శివయ్య సాక్షిగా.. రాజీ నాటకం

‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి.

Updated : 27 Mar 2024 07:21 IST

అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతను కాపాడే యత్నాలు
బలవంతంగా క్షమాపణ చెప్పించి, రాజీ చేయించే యత్నం
ఆలయ ప్రాంగణంలోనే ఆర్జేసీ విచారణ
మొక్కుబడి కేసుతో సరిపెట్టిన పోలీసులు

ఈనాడు - కాకినాడ, న్యూస్‌టుడే- గాంధీనగర్‌: ‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు’.. కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై మాజీ కార్పొరేటర్‌, వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేయడంపై దేవాదాయశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టినప్పుడు బాధిత అర్చకుడి భార్య చేసిన వ్యాఖ్యలివి. అర్చకుడు పెద్దసోమయాజుల వెంకట సత్యసాయిని సోమవారం చెంపపై కొట్టడంతోపాటు కాలితో తన్నిన చంద్రరావు, సర్దిచెప్పడానికి ప్రయత్నించిన మరో అర్చకుడు మద్దిరాల విజయ్‌కుమార్‌పైనా చేయిచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేసీ) విజయరాజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగానూ నిందితుడు చంద్రరావు మళ్లీ దూకుడుగా ప్రవర్తించారు. అర్చకుల డిమాండ్‌ మేరకు క్షమాపణ చెప్పడానికి సైతం ఇబ్బంది పడ్డారు. నేనేం దాడి చేయలేదంటూ తొలుత బుకాయించినా.. అందరూ గద్దించడంతో గత్యంతరం లేక బాధిత అర్చకుడి చేతులు పట్టుకుని, అక్కడున్న అందరికీ రెండు చేతులు జోడించి క్షమించండని కోరారు. అయితే అక్కడి నుంచి బయటకు వచ్చాక ‘నేనేం తప్పు చెయ్యలేదు.. క్షమాపణ చెప్పలేదు’ అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చేందుకు పోలీసులు చూస్తుండగా, మరికొందరు అర్చకులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు విఫలయత్నాలు చేశారు.

ఆర్జేసీపైనా బెదిరింపు ధోరణే

దేవాదాయశాఖ ఆర్జేసీ విజయరాజు విచారణకు వస్తున్నారని తెలియడంతో నిందితుడు చంద్రరావు అక్కడికి చేరుకున్నారు. అర్చకులను ఎందుకు కొట్టారని ఆర్జేసీ ప్రశ్నించగా.. తానేమీ కొట్టలేదని, కేవలం నెట్టానంటూ చంద్రరావు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు.  మిమ్మల్ని కొడితే ఊరుకుంటారా అని ఆర్జేసీ నిలదీశారు. వెంటనే చంద్రరావు గట్టిగా మాట్లాడేందుకు చూశారు. దీంతో అక్కడివారంతా కలగజేసుకొని క్షమాపణ చెబితే అంతా సర్దుకుంటుందన్నారు. నేను క్షమాపణ చెప్పనని, కాదూకూడదంటే పెట్రోలు పోసుకుంటానంటూ చంద్రరావు చొక్కా గుండీలు తీసి బెదిరించేలా ప్రవర్తించారు. దీంతో ఆర్జేసీ ‘అర్చకులు, ఉద్యోగులంటే మీకు బానిసల్లా కనబడుతున్నారా? తప్పుచేసి అలా మాట్లాడుతున్నారేంటి? వారికి అవమానం కాదా? అర్చక వ్యవస్థనే ఇబ్బంది పెడుతున్నారు. నా ముందే అలా మాట్లాడడం సరికాదు. ఉద్యోగులపై చేయిచేసుకోవడం మీ సంస్కారమా? అంత సహనం లేనప్పుడు గుడికి ఎందుకొచ్చారు? ఏమైనా ఉంటే ఈవోకు ఫిర్యాదు చెయ్యాలి కదా?’ అని మండిపడ్డారు. వెంటనే డీఎస్పీకి ఫోన్‌ చేసి బాధ్యుణ్ని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ సమయంలో పూజారి వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌ల కుటుంబసభ్యులు ఆర్జేసీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్‌తో బాధిత అర్చకుడు సత్యసాయిని మాట్లాడించారు. న్యాయం జరిగేలా చూస్తానని కమిషనర్‌ హామీ ఇచ్చారు. అందరితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఆర్జేసీ విలేకర్లతో మాట్లాడారు. దేవుడి సన్నిధిలోనే అర్చకులను కొట్టడం దురదృష్టకరమన్నారు. దాడి ఘటనపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారని, శాఖాపరంగానూ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆర్జేసీని కోరారు. 

మొక్కుబడి సెక్షన్‌తో సరి

ఈ ఘటనలో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహాని ఉందని బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. నామమాత్రమైన ఐపీసీ సెక్షన్‌ 332 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి) కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించడం గమనార్హం. ఈ సెక్షన్‌ ప్రకారం 41ఏ నోటీసిచ్చే వీలుందే తప్ప, అరెస్టు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓవైపు బాధ్యుడిపై కేసు నమోదు చేశామని, తమ అదుపులోనే ఉన్నారని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే.. మరోవైపు నిందితుడు చంద్రరావు మాత్రం    శివాలయంలో హడావుడి చేస్తూ కనిపించారు.


 ‘నేను చెయ్యి చేసుకోలేదు. ఎవర్నీ కొట్టలేదు. తోశానంతే. నేను సారీ చెప్పలేదు. పెద్దలందరూ పొరపాటయిందని చెప్పమంటే చెప్పాను అంతే’

వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు


‘నా భర్తను అంతు చూస్తానని హెచ్చరించారట.. వాళ్లు ఏమైనా చెయ్యగలరు. అదే మా భయం. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు నడుచుకుంటూ గుడికి వెళతారు. ఆయనకు ప్రాణాపాయం లేకుండా చూడాలి. 30 ఏళ్లుగా ఇక్కడ దేవుడి సేవలో ఉండిపోయాం. ఈ వయసులో ఆయన్ను కొట్టారు. ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు. మా ఆయన సేవలు ఇష్టం లేదంటే వెళ్లిపోతాం కానీ ఇలా కొట్టడమేంటి?

బాధిత అర్చకుడు వెంకటసత్యసాయి భార్య నాగమణి ఆవేదన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని