అదానీకి 60 ఎకరాలు

నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Updated : 09 Feb 2023 07:19 IST

విశాఖలో టెక్‌పార్క్‌కు కేటాయింపు
రామాయపట్నంలో రెండు బెర్తులు జేఎస్‌డబ్ల్యూకి..
వైకాపా కార్యాలయాలకు మూడు చోట్ల ప్రభుత్వ స్థలాలు
మంత్రివర్గం నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌, ఐటీ, బిజినెస్‌ పార్క్‌, స్కిల్‌, రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు 60.29 ఎకరాల భూమిని వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)కు కేటాయించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వైకాపా కార్యాలయాల నిర్మాణానికి రాజమహేంద్రవరంలో 2 ఎకరాలు, కర్నూలులో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన 1.60 ఎకరాలు కేటాయించారు. ఈ అంశాలు సమావేశ ఎజెండాలో ఉన్నప్పటికీ, మంత్రి వాటిని విలేకర్లకు వెల్లడించలేదు. కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నోట్‌లోనూ వైకాపా కార్యాలయాలకు స్థలం కేటాయింపు ప్రస్తావన లేదు. మరో జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయిస్తున్నట్లుగా కేబినెట్‌ సమావేశం ఎజెండాలో 52వ అంశంగా చేర్చారు. కానీ అది ఏ జిల్లా, ఎంత స్థలం కేటాయించారు అన్న వివరాలు దానిలో లేవు.

* ఏపీ హైడ్రో ప్రాజెక్టు ప్రమోషన్‌ పాలసీ-2022లోని ప్రొవిజన్‌ 3 ప్రకారం వివిధ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టు సంస్థలకు అనుమతుల మంజూరు

* ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు సుమారు 1000 మెగావాట్ల పవన విద్యుత్‌, 1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో దశల వారీగా వాటి నిర్మాణం.

* అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250 మెగావాట్లు, కురుబరాహల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా బేతంచెర్లలో 118.8 మెగావాట్లు, చిన్నకొలుములపల్లిలో 251.2 మెగావాట్లు, మెట్టుపల్లిలో 100 మెగావాట్లు, జలదుర్గంలో 130 మెగావాట్లు, విండ్‌ ప్రాజెక్టుల ఏర్పాటు. అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలలో 250 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు.

* అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో 406.46 ఎకరాలను.. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం.

* మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణసదుపాయానికి అవసరమైన రూ.3,940.42 కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ నిమిత్తం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు, మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం.

* ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. వాటి ద్వారా రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. 

* నెల్లూరు బ్యారేజ్‌ పేరును నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డినెల్లూరు బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం.

కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం

* కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

* వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఫాతిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2015-16లో కేటగిరీలో ఏతో పాటు, తర్వాత సంవత్సరానికి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ అంశాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. రూ.9.12 కోట్లు చెల్లించాలని నిర్ణయం.

* మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల విధానం అమలు. ఈ విధానంలో అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు నెలకు రూ.2,500 చొప్పున అలవెన్స్‌.

* నాడు-నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ఉన్న అన్ని తరగతులకు 30,213 ఇంటరాక్టివ్‌ ప్యానెల్‌బోర్డుల ఏర్పాటు. మిగతా వాటిలో స్మార్ట్‌ టీవీల ఏర్పాటుకు నిర్ణయం.

* కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న గౌరవవేతనానికి అదనంగా 23% పెంపు ప్రతిపాదనకు ఆమోదం.

* కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులకు కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయుల (సీఆర్టీల)తో సమానంగా గౌరవవేతనం.

* ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరించాలనే నిర్ణయానికి ఆమోదం.

* విజయనగరంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం

రెవెన్యూ డివిజన్‌గా తాడేపల్లిగూడెం

* కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం వివిధ మండల కేంద్రాల్ని మార్చడంతో పాటు, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

* ఎన్టీఆర్‌ జిల్లాలోని వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ నిర్ణయం.

* జిల్లా కేంద్రాలుగా ఉన్న విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మండలాల్ని.. గ్రామీణ, అర్బన్‌ మండలాలుగా విభజిస్తూ నిర్ణయం.

* రెవెన్యూ డివిజన్‌గా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అక్కడ కొత్త పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటుకూ ఆమోదం.

* ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గణపవరం మండలం భీమవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి మార్పు.

* విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌ నుంచి విజయనగరం రెవెన్యూ డివిజన్‌కు మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

కొత్తగా మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు

* వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్‌, జిల్లా స్థాయిలో పోస్టుల భర్తీకి నిర్ణయం. ఏపీపీఎస్సీ పరిధిలోకి రాని పోస్టులను ఈ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

* పశుసంవర్థక శాఖలో నిపుణుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ పారా వెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ చట్టం-2023 ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. దీని ప్రకారం పారా వెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.

* మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం.

* ఆంధ్రప్రదేశ్‌ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌)-2023 బిల్లు సవరణకు ఆమోదం

1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఊరట

* 1998 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో 4,534 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టుల భర్తీ. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేలు వర్తింపజేస్తారు. ప్రాథమిక విద్యాశాఖతోపాటుగా ఖాళీలను అనుసరించి బీసీ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోనూ వారిని నియమిస్తారు.

మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావ

* మార్చి 2 నుంచి విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకంలో వారంలో మూడు రోజులపాటు రాగిజావ.

* ఈ నెల 10న వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు.

* ఈ నెల 17న వైఎస్సార్‌ లా నేస్తం పథకం కింద సాయం విడుదల.

* 24న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు

* ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన అమలు.

* ఉగాది సందర్భంగా మూడో విడత ఆసరా సాయం విడుదల

* మార్చిలో ఈబీసీ నేస్తం పథకం అమలు

* మార్చిలో జగనన్న వసతి దీవెన.


జగనన్న విదేశీ విద్యాదీవెనలో మార్పులు

గనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో మార్పులు. ఇంతకు ముందు క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో 200 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకే ఈ పథకం పరిమితం. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులు/ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో మొదటి 50 కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో సీటు సాధించినవారికి జగనన్న విద్యాదీవెన వర్తింపు. గతంలో కేవలం క్యూఎస్‌ సంస్థ ర్యాంకింగ్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకోగా.. ఇకపై క్యూఎస్‌ సంస్థ ర్యాంకింగ్‌తోపాటు టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా సీటు సంపాదించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు. ఈ మార్పులతో 320 కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుబాటులో కోర్సులు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు, అర్హులైన ఇతరులకు రూ.కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని