ICICI Bank: దుమ్మురేపుతున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు

జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ అద్భుతమైన ఫలితాలు ప్రకటించడంలో సోమవారం ఈ సంస్థ షేర్లు భారీగా దూసుకెళ్లాయి....

Updated : 25 Oct 2021 13:05 IST

ముంబయి: జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ అద్భుతమైన ఫలితాలు ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఈ సంస్థ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. ఓ దశలో 14 శాతానికి పైగా ఎగబాకి బీఎస్‌ఈలో రూ.858 వద్ద.. ఎన్ఎస్‌ఈలో రూ.867 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఐసీఐసీఐ మార్కెట్‌ విలువ రూ.6 లక్షలకు చేరువయ్యింది. రికార్డు స్థాయి లాభాలతో పాటు నిరర్థక ఆస్తులు తగ్గడంతో మదుపర్లలో విశ్వాసం, ఉత్సాహం పెరిగింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో ఈసారి అత్యధిక త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. అన్ని విభాగాల్లో రుణాల వృద్ధికి తోడు మొండి బకాయిలు తగ్గడంతో నికరంగా రూ.5,511 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,251 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,651 కోట్ల నుంచి రూ.26,031 కోట్లకు పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంక్‌ రూ.6,092 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఒక త్రైమాసికంలో అత్యధిక లాభమే. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,882 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.39,289.60 కోట్ల నుంచి స్పల్పంగా పెరిగి రూ.39,484.50 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.17 శాతం నుంచి 4.82 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1 శాతం నుంచి 0.99 శాతానికి మెరుగయ్యాయి.


రిలయన్స్‌ ఆరంభ లాభాలు ఆవిరి

గత శుక్రవారం వెలువడ్డ రిలయన్స్‌ ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. దీంతో ఆరంభంలో స్టాక్స్‌ అదరగొట్టాయి. దాదాపు మూడు శాతం ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఓ దశలో షేరు విలువ రూ.2,680 వద్ద గరిష్ఠానికి చేరింది. అయితే, గత కొన్ని రోజుల బుల్‌ రన్‌లో భారీగా లాభపడ్డ ఈ స్టాక్ గరిష్ఠాల వద్ద నమోదవుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.85 శాతం నష్టంతో రూ.2,605 వద్ద ట్రేడవుతోంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబరు త్రైమాసికంలో అదరగొట్టింది. చమురు నుంచి రిటైల్‌ వరకు అన్ని రంగాలు రాణించడంతో ఏకీకృత ప్రాతిపదికన రూ.13,680 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.9,567 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. షేరుపై లాభం రూ.14.84 నుంచి రూ.20.88కు పెరిగింది. ముడిచమురు ధరలు గణనీయంగా పెరగడం, టెలికాం విభాగంలో వినియోగదారుపై సగటు ఆదాయం పెరగడం వంటి అంశాలు సంస్థ లాభాన్ని పెంచాయి. మొత్తం ఆదాయం 49 శాతం పెరిగి రూ.1,91,532 కోట్లకు వృద్ధి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని