భారీగా తగ్గనున్న రెవెన్యూ లోటు భర్తీ నిధులు

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు భర్తీ నిధులు భారీగా తగ్గనున్నాయి.

Published : 05 Feb 2023 04:54 IST

15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు  రాష్ట్రానికి వచ్చేది రూ.2,691 కోట్లే

ఈనాడు, దిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు భర్తీ నిధులు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటా పంపిణీ చేశాక కూడా 2021-26 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.30,497 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని తేల్చిన 15వ ఆర్థిక సంఘం దాని భర్తీకి కేంద్రం గ్రాంట్లు మంజూరు చేయాలని సిఫారసు చేసింది. అందులో రూ.17,257 కోట్లను 2021-22లో, రూ.10,549 కోట్లను 2022-23లో, రూ.2,691 కోట్లను 2023-24లో ఇవ్వాలని సూచించింది. 2024-25, 2025-26 సంవత్సరాల్లో రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉండబోదని తేల్చింది. ఆ సిఫారసులను యథాతథంగా ఆమోదించిన కేంద్రం గత రెండేళ్లలో రెవెన్యూలోటు కింద రూ.27,806 కోట్లు ఇచ్చింది. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్దు కింద కేవలం రూ.2,691 కోట్లు మాత్రమే రానున్నాయి. కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన అవసరాలకు వాడుకునేది. దానివల్ల నిధుల సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఆ మేరకు తగ్గేది. ఇప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7,858 కోట్ల మేర గ్రాంట్లు తగ్గిపోతుండటంవల్ల ఆర్థిక సంక్లిష్టతలు పెరిగే అవకాశముంది.

తగ్గుతున్న ఆర్థిక సంఘం గ్రాంట్లు

15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు   విడుదల చేసే గ్రాంట్ల మొత్తం క్రమంగా తగ్గుతోంది. 2021-22లో రూ.2,07,434 కోట్ల గ్రాంట్లు విడుదల చేయగా.. 2022-23 బడ్జెట్‌లో రూ.1,92,108 కోట్లు కేటాయించింది. అంచనాల సవరణ సమయానికి అది రూ.1,73,257 కోట్లకు తగ్గింది. గత బడ్జెట్‌లో జరిపిన కేటాయింపుల్లో పట్టణ స్థానిక సంస్థలకు రూ.7,882 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.5,513 కోట్లు, వైద్య రంగం గ్రాంట్లు రూ.4,297 కోట్లు, రాష్ట్ర వైపరీత్య నిర్వహణ నిధికి రూ.1,158 కోట్ల మేర కోత పడినట్లు సవరించిన అంచనాలను బట్టి వెల్లడైంది. 2023-24బడ్జెట్‌లో 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల పద్దు కింద కేటాయింపులు రూ.1,65,480 కోట్లకు పరిమితమయ్యాయి. అందుకు ప్రధాన కారణం 17 రాష్ట్రాలకు అందించే రెవెన్యూ లోటు గ్రాంట్లు తగ్గడమే. ఇది 2021-22లో   రూ.1,18,452 కోట్లుండగా, 2022-23లో రూ.86,201 కోట్లకు తగ్గింది. 2023-24లో ఇది రూ.51,673 కోట్లకు పరిమితం కానుంది.     2022-23లో కేంద్రం నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.7,95,131.04 కోట్ల నిధులు బదిలీ కావాల్సి ఉండగా కేవలం రూ.7,62,422.74 కోట్లు (4.11%మేర కోత) మాత్రమే బదిలీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని