Andhra News: కర్నూలులో హైకోర్టా? వేరే ఏదైనానా?: మంత్రి కొట్టు సత్యనారాయణ

కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూనే అక్కడ ఏర్పాటు చేయబోయేది హైకోర్టా? వేరే ఏదైనానా? అనేది ఆలోచించాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated : 30 Nov 2022 09:45 IST

ఏం చేయాలనేది ఆలోచించాలి
సుప్రీంకోర్టులో న్యాయవాది చెప్పింది అంతిమ నిర్ణయం ఎలా అవుతుంది?

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూనే అక్కడ ఏర్పాటు చేయబోయేది హైకోర్టా? వేరే ఏదైనానా? అనేది ఆలోచించాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పారు కదా?’ అని మంగళవారం సచివాలయంలో మంత్రిని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన మంత్రి ‘కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు సందర్భానుసారం న్యాయవాది అలా చెప్పి ఉండొచ్చు. కానీ.. ప్రభుత్వ విధానమనేది ఒకటి ఉంటుంది. అది కోర్టులో చెప్పరు కదా? వాదనలు జరుగుతున్నప్పుడు న్యాయవాది ఏదో మాట్లాడిన దాన్ని చివరి నిర్ణయంగా తీసుకోలేం కదా?’ అని చెప్పుకొచ్చారు. మరి న్యాయవాది సుప్రీంకోర్టులో తప్పు చెప్పారంటారా? అని అడిగితే ‘కర్నూలులో హైకోర్టు పెట్టిన తర్వాత అమరావతిలో హైకోర్టు బెంచో.. ఇంకోటో కొనసాగిస్తారనే ఆలోచనతో న్యాయవాది అలా చెప్పి ఉండొచ్చని ఎందుకు అనుకోకూడదు?’ అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో 1400 ఆలయాలు నిర్మిస్తాం

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రాతిపదికగా బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నచోట్ల 1,400 ఆలయాలను నిర్మించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘1,400 ఆలయాల్లో సుమారు 1,060 దేవాదాయశాఖ నిర్మించనుండగా.. 330కి పైగా సమరసత ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్మాణం చేపడతాం. ఇందులో గుత్తేదారు ఎవరూ ఉండరు. రూ.10 లక్షల్లో రూ.8 లక్షలు ఆలయ నిర్మాణానికి, రూ.2 లక్షలు విగ్రహాల తయారీకి వినియోగిస్తాం. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లయితే దేవతామూర్తుల విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉచితంగా అందిస్తుంది. మిగతా విగ్రహాలనూ 25% రాయితీతో తితిదేనే సమకూరుస్తుంది. ఆలయ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఈఈ స్థాయి అధికారులను ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తాం. దేవాదాయశాఖ ఇచ్చే రూ.10 లక్షలకు అదనంగా మరికొంత ఎక్కువగా జమ చేసి ఆలయాన్ని నిర్మించుకునేందుకు గ్రామ పెద్దలు ముందుకువస్తే నిర్మాణ బాధ్యతల్ని వారికే అప్పగిస్తాం. అయితే వారు ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్‌ ప్రకారమే ఆలయాల్ని నిర్మించాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మించే ఆలయాల్లో అర్చకుల్ని నియమించుకునే అధికారం గ్రామస్థులదే’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని