి చెందిన రైతు వెంకురెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి తుంగలో తొక్కారన్నారు. మడం తిప్పను, మాట తప్పనని చెప్పి ఏం చేశారన్నారు? యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ల పేరుతో మోసగిస్తున్నారన్నారు. గూడూరుకు చెందిన బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి కమీషన్లు తీసుకుంటున్నట్లు చాలామంది రైతులు చర్చించుకుంటున్నారని.. అందుకే దాణా ధర పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. మరో రైతు ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రొయ్య విత్తనం, విద్యుత్తు, మేత, మందుల ధరల్లో దోపిడీ జరుగుతోందన్నారు. ధరల అమలుకు కమిటీని ఏర్పాటుచేయాలని కృష్ణా జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు కుమారరాజు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం 15 రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళన చేపడదామని దుగ్గినేని గోపీనాథ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని