iPhone 5G Update: డిసెంబరులో ఐఫోన్‌ 5జీ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌!

iPhone 5G Update: 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను డిసెంబర్‌ నాటికి అప్‌డేట్‌ చేస్తామని యాపిల్‌ తెలిపింది. ఈ విషయంపై నేడు వివిధ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది.

Updated : 12 Oct 2022 12:23 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలు ప్రారంభమైనప్పటికీ.. ఇంకా స్మార్ట్‌ఫోన్లు దానికి అనువైన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాల్సిన ఉందన్న వార్తలపై ఐఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ స్పందించింది. డిసెంబరు నాటికి ఐఫోన్‌ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ అందిస్తామని మంగళవారం తెలిపింది. 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు సఫలమైన వెంటనే అప్‌డేట్‌ అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్‌ ఎస్‌ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని ఎయిర్‌టెల్‌, జియో 5జీ నెట్‌వర్క్‌లపై యాపిల్‌ పరీక్షిస్తోంది.

దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే ‘5జీ రెడీ’ అని ప్రకటిత స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. వీటన్నింటికీ 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌, వివో, షియోమీ వంటి మొబైల్‌ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్‌ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని