మూతపడిన పరిశ్రమలను పునఃప్రారంభించేలా చూడండి

రాష్ట్రంలో మూతపడిన, నిర్వహణ సక్రమంగా లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గుర్తించి, సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా వాటిని పునఃప్రారంభించేలా చూడాలని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సూచించారు.

Published : 01 Apr 2023 05:16 IST

తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి
పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం

విజయవాడ (మధురానగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూతపడిన, నిర్వహణ సక్రమంగా లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గుర్తించి, సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా వాటిని పునఃప్రారంభించేలా చూడాలని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సూచించారు. విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయం ఆవరణలోని ఎంఎస్‌ఎంఈ కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఆడారి ఆనందకుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వై.వి.సుబ్బారెడ్డి తదితరులు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని నూతన ఛైర్మన్‌కు సూచించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. విశాఖ డెయిరీని సమర్థంగా నిర్వహిస్తున్న ఆనందకుమార్‌ నేతృత్వంలో ఎంఎస్‌ఎంఈలు కూడా అభివృద్ధి పథంలో వెళ్తాయన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనందకుమార్‌ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, ఔత్సాహిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్నారు. రాష్ట్రంలో 25 క్లస్టర్లను ఏర్పాటుచేసి, వాటిద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజిని, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, గాజువాక, పెందుర్తి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని