సర్వమత గ్రంథాల సారాంశమే రాజ్యాంగం

భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లోని సారాంశమే మన రాజ్యాంగమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 03:47 IST

హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఏవీ శేషసాయి

నెల్లూరు, న్యూస్‌టుడే: భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లోని సారాంశమే మన రాజ్యాంగమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి పేర్కొన్నారు. నెల్లూరు టౌన్‌హాలులో శనివారం జరిగిన ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ నెల్లూరు జిల్లా సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రైతులు, శ్రామికుల హక్కుల కోసం నిరంతరం కృషిచేసిన జస్టిస్‌ కృష్ణఅయ్యర్‌, వ్యవస్థలో నైతిక విలువల కోసం పరితపించిన ఐఏఎల్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి కృషిని ప్రస్తుతించారు. న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులకూ పెద్దదిక్కుగా వ్యవహరించిన పద్మనాభరెడ్డి హయాంలో పనిచేసిన వారిలో తాముండటం గర్వకారణమన్నారు. ఆర్థిక వెనుకబాటు న్యాయానికి, న్యాయార్థులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తున్నారని, లోక్‌అదాలత్‌లు అందులో భాగమని గుర్తుచేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ సివిల్‌ కేసుల్లో న్యాయస్థానాల పరిధిని పలు ఉదాహరణలతో వివరించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ క్రిమినల్‌ కేసుల విచారణలో సాంకేతికత వినియోగాన్ని వివరించారు. జిల్లా న్యాయమూర్తి సి.యామిని, ఐఏఎల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.ఎస్‌.సురేష్‌కుమార్‌, కార్యదర్శి వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు ఒ.అబ్బయ్యరెడ్డి, న్యాయవాదులు, న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని