World Bank Doing Business report: చైనా.. ఇదేం పని?

ప్రపంచ బ్యాంకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏటా విడుదల చేసే సులభతర వాణిజ్య(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంకింగ్స్‌ను నిలిపివేసింది...

Updated : 18 Sep 2021 06:39 IST

దిల్లీ: ప్రపంచ బ్యాంకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏటా విడుదల చేసే సులభతర వాణిజ్య (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంకింగ్స్‌ను నిలిపివేసింది. ఆయా దేశాల్లో ప్రైవేటు పెట్టుబడులకు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ ర్యాంకింగ్స్‌ తెలియజేస్తాయి. భారత్‌, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ర్యాంకింగ్స్ ఎంతో కీలకం. ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఈ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అంతర్జాతీయ స్థాయి విధానాల రూపకల్పనకూ ఇవి దోహదం చేస్తాయి.

ఎందుకు నిలిపివేశారు?

ర్యాంకింగ్స్‌ని కేటాయించేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే.. చైనా 2017లో 78వ స్థానంలో నిలిచింది. 2018లో ఆ స్థానం మరింత దిగజారే అవకాశం ఉందని స్పష్టమైంది. దీంతో చైనా పెద్దల ఒత్తిడి మేరకు అప్పటి ప్రపంచ బ్యాంకు సీఈఓ క్రిస్టలినా జార్జియేవా, అధ్యక్షుడు జిమ్‌ యోంగ్‌ కిమ్‌ ర్యాంకులను తారుమారు చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని విల్మర్‌హేల్‌ అనే స్వతంత్ర సంస్థ దర్యాప్తు తేల్చింది. ఈ మేరకు ర్యాంకింగ్స్‌ కేటాయించేందుకు ఉపయోగించే పద్ధతిలో చైనాకు అనుకూలంగా మార్పులు చేయాలని సూచించారట! ప్రస్తుతం ఐఎంఎఫ్‌ చీఫ్‌గా ఉన్న క్రిస్టలినా దర్యాప్తు నివేదికను ఖండించారు. తాము ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు.

భారత్‌కు కలిసొస్తుందా?

ర్యాంకింగ్స్‌ కేటాయింపుల్లో చైనా అవకతవకలకు పాల్పడిందన్న సమాచారం భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చైనాలో వాతావరణం పెట్టుబడులకు అనుకూలంగా లేని కారణంగానే వారు ర్యాంకింగ్స్‌ను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమైంది. ఇక 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 63వ స్థానంలో నిలిచింది. ఐదేళ్ల వ్యవధిలో భారత్‌ ఏకంగా 79 స్థానాలు ఎగబాకడం విశేషం. పైగా భారత్‌ సమర్పించిన వివరాల్లో ఎలాంటి తేడా లేదని తేలింది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని నిపుణులు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అనేక కంపెనీలు భారత్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని