ప్రజారోగ్యమే మాకు ముఖ్యం

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు కొత్తగా వచ్చే పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడట్లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Updated : 04 Dec 2022 08:28 IST

కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహించం
వేధింపులుంటే హెరిటేజ్‌ను ఎలా నడుపుతారు
రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు కొత్తగా వచ్చే పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడట్లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమరరాజా సంస్థ యాజమాన్యం, ఆ సంస్థ ఉద్యోగులు తాము ప్రభుత్వ వేధింపుల కారణంగా వెళ్లిపోతున్నామని ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఆ పరిశ్రమ యథాతథంగా కొనసాగుతుందన్నారు. ‘పొరుగు రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెడతామని సదరు సంస్థ చెబితే ఇప్పుడే పెట్టేసినట్లు రాయడం దారుణం. కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహించం. ప్రజారోగ్యానికి మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 2010లో అప్పటి ప్రభుత్వం 483 ఎకరాలు కేటాయిస్తే 2019 వరకు ఆయా భూముల్లో 252 ఎకరాలు వినియోగించలేదు. పైగా సంస్థ ఉద్యోగుల రక్తంలో సీసం స్థాయి పెరిగిందనే విషయం పీసీబీ విచారణలో వెల్లడైంది. అందుకే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. దీనిపై ఆ సంస్థకు హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో మేము వేధింపులకు పాల్పడలేదు. అమరరాజా సంస్థను తెదేపా ఎంపీ నడుపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయనడం సరికాదు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే చంద్రబాబు తన హెరిటేజ్‌ సంస్థను రాష్ట్రంలో ఎలా నడుపుతున్నారో చెప్పాలి. వచ్చే ఏడాది మార్చిలో విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తాయనడంలో సందేహం లేదు’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని