ఉపాధ్యాయ విద్యను బోధించేవారేరీ..?

ఉపాధ్యాయ విద్యను అందించే జిల్లా విద్య, శిక్ష సంస్థ(డైట్‌)ల్లో అధ్యాపకుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయట్లేదు.

Published : 25 Jan 2023 05:33 IST

డైట్‌లలో 325 మందికి 32మందే రెగ్యులర్‌ అధ్యాపకులు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ విద్యను అందించే జిల్లా విద్య, శిక్ష సంస్థ(డైట్‌)ల్లో అధ్యాపకుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయట్లేదు. డిప్యూటేషన్లపై ఉపాధ్యాయులను నియమిస్తూ కాలం గడిపేస్తోంది. ఒకపక్క ప్రైవేటు డైట్‌ కళాశాలలను మూసివేసిన పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వసంస్థల్లో ఖాళీలను నింపట్లేదు. ఈ ఖాళీలను ప్రాధాన్యక్రమంలో భర్తీచేస్తామని కేంద్రానికి నివేదించిన అధికారులు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. దీంతో ఉపాధ్యాయ విద్యలో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 డైట్‌లు ఉండగా.. వీటిల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు 325 మంది ఉండాలి. ఇప్పుడు 32 మందే ఉన్నారు. ఒక్కో సంస్థలో 17మంది లెక్చరర్లు, ఏడుగురు సీనియర్‌ లెక్చరర్లు, ఒక ప్రిన్సిపల్‌ ఉండాలి. ఈ పోస్టులను కొన్నేళ్లుగా భర్తీ చేయడం లేదు. పాఠశాలల్లో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్లనే డిప్యూటేషన్లపై వీటిల్లో నియమిస్తున్నారు. తాజాగా కొందరి డిప్యూటేషన్లను అధికారులు రద్దుచేశారు. కేంద్రప్రాజెక్టు అనుమతుల బోర్డు(పీఏబీ) సైతం ఇటీవల ఖాళీలను భర్తీచేయాలని ఆదేశించింది. వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేటులో నాణ్యమైన విద్య అందట్లేదని, నిర్వహణ సరిగా లేదంటూ ప్రైవేటులోని దాదాపు 600 డైట్‌లను మూసివేశారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే డీఈడీ కోర్సు ఉంది. ఇలాంటి సమయంలో రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని