ఏపీలో దళితులకు భద్రత కొరవడింది

ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు భద్రత లేకుండా పోయిందని, 3 జిల్లాల్లో ఏడు హత్యలు జరిగాయని విశాఖ దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 29 Mar 2023 06:40 IST

జాతీయ ఎస్సీ కమిషన్‌కు దళిత సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు భద్రత లేకుండా పోయిందని, మూడు జిల్లాల్లో ఏడు హత్యలు జరిగాయని విశాఖ దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ వేదిక ప్రతినిధుల బృందం మంగళవారం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు సుభాష్‌ పార్థిని కలిసి వినతిపత్రం అందజేసింది. సాధారణ దళిత ప్రజలతో పాటు దళిత ఎమ్మెల్యేకు రక్షణ కొరవడిందని వేదిక ఏపీ రాష్ట్ర కన్వీనర్‌ డా.బూసి వెంకటరావు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలపై ఏపీ ప్రభుత్వం తక్షణ న్యాయపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బాధితులకు ఓదార్పు, న్యాయ సహాయం కోసం కమిషన్‌ సభ్యులు ఘటనా ప్రదేశాలను సందర్శించి విచారణ జరిపి, తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న ఆరోపణలతో తనకు హాని ఉందని రక్షణ కల్పించాలని ఎస్సీ కమిషన్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారని, ఆమెకు రక్షణ కల్పించి... హాని తలపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పోలీసులు పట్టించుకోవడంలేదని, హత్యలు జరిగిన తర్వాత అనుమానాస్పద మృతిగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మార్చి 21న కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో దళితుడైన నడిపల్లి రామును ఆధిపత్య సామాజిక వర్గం హత్య చేసింది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. నిందితులు 12 మంది ఉండగా... ప్రధాన నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. ఈ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో పీఎల్‌పురంలో ఫిబ్రవరి 28న వీరనాగేంద్ర అనే యువకుడిని హత్య చేసి బావిలో పడేశారు. మార్చి 25న కడపలో డిప్యూటీ కలెక్టర్‌ డా.అచ్చెన్న హత్య పోలీసుల నిర్లక్ష్యంతోనే జరిగింది. 12వ తేదీ నుంచి కనిపించడం లేదని 14న ఆయన కుమారుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మార్చి 2న శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలంపేటలో సుదర్శన్‌రావు హత్యకు గురి కాగా ఒక్కరినే అరెస్టు చేశారు. మార్చి 11న అదే జిల్లా చిలకపాలెంలో లింగా నరేంద్రకుమార్‌ను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఫిబ్రవరి 19న విజయనగరం జిల్లా మెంతుపేట కాలనీలో వెంకటేష్‌కు విషం ఇచ్చి కొట్టి చంపారు. మార్చి 17న అదే జిల్లా పోనుగోటివలసలో ఎచ్చెర్ల వీరయ్య హత్యకు గురయ్యారు...’ అని వెంకటరావు వివరించారు.  ఏ కేసులోనూ దర్యాప్తు ముందుకు సాగలేదన్నారు. కమిషన్‌ సభ్యుడిని కలిసిన వారిలో వేదిక నాయకులు గణేష్‌, మహేశ్వర్‌రాజ్‌, రంగారావు తదితరులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు