కొవిడ్-19 పీఎఫ్ క్లెయిమ్‌లు ఆల‌స్యం కావ‌డానికి కార‌ణాలు

క్లెయిమ్ ఫైలింగ్ ప్రక్రియలో ఉద్యోగులు అప్‌లోడ్ చేసిన పత్రాలు స‌రిగా లేక‌పోతే క్లెయిమ్ ఆలస్యం లేదా తిరస్కరణలు జరుగుతాయి......

Published : 23 Dec 2020 15:47 IST

క్లెయిమ్ ఫైలింగ్ ప్రక్రియలో ఉద్యోగులు అప్‌లోడ్ చేసిన పత్రాలు స‌రిగా లేక‌పోతే క్లెయిమ్ ఆలస్యం లేదా తిరస్కరణలు జరుగుతాయి.

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో కొంత అదనపు నగదు కావాలనుకునే ఖాతాదారుల నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రత్యేక కోవిడ్ -19 ఉపసంహరణ క్లెయిమ్ ను స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి నిధుల క్రెడిట్ ఆలస్యం గురించి ఫిర్యాదులు వస్తున్నాయి.

కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి ఈపీఎఫ్ సభ్యులు దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్‌ల‌ను మూడు పని దినాలలోపు పరిష్కరిస్తామని ఈపీఎఫ్ఓ ​​తెలిపింది. హక్కుదారుడి బ్యాంక్ ఖాతాకు నగదు మొత్తాన్ని జమ చేసేందుకు చెక్కును బ్యాంకుకు పంపుతుంది. మీ ఖాతాలో నిధులను జమ చేయడానికి బ్యాంకులు సాధారణంగా ఒకటి నుంచి మూడు పని దినాల సమయం తీసుకుంటాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈపీఎఫ్ఓ మీ మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా మీ ఖాతాలోని మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం, ఏది తక్కువగా ఉంటే దానిని ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈపీఎఫ్ఓ ప్రకారం, ఈ అడ్వాన్స్ పై ఆదాయపు పన్ను వర్తించదు.

గత నెల వరకు, పీఎంజీకేవై ప్యాకేజీ కింద 7.40 లక్షల కోవిడ్ -19 క్లెయిమ్‌లతో సహా మొత్తం 12.91 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించారు. పీఎంజీకేవై ప్యాకేజీ కింద మొత్తం రూ. 4,684.52 కోట్లను పంపిణీ చేస్తే, ఇందులో రూ. 2,367.65 కోట్లు కోవిడ్ క్లెయిమ్‌లు ఉన్నాయి.

బ్యాంకు పాస్‌బుక్ లేదా చెక్ క్లియ‌ర్‌గా లేక‌పోవ‌డం
ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకునేందుకు బ్యాకు పాస్‌బుక్, ఖాతా స్టేట్‌మెంట్ లేదా చెక్‌ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కాన్ చేసే డాక్యుమెంట్‌పై బ్యాంకు ఖాతా నంబ‌ర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, స‌భ్యుని పేరు స్ప‌ష్టంగా క‌నిపించే విధంగా ఉండాలి. ఈ బ్యాంకు కేవైసీ వివ‌రాలు యూఏఎన్‌తో అనుసంధానం చేసి ఉండాలి. ఇలా వివ‌రాల్లో స్ప‌ష్ట‌త లోపించిన , వివ‌రాల్లో త‌ప్పులు ఉన్నా తిరిగి చేయాల్సిందిగా ఈపీఎఫ్ఓ కోరుతుంది.

బ్యాంకు ఖాతా వివ‌రాల్లో త‌ప్పులు
యూఏఎన్‌తో బ్యాంకు ఖాతా వివ‌రాలు, ఐఎఫ్ఎస్‌సీ, యూఏఎన్ వివ‌రాల‌తో స‌రిపోక‌పోతే క్లెయిమ్ తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది. మీ సంస్థ చేసిన త‌ప్పుల వ‌ల‌న కూడా ఇది జ‌ర‌గ‌వ‌చ్చు. కొన్నిసార్లు మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతా ప‌నిచేయ‌క‌పోతే కూడా ఇలా జ‌రుగుతుంది. అందుకే బ్యాంక్ ఖాతాను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా చేసుకునే అవ‌కాశం ఉంది.

మీ బ్యాంకు ఖాతా యూఏఎన్ లో అప్ టూ డేట్ గా ఉందని నిర్ధారించుకోండి. మీరు బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలనుకుంటే మీ సంస్థ యజమాని ఆమోదంతో చేయవచ్చు. బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లను తప్పుగా నమోదు చేసినట్లయితే, బ్యాంకుకు పంపిన చెల్లింపులు వెనక్కి వెళ్ళడానికి దారితీస్తుందని ఈపీఎఫ్ఓ ​​తెలిపింది.

త‌గినంత బ్యాలెన్స్ లేక‌పోతే
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈపీఎఫ్ఓ మీ మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా మీ ఖాతాలోని మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం, ఏది తక్కువగా ఉంటే దానిని ఉపసంహరించుకోవ‌చ్చు. అంత‌కంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తే తిరస్క‌రించ‌బ‌డుతుంది. ఈపీఎఫ్ఓ ప్రకారం, ఈ అడ్వాన్స్ పై ఆదాయపు పన్ను వర్తించదు.

బ్యాంక్‌ల ఆల‌స్యం
ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌ను ప‌రిష్క‌రించిన‌ మూడు రోజుల్లోపు సాధారణంగా చెక్కును బ్యాంకుకు ఇస్తుంది. బ్యాంకులు సాధారణంగా డబ్బును ఉద్యోగి ఖాతాకు క్రెడిట్ చేయడానికి ఒకటి నుండి మూడు రోజులు అదనంగా పడుతుంది. ఈపీఎఫ్ క్లెయిమ్ ఆల‌స్యం కాకూడ‌దంటే అన్ని డాక్యుమెంట్లు, బ్యాంకుల వివ‌రాలు స‌రిగా ఉండేలా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని