మ్యూచువల్ ఫండ్లతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా!

మన ఆర్ధిక ల‌క్ష్యాల‌కు అనుకూలంగా, నిపుణుల పర్యవేక్షణలో పనిచేసే పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్లు. మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపుచేయ‌డం ద్వారా కలిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రంగా తెలుసుకుందాం.....

Published : 16 Dec 2020 13:55 IST

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం!​​​​​​​

మన ఆర్ధిక ల‌క్ష్యాల‌కు అనుకూలంగా, నిపుణుల పర్యవేక్షణలో పనిచేసే పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్లు. మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపుచేయ‌డం ద్వారా కలిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రంగా తెలుసుకుందాం.

నిపుణుల నిర్వహణ :

సాధారణ మ‌దుప‌ర్ల‌కు వివిధ రకాల పెట్టుబడి సాధనాలను లోతుగా విశ్లేషించడం, సరైన సమయం లో పెట్టుబడి పెట్టడం, సమయానుసారంగా సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్లు అనుకూలమైనవి. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ కు చెందిన నిపుణులు మన పెట్టుబడుల‌ను నిర్వహిస్తారు. వీరు మ్యూచువల్‌ ఫండ్‌ పథకం లక్ష్యాలను సాధించేందుకు సరైన పెట్టుబడి మార్గాలను ఎంచుకుని సమర్ధం గా నిర్వహిస్తారు.

విభిన్నత :

“Don’t Put all your eggs in a single basket” అనే ఇంగ్లీష్ సామెత పెట్టుబడుల విషయంలోనూ వర్తిస్తుంది. పెట్టుబడులను మన నష్టభయాన్ని అనుసరించి వివిధ సాధనాలలో పెట్టడం అవసరం. దీంతో నష్టభయం తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. డెట్‌ ఫండ్లు, ప్రభుత్వ బాండ్లు, టి - బిల్లులు, కంపెనీ డిపాజిట్లు, ఇతర స్థిర ఆదాయ మార్గాలలో పెట్టుబడి పెడతాయి.

అనుకూలత (ఫ్లెక్సిబిలిటీ) :

వివిధ రకాల వ్యక్తులకు విభిన్న ఆదాయ మార్గాలు, ఖర్చు చేసే పద్ధతులు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఉండాలి. మ‌దుప‌ర్ల ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వారి అవసరాలకు తగినట్టు పెట్టుబడి కాలపరిమితి ఒక్క రోజు నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. కనీస పరిమితి రూ.500 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్‌ ఫండ్లు అవకాశం కల్పిస్తున్నాయి.

నగదు రూపంలో మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) :

పెట్టుబడులను మనకు కావలసిన సమయంలో నగదు రూపంలోకి మార్చుకునే సౌలభ్యాన్ని లిక్విడిటీ అంటారు. అంతిమంగా పెట్టుబడి లక్ష్యం సరైన సమయానికి రాబడి చేతికంది, అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. కాదంటారా?
అన్ని పనిదినాల్లోనైనా ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపి మన సొమ్మును వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంది. పది రోజుల్లో మనకు హామీ ఇచ్చిన సొమ్ము చేతికందకపోతే అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీపై 15శాతం జరిమానా పడుతుంది.

పారదర్శకత, సురక్షిత :

పొదుపు చేసిన సొమ్ము వేరొకరికి అప్ప‌గించాలంటే ఒకలాంటి అభద్రతాభావం, అపనమ్మకం సహజం. మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో సొమ్మును ఓ నిపుణుడి చేతిలో ఉంచుతారు. ఆ నిపుణుడి పని మార్కెట్‌ పరిస్థితులను విశ్లేషించడం, పెట్టుబ‌డికి ఉత్తమ రాబడులను తెచ్చేందుకు మంచి మార్గాలను అన్వేషించడం. మ్యూచువల్ ఫండ్ల పనితీరును వివిధ రకాల ప్రచురణ మాధ్యమాలు, రేటింగ్‌ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు అందిస్తుంటాయి. తాజా సమాచారం మదుపర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఫండ్ నిర్వహాణ సంస్థ‌లు చూసుకుంటాయి. ఉదాహరణకు రోజువారీ ఎన్‌ఏవీలు, ఫండ్‌ మేనేజర్‌ వ్యూహం, పెట్టుబడి పెట్టే షేర్ల వివరాలు తెలియపరుస్తారు.

నియంత్రణలు :

అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్లు సెబీ వద్ద రిజిస్టర్ అయ్యి ఉంటాయి, సెబీ నిర్దేశించిన అన్ని నియమనిబంధనలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కచ్చితంగా పాటించి మదుపర్ల పెట్టుబడికి రక్షణగా ఉండాలి. వాటికి సంబంధించిన అన్నివ్యవహారాలను సెబీ పర్యవేక్షిస్తూనే ఉంటుంది.

చిన్న‌మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉండే విధంగా త‌క్కువ పెట్టుబ‌డి, మ‌దుప‌ర్ల న‌ష్ట‌భ‌యానికి త‌గ్గ‌ట్టుగా స‌రిపోయేర‌క‌ర‌కాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. త‌క్కువ వ్య‌యంతోనే మ‌దుప‌ర్ల‌ పెట్టుబ‌డికి నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, పారద‌ర్శ‌క‌త, వైవిధ్య‌త మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా ల‌భిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని