మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను త‌గ్గించుకోవ‌డం ఎలా..

ప‌న్ను ఆదా చేసేందుకు ట్యాక్స్ హార్వెస్టింగ్ ఒక మంచి పద్ధ‌తని నిపుణులు చెబుతున్నారు

Updated : 24 Mar 2021 15:31 IST


ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. గత సంవ‌త్స‌ర కాలంలో మార్కెట్లు 90 శాతం మేర పెరిగినందున‌, స‌రైన స‌మ‌యంలో ఈక్వీటీల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారు మంచి లాభాల‌ను ఆర్జించార‌నే చెప్పొచ్చు. ఈక్వీటీ పెట్టుబ‌డుల నుంచి వ‌చ్చే మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల ప‌న్నుత‌గ్గించుకునేందుకు స‌రైన ప్ర‌ణాళిక అవ‌స‌రం.  షేర్లు, మ్యూచు‌వల్ ఫండ్లతో సహా ఈక్విటీలను ఏడాది కంటే ఎక్కువ కాలం కొన‌సాగిస్తే, వాటిని దీర్ఘ‌కాలంగా ప‌రిగ‌ణిస్తారు. ఇవి అమ్మ‌డం ద్వారా వచ్చిన మూల‌ధ‌న లాభాలు రూ.1 ల‌క్ష‌కు పైగా ఉంటే , వాటిని దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి(ఎల్‌టీసీజీ) ప‌రిగ‌ణించి, వీటిపై 10 శాతం మేర ప‌న్ను విధిస్తారు.  ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనలను అనుస‌రించి, ప‌న్ను చెల్లింపుదారులు ఈక్విటీల పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఎల్‌టీసీజీకి వ‌ర్తించే ప‌న్ను ఎలా త‌గ్గించ‌వ‌చ్చో ఇప్పుడు చూద్దాం.  

ట్యాక్స్ హార్వెస్టింగ్..
‌ఈ పద్ధతి ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు ఈక్విటీలలో రూ.1ల‌క్ష వ‌ర‌కు ఉన్న దీర్ఘకాలిక లాభాలను సేక‌రించి తిరిగి పెట్టుబ‌డి పెట్టాలి. తిరిగి పెట్టిన పెట్టుబ‌డుల విలువను కొత్త‌ స‌ముపార్జ‌న ఖ‌ర్చుగా ప‌రిగ‌ణించాలి.  ఎల్‌టీసీజీ విషయంలో రూ.1ల‌క్ష వ‌ర‌కు మినహాయింపును సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను పునరావృతం చేయవచ్చు. దీని ద్వారా, ఏడాదికి రూ.10వేల‌ వరకు పన్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఈ మినహాయింపు ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ నుంచి వ‌చ్చిన‌ మొత్తం దీర్ఘకాలిక మూలధన లాభాలపై లభిస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కి, మార్చి 2018లో యూనిట్ రూ.50 చొప్పున‌, 10వేల ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కొనుగోలు చేశార‌నుకుందాం. ఈక్విటీ పెట్టుబ‌డుల విష‌యంలో 'గ్రాండ్‌ఫాద‌రింగ్‌' నిబంధ‌న ఉంది, దీని ప్ర‌కారం జ‌న‌వ‌రి 31, 2018 వ‌ర‌కు ఈక్వీటీ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన ఎల్‌టిసీజీపై ప‌న్ను వ‌ర్తించ‌దు. అంద‌వ‌ల్ల ఒక వ్య‌క్తి ఈ తేది కంటే ముందుగా ఈక్వీటీల‌లో పెట్టుబ‌డి పెడితే,  షేర్లు విలువ‌, జ‌న‌వ‌రి31,2018 నాటికి ఉన్న ఈక్వీటీ మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు, అస‌లు కొనుగోలు ధ‌రల‌లో ఎక్కువ‌గా ఉన్న దాన్ని స‌ముపార్జ‌న ఖ‌ర్చుగా ప‌రిగ‌ణిస్తారు.  కానీ మ‌నం తీసుకున్న ఉదాహ‌ర‌ణ‌లో పెట్టుబ‌డులు జ‌న‌వ‌రి 31,2018 త‌రువాత చేసినందున 'గ్రాండ్‌ఫాద‌రింగ్‌' నిబంధ‌న వ‌ర్తించ‌దు. కాబట్టి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) ఇప్పుడు రూ. 75 అయితే, వ్యక్తి సుమారు 4,000 యూనిట్లను విక్ర‌యించ‌వచ్చు, ఇక్కడ ఎల్‌టిసీజీ సుమారు రూ.1 లక్ష ఉంటుంది. ఈ యూనిట్ల‌లో వ‌చ్చిన రాబ‌డిని బుక్ చేసుకుని తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.  

ప‌న్ను ఆదా చేసేందుకు ట్యాక్స్ హార్వెస్టింగ్ ఒక మంచి పద్ధ‌తని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీలను సరిగ్గా అంచనా వేయడంతో పాటు, స‌మ‌యం వృథాకాకుండా ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని సంద‌ర్భాల‌లో మ‌దుప‌ర్లు తీసుకున్న లాభాల‌లో తిరిగి పెట్టుబ‌డి పెట్టేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటారు. లేదా కొంత మొత్తాన్ని మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంటారు. దీని కార‌ణం  బ్యాంకుకి బ‌దిలీ అయిన‌ మొత్తాన్ని వేరే కార‌ణాల‌తో ఖ‌ర్చు చేస్తుంటారు లేదా వేరే చోటికి మ‌ళ్ళిస్తుంటారు. ఈ లోపు స‌మ‌యం వృధా అవుతుంది. స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డి పెట్ట‌లేరని నిపుణ‌లు చెబుతున్నారు. 

అలాగే, మ్యూచువల్ ఫండ్లలో లాభాలు తీసుకున్న రోజునే, తిరి‌గి పెట్టుబ‌డి పెట్టడం కష్టం. ప్రాసెస్ పూర్త‌యి డ‌బ్బు జ‌మ అయ్యేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి తిరిగి పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు కొంత ఎక్కువ మొత్తం అవ‌స‌రం అయ్యే అవ‌కాశం ఉంది. అదేవిధంగా షేర్లు కూడా ఒడిదుడుకుల‌కు లోనౌతుంటాయి. కాబ‌ట్టి అదే ధ‌ర వ‌ద్ద తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. 

ఛార్జీలు:
ట్యాక్స్ హార్వెస్టింగ్ విధానం ద్వారా ఎల్‌టీసీజీ మొత్తంలో 10శాతం ఆదా చేసుకోవ‌చ్చు. అయితే ఈ విధానంలో సెక్యూరీటీ లావాదేవీల ప‌న్ను, స్టాంప్ డ్యూటీ, బ్రోకెరేజ్‌,  మొద‌లైన చిన్న చిన్న ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఇవి మొత్తం క‌లిపితే మీరు ఆదా చేసుకునే మొత్తంలో 1 శాతం వ‌ర‌కు ఉండొచ్చు. 

నష్టాల బ‌దిలీ:
 మీ మూలధన లాభాల పన్నును తగ్గించే మరో మార్గం నష్టాలతో లాభాలను సెట్ చేయడం. "స్వల్పకాలిక మూలధన నష్టాలను, దీర్ఘకాలిక మూలధన లాభాలు, స్వల్పకాలిక మూలధన లాభాలు (ఎస్‌టిసిజి) రెండింటితో సెట్ చేసేందుకు వీలుంటుంది. అయితే దీర్ఘకాలిక మూలధన నష్టాలను  ఎల్‌టీసీజీతో మాత్రమే సెట్ చేయవచ్చు.

ఒక ఆస్తిలో వచ్చిన మూల‌ధ‌న న‌ష్టాల‌ను వేరొక ఆస్తిలో వ‌చ్చిన మూల‌ధ‌న లాభాల‌తో భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. దీనికి ఎలాంటి ప‌రిమితులు లేవు. అయితే ఆ రెండు ఆస్తులు మూల‌ధ‌న రాబ‌డి హెడ్‌ కింద‌కి వ‌స్తే స‌రిపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కు, భూమి అమ్మ‌డం ద్వారా దీర్ఘ‌కాల మూల‌ధ‌నం న‌ష్టం ఉంటే, దానిని ఈక్వీటీ పెట్టుబ‌డుల నుంచి వ‌చ్చిన ఎల్‌టీసీజీతో స‌మానంగా స‌రి చేయ‌వ‌చ్చు. 

అలాగే, స్వల్ప, దీర్ఘకాలిక మూలధన నష్టాలను రాబోయే ఎనిమిది సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లవచ్చు. అంటే ప్ర‌స్తుత న‌ష్టాల‌ను భవిష్యత్ సంవత్సరపు లాభాలతో భ‌ర్తీ చేయోచ్చు.  పన్ను చెల్లింపుదారుడు నష్టాలను ముందుకు తీసుకువెళ్ళే క్ర‌మంలో పరిగణనలోకి తీసుకోవలసిన మరో ముఖ్యమైన అంశం, ఐటి చట్టం 139 పేర్కొన్న గడువు తేదీలోపు ఆదాయపు పన్ను రిట‌ర్నుల‌‌ను సక్రమంగా దాఖలు చేయడం. లేకపోతే,  మూలధన నష్టాలు ముందు సంవ‌త్స‌రాల‌కు తీసుకెళ్లడానికి అనుమతించరు.

మిన‌హాయింపులు: 
ఈక్వీటీ పెట్టుబ‌డుల నుంచి తీసుకున్న‌ దీర్ఘ‌కాలిక లాభాల‌పై ప‌న్ను త‌గ్గించుకునేందుకు మ‌రొక మార్గం సెక్ష‌న్ 54ఈసీ బాండ్లు. వీటినే క్యాపిట‌ల్ గెయిన్ బాండ్లు అనికూడా అంటారు. సాధార‌ణంగా ఆర్థిక నిపుణులు వీటిని సిఫార‌సు చేయ‌రు. ఎందుకంటే వీటిలో 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. ఈ బాండ్ల‌పై ప్ర‌స్తుత రాబ‌డి రేటు 5శాతం. 

ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా ఈక్వీటీల‌లో వ‌చ్చే ఎల్‌టీసీజీ ఆదాచేసుకోవ‌చ్చు. అమ్మిన ఆస్తుల(నివాస గృహాం కాని)‌పై వ‌చ్చే ఎల్‌టీసీజీ ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 54 ఎఫ్ ద్వారా రెండు మార్గాలు ఉన్నాయి-
1. కొత్త నివాస గృహం కొనుగోలు - ఆస్తి అమ్మిన  2 సంవ‌త్స‌రాల లోపు గానీ, అమ్మే సంవ‌త్స‌రం ముందుగానీ  
2. ఇల్లు నిర్మించా‌నుకుంటే  - 3 సంవత్సరాలలోపు ఇది చేయాలి‌

ఆదాయ‌పు ప‌న్నును పూర్తిగా త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాదు. అయితే త‌గ్గించుకునేంద‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. వీటి ద్వారా సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌నం ఒక రూపాయి ఆదా చేసామంటే, ఆ రూపాయి సంపాదించిన‌ట్టే కదా.  ఏదిఏమైనా, మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగానే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాల‌నేదే నిపుణుల స‌ల‌హా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని