ఇన్‌క‌మ్ ట్యాక్స్ కాలిక్యులేట‌ర్‌తో ప‌న్ను లెక్కించ‌డం చాలా సుల‌భం

ఆదాయ ప‌న్ను పాత లేదా కొత్త రెండు ప‌న్ను విధానాల్లో ఎందులో మీకు ప‌న్ను ఆదా అవుతుందో ఇ-కాలిక్యులేట‌ర్‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు  

Updated : 01 Jan 2021 20:00 IST

ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండు విధానాల్లో ఏది ఎంచుకోవాల‌నే దానిపై వేతన జీవులు ఆలోచిస్తున్నారు. మ‌రి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఎలా తెలుసుకుంటారు. అయితే సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భించే పీపీఎఫ్‌, బీమా, ట్యూష‌న్ ఫీజు, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువ‌ల్ ఫండ్లు వంటివాటిలో పెట్టుబ‌డులు లేనివారికి కొత్త ప‌న్ను విధానంతో ప్ర‌యోజ‌నం పొందుతారు. పెట్టుబ‌డులు ఉన్న‌వారికి మిన‌హాయింపులు ల‌భిస్తాయి కాబ‌ట్టి పాత ప‌న్ను విధానాన్నే కొన‌సాగించ‌వ‌చ్చు.

ఈ రెండింటికి మ‌ధ్య వ్య‌త్యాసం తెలుసుకునేందుకు ఆదాయ ప‌న్ను శాఖ ప్ర‌వేశ‌పెట్టిన ఇ-కాలిక్యులేట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఐటీ శాఖ వెబ్ పోర్టల్ లో ప్రత్యేక కాలిక్యులేటర్ ఏర్పాటు చేసింది. దీంతో పాత పద్ధతిలో , కొత్త విధానంలో చెల్లిస్తే ఎంత‌ పన్ను ఆదా అవుతుంది అనేది తెలసుకోవచ్చు. ఇందులో వ్యక్తి తమ వయస్సుతో పాటు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం పాత విధానంలో పన్ను ఎంత పడుతుంది? కొత్త విధానంలో పన్ను కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునే వీలుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీ వార్షిక ఆదాయం రూ.10 ల‌క్ష‌లు అయితే ఎలాంటి మిన‌హాయింపులు, త‌గ్గింపులు లేక‌పోతే పాత ప‌న్ను విధానం ప్ర‌కారం రూ.1,17,000 ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త ప‌న్ను విధానంలో అయితే రూ.78,000 ప‌డుతుంది. అంటే కొత్త ప‌న్ను విధానం ప్ర‌కారం అయితే రూ.39,000 ఆదా అవుతుంది. అదే రూ.2 లక్ష‌లు క్లెయిమ్ చేసుకుంటే కొత్త ప‌న్ను విధానంలోనే రూ.2,600 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మిన‌హాయింపులు క్లెయిమ్ చేసుకుంటే పాత విధానం, పెట్టుబ‌డులు లేన‌ప్పుడు కొత్త విధానం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆదాయ ప‌న్ను శాఖ ప్ర‌వేశ‌పెట్టిన కాలిక్యులేట‌ర్‌తో సుల‌భంగా ప‌న్ను చెల్లింపుదారులో లెక్కించుకోవ‌చ్చు. నిపుణుల అవ‌స‌రం రాద‌ని ఆదాయ శాఖ చెప్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని