యూటీఎఫ్‌ నాయకుల ధర్నా భగ్నం

పీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ, ఆర్జిత సెలవుల బకాయిలు చెల్లించాలని ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 01 Dec 2022 04:29 IST

ఈనాడు, అమరావతి - విజయవాడ (అలంకార్‌ కూడలి, అజిత్‌సింగ్‌ నగర్‌), న్యూస్‌టుడే: పీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ, ఆర్జిత సెలవుల బకాయిలు చెల్లించాలని ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో బుధవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని నిర్ణయించారు. ధర్నా చౌక్‌లో టెంటు వేశారు. కొంత మంది ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి టెంటు తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కె.ఎస్‌.లక్ష్మణరావులనూ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. అరెస్టులు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరకు విజయవాడ నగర పోలీసులు ధర్నాకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. బుధవారం ఉదయం నిరాకరించారని ఆరోపించారు. విజయవాడలో 250 మందికిపైగా నాయకులు, ఉపాధ్యాయులను అరెస్టు చేసి నగరంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు.

అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన జాగరణ: అరెస్టులను నిరసిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ‘నిరసన జాగరణ’ నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లోని యూటీఎఫ్‌ కార్యాలయాలు, కూడళ్ల వద్ద సాయంత్రం 6నుంచి రాత్రి 12గంటల వరకు నిరసనలు చేపట్టారు.

మంత్రిగా కొనసాగే అర్హత బొత్సకు లేదు

మంత్రిగా కొనసాగే అర్హత బొత్స సత్యనారాయణకు లేదని ఐ.వెంకటేశ్వరరావు, కె.ఎస్‌.లక్ష్మణరావు విమర్శించారు. అరెస్టయిన అనంతరం పోలీసు స్టేషన్ల వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని బకాయిలు కలిపి సుమారు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బును.. తిరిగి వారికి ఇవ్వని ఏకైక దుర్మార్గ ప్రభుత్వం వైకాపాదేనన్నారు. అరెస్టయిన నాయకులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు, వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. అరెస్టయిన వారిలో యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నక్కా వెంకటేశ్వరరావు, ప్రసాద్‌, నాయకులు ఉన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని