SBI Alert: జులై 1 నుంచి కొత్త ఛార్జీలు

స‌వ‌రించిన ఛార్జీలు వ‌చ్చే నెల అంటే జులై 1, 2021 నుంచి అమ‌లులోకి రానున్నాయి

Updated : 29 Jun 2021 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎమ్, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే న‌గ‌దు విత్‌డ్రాల‌పై సేవా రుసుముల‌ను స‌వ‌రించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం ఈ కొత్త ఛార్జీలు.. చెక్‌బుక్, న‌గ‌దు బ‌దిలీ, ఇత‌ర ఆర్థికేత‌ర లావాదేవీలకు వ‌ర్తిస్తాయి. పున‌రుద్ధ‌రించిన కొత్త సేవా రుసుములు జులై1, 2021 నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని, బేసిక్ సేవింగ్స్‌ బ్యాంక్ డిపాజిట్‌(బీఎస్‌బీడి) ఖాతాదారుల‌కు కూడా ఈ రుసుములు వ‌ర్తిస్తాయ‌ని బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐ బీఎస్‌బీడి ఖాతా అంటే..

జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్ర‌సిద్ధి చెందిన ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతా స‌మాజంలోని పేద వ‌ర్గాల‌ను ఉద్దేశించింది. రెగ్యుల‌ర్‌ పొదుపు ఖాతాకు వ‌ర్తించే వ‌డ్డీ రేట్లే జీరో బ్యాలెన్స్ ఖాతాలకూ వ‌ర్తిస్తాయి.

ఎస్‌బీఐ బ్రాంచ్‌లు, ఏటీఎమ్‌ల‌ వ‌ద్ద న‌గ‌దు విత్‌డ్రాల‌పై..

ఒక నెల‌లో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎమ్ వ‌ద్ద క‌లిపి నాలుగు ఉచిత న‌గ‌దు లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు. అంత‌కు మించి చేసే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్‌/ ఏటీఎమ్ వ‌ద్ద ప‌రిమితికి మించి చేసే ఒక్కో కొత్త న‌గ‌దు విత్‌డ్రా లావాదేవీకి రూ.15+జీఎస్‌టీ వ‌సూలు చేస్తారు. ఈ విత్‌డ్రాలు హోమ్ బ్రాంచ్, నాన్ ఎస్‌బీఐ ఎటీఎమ్ వ‌ద్ద చేసినా ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

చెక్‌బుక్ ఛార్జీలు..

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎస్‌బీడీ ఖాతాదారుల‌కు 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా ఇస్తుంది ఎస్‌బీఐ. ఆ త‌రువాత అందించే చెక్కుల‌కు కొంత మొత్తాన్ని వ‌సూలు చేస్తుంది.

* 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.40+జీఎస్‌టీ

* 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.75+జీఎస్‌టీ

అత్య‌వ‌స‌ర చెక్ బుక్.. 10 లీవ్స్ లేదా అందులో కొంత భాగం ఉన్న చెక్‌బుక్‌కి రూ.50+జీఎస్‌టీ. అయితే, ఈ కొత్త చెక్‌బుక్ స‌ర్వీస్ ఛార్జీల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్లకు మిన‌హాయింపునిచ్చారు.

విత్‌డ్రా ప‌రిమితులు..

ఎస్‌బీఐ, ఎస్‌బీఐయేత‌ర బ్యాంక్ శాఖల‌లో బీఎస్‌బీడీ ఖాతాదారుల‌కు సంబంధించిన ఆర్థికేత‌ర లావాదేవీల‌పై ఎటువంటి రుసుములు వ‌ర్తించ‌వు. ఈ ఖాతాదారుల‌కు  బ్రాంచ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఉచితం. క‌రోనా సెకండ్‌ వేవ్ నేప‌థ్యంలో నాన్‌-హోమ్ బ్రాంచ్‌ల వ‌ద్ద చెక్ లేదా క్యాష్ విత్‌డ్రా ఫార‌మ్‌ల‌ను ఉప‌యోగించి చేసే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ ప‌రిమితిని ఎస్‌బీఐ పెంచింది. వినియోగ‌దారుల‌కు మ‌ద్ద‌తునిచ్చేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్‌బీఐ త‌న ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది.

దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ చెక్ ద్వారా స్వ‌యంగా చేసే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ రోజువారి ప‌రిమితిని రూ.1 ల‌క్ష‌కు పెంచింది. విత్‌డ్రా ఫారం, బ్యాంకు పొదుపు ఖాతా పాస్‌బుక్ ద్వారా చేసే న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ రోజువారి ప‌రిమితిని రూ.25 వేల‌కు పెంచింది. థ‌ర్డ్ పార్టీ క్యాష్ విత్‌డ్రాల‌ను నెల‌కు రూ.50 వేలకు ప‌రిమితం చేసింది. ఇవి చెక్‌ను ఉప‌యోగించి మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది. ఈ సవ‌రించిన ఛార్జీలు సెప్టెంబ‌రు 30, 2021 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని