విద్యార్థులు పరీక్షా యోధులు కావాలి

‘మీరు పరీక్షా బాధితులుగా (వర్రీయర్స్‌) కాదు.. పరీక్షా యోధులుగా (వారియర్స్‌) మారాలి’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Published : 25 Jan 2023 03:57 IST

ప్రధాని రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’  పుస్తక తెలుగు ప్రతి ఆవిష్కరణలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: ‘మీరు పరీక్షా బాధితులుగా (వర్రీయర్స్‌) కాదు.. పరీక్షా యోధులుగా (వారియర్స్‌) మారాలి’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకం విద్యార్థులను ఆ దిశగా నడిపిస్తుందని చెప్పారు. మంగళవారం రాజ్‌భవన్‌లో ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ తెలుగు అనువాద ప్రతిని గవర్నర్‌ ఆవిష్కరించారు. సమావేశానికి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడారు. ‘ఈ పుస్తకం విద్యార్థులకు ఆస్తిగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆచరణాత్మక, ఆలోచన శక్తిని పెంచుతుంది. మంచి ఫలితాలను సాధించేలా దారి చూపిస్తుంది. నేతాజీ, గాంధీజీ ఆలోచనల స్ఫూర్తితో విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి’ అని కర్తవ్య బోధ చేశారు. ‘పరీక్షా పే చర్చ’ ఆరో విడతలో భాగంగా ఈ నెల 27న ప్రధాని 38లక్షలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకాలను విద్యాలయాల గ్రంథాలయాల్లో ఉంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ... ‘మన్‌ కీ బాత్‌’, ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాల్లో ప్రధాని దృష్టికి వచ్చిన అంశాలతో ఈ పుస్తకం రూపొందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని