వడ్డీ రాయితీ పెద్ద సున్నా!

2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4% సున్నా వడ్డీ లెక్కిస్తే రూ.11,595 కోట్లు కట్టాలి.

Published : 01 Dec 2022 05:14 IST

పంట రుణాలపై ‘సున్నా వడ్డీ’ 20% మందికే
ఏటా రూ.3వేల కోట్లు చెల్లిస్తామన్న సీఎం.. 2020-21లో ఇచ్చింది రూ.158 కోట్లే
2019-20లో రూ.418 కోట్లు విడుదల
ఈనాడు - అమరావతి

2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4% సున్నా వడ్డీ లెక్కిస్తే రూ.11,595 కోట్లు కట్టాలి. అదే విధంగా 2019-20 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో భూమిపై తీసుకున్న రూ.1,46,261 కోట్ల పంట రుణాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ 4% లెక్కిస్తే.. రూ.5,850 కోట్లు చెల్లించాలి. కానీ.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.1,834.55 కోట్లే. ఇందులో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుగా రూ.1,180 కోట్లని పేర్కొన్నారు. అంటే.. 2021 ఖరీఫ్‌ వరకు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీ కేవలం రూ.654 కోట్లే.

2019 జులై 12న అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన లెక్కలు


రైతుల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ అనే కొత్త పథకం తెచ్చాం. గతంలో ఇదెప్పుడూ లేదు. సున్నా వడ్డీకి రుణాలివ్వాలని ఆలోచన చేసిన నాథుడే లేరు. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే.. ఆ రుణాలపై ఎలాంటి వడ్డీ కట్టాల్సిన పనిలేదు.

2019 జులై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం జగన్‌


వాస్తవం ఇదీ..

నిజానికి సున్నా వడ్డీ కొత్త పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలున్నాయి. వైకాపా వచ్చాక ‘పావలా వడ్డీ’కి మంగళం పాడింది.


పంట రుణాలపై సున్నా వడ్డీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా 80% మందికి ఆ ఫలాలు దక్కడం లేదు. రాష్ట్రంలో ఏటా భూమిపై పంట రుణాలు తీసుకునే రైతులు 52 లక్షలకు పైగా ఉంటున్నా.. వారిలో 10 లక్షల మంది కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. లోపం ఎక్కడ?, ఎందుకు అధిక శాతం రైతులు అర్హత సాధించలేకపోతున్నారనే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న పంట రుణాలపై గతంలో ‘పావలా వడ్డీ’ పథకమైనా వర్తించేది. వైకాపా ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. పైగా సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని 2019 జులైలో సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పారు. ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు. గణాంకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 85.14 లక్షలు. వారిలో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారు 69%. అయిదెకరాల్లోపు రైతులు 75.5 లక్షలు. సున్నా వడ్డీ అర్హుల సంఖ్య 2020-21 సంవత్సరంలో 10 లక్షలు కూడా లేదు. మూడేళ్లుగా పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, రైతుల పరిస్థితి బాగుందని చెబుతున్న ప్రభుత్వం ఎక్కువ మందికి సున్నా వడ్డీ ఎందుకు వర్తించడం లేదనే అంశంపై దృష్టి సారించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు అర్హతను పదేళ్ల కిందట ప్రకటించిన విధంగా రూ.లక్ష వరకే కొనసాగిస్తున్నారు. పథకంతో అధిక శాతం మందికి ప్రయోజనం పొందాలంటే రూ.2 లక్షల రుణం వరకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

వడ్డీ వసూళ్లు ఇలా..

పంటరుణంపై అసలు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ 9%. ఇందులో ఏడాదిలోగా రుణం చెల్లిస్తే కేంద్రం 5% రాయితీ. రైతుల వాటా 4%. ప్రభుత్వాలు రాయితీ ప్రకటిస్తే ఈ 4 శాతం తగ్గుతుంది.

గతంలో ఇలా..

గతంలో రూ.లక్ష వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే ‘వడ్డీ లేని రుణాలు (వీఎల్‌ఆర్‌)’ పథకం కింద రైతు కట్టాల్సిన 4% వడ్డీని బ్యాంకర్లు మినహాయించేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేవారు.

* రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే అందులో ‘పావలా వడ్డీ’ కింద 1% వడ్డీని ప్రభుత్వం ఇచ్చేది. 3% రైతులు చెల్లించేవారు.

2019 నుంచి ఇలా..

వీఎల్‌ఆర్‌నే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకంగా అమలు చేస్తోంది. రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు వర్తింపజేస్తోంది. అదీ.. ఏడాదిలోపు వడ్డీతో సహా చెల్లించిన రైతుల పేర్లను బ్యాంకర్ల నుంచి తీసుకుని ఆ తర్వాత వారి ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ జమ చేస్తోంది. కానీ.. అధిక శాతం మంది రైతులు తమకు సున్నా వడ్డీ జమ కావడం లేదనే చెబుతున్నారు.

* వైకాపా ప్రభుత్వం ‘పావలా వడ్డీ’ ఎత్తేసింది. దీంతో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల పంటరుణం తీసుకొని ఏటా చెల్లించే వారికి వడ్డీల భారం తప్పడం లేదు.

వడ్డీ రాయితీ అడ్డంకులెన్నో..!

* ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోకపోవడం.

* ఈ-క్రాప్‌లో నమోదైన పంటకు కాకుండా.. వేరే పంటకు రుణం తీసుకున్నా రాయితీ రావడం లేదు.

* రూ.లక్షపైన రుణం తీసుకున్నా వడ్డీ ఇవ్వరు.

* మూడున్నర ఎకరాల వరి, వేరుసెనగ వేసిన రైతులు రూ.లక్షపైగా రుణం తీసుకున్నా.. సున్నా వడ్డీ లభించడం లేదు.

* బ్యాంకులు ప్రభుత్వాలకు సమయానికి రైతుల పేర్లు పంపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు